Wimbledon winner Alcaraz : వింబుల్డన్‌కు నయా రాజు

ABN , First Publish Date - 2023-07-17T00:55:59+05:30 IST

2018 నుంచి వరుసగా వింబుల్డన్‌ ఎగరేసుకుపోతున్నాడు.. మరొక్క గ్రాండ్‌స్లామ్‌తో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలుద్దామనుకున్నాడు.. పదేళ్లుగా సెంట్రల్‌ కోర్టులో ఓటమన్నదే లేకుండా దూసుకెళుతున్నాడు.. ఇలా ఆల్‌ ఇంగ్లండ్‌

Wimbledon winner Alcaraz : వింబుల్డన్‌కు నయా రాజు

జొకోవిచ్‌ కంటతడి

టైటిల్‌ విజేత స్పెయిన్‌ కుర్రాడు అల్కరాస్‌

ఫైనల్లో జొకోవిచ్‌కు షాక్‌.. జైత్రయాత్రకు చెక్‌

24వ గ్రాండ్‌స్లామ్‌ రికార్డుకు బ్రేక్‌

2018 నుంచి వరుసగా వింబుల్డన్‌ ఎగరేసుకుపోతున్నాడు..

మరొక్క గ్రాండ్‌స్లామ్‌తో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలుద్దామనుకున్నాడు..

పదేళ్లుగా సెంట్రల్‌ కోర్టులో ఓటమన్నదే లేకుండా దూసుకెళుతున్నాడు.. ఇలా ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఎదురులేకుండా సాగుతున్న నొవాక్‌ జొకోవిచ్‌ జైత్రయాత్రను ఒక్కడు అడ్డుకున్నాడు.. ఐదు సెట్ల పాటు ఆసక్తిదాయకంగా సాగిన వింబుల్డన్‌ ఫైనల్లో చాంపియన్‌కు ఎదురొడ్డి నిలిచాడు. మొదటి సెట్‌ను కోల్పోయినా దెబ్బతిన్న బెబ్బులిలా జొకోపై విరుచుకుపడి కెరీర్‌లో తొలి వింబుల్డన్‌ అందుకుని మురిసిపోయాడు. అతడే.. 20 ఏళ్ల కార్లోస్‌ అల్కరాస్‌.

లండన్‌: ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ప్రపంచ నెంబర్‌ టూ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌కు ఆఖరి మెట్టుపై భంగపాటు ఎదురైంది. ఆదివారం జరిగిన ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన అల్కరాస్‌ 1-6, 7-6(8/6), 6-1, 3-6, 6-4తో గెలిచి విజేతగా నిలిచాడు. తొలి వింబుల్డన్‌ టైటిల్‌ అందుకున్న 20 ఏళ్ల ఈ యువ సంచలనానికిది కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌. గతేడాది చివర్లో యూఎస్‌ ఓపెన్‌ సాధించాడు. అటు పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచి.. ఓవరాల్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (24) రికార్డును సమం చేద్దామనుకున్న 36 ఏళ్ల జొకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. అలాగే ఈ విజయంతో అల్కరాస్‌ ఇదే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. 4 గంటలా 42 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ ఫైనల్లో అల్కరాస్‌ 9 ఏస్‌లు, జొకో 2 ఏస్‌లు సంధించారు.

తొలి సెట్‌ కోల్పోయినా..: తొలిసెట్‌ అంతా జొకోదే ఆధిపత్యం కనిపించింది. ఓ దశలో రెండు బ్రేక్‌పాయింట్లతో వరుసగా ఐదు గేమ్‌లను గెలిచి అల్కరా్‌సను బెంబేలెత్తించాడు. అయితే ఆరో గేమ్‌లో స్పెయిన్‌ స్టార్‌ సర్వీ్‌సను కాపాడుకున్నా.. జొకో 34 నిమిషాల్లోనే 6-1తో సెట్‌ను ముగించాడు. కానీ అసలైన మజా రెండో సెట్‌లో కనిపించింది. మొదట జొకో సర్వీస్‌ను బ్రేక్‌ చేస్తూ అల్కరాస్‌ 2-0తో జోరు చూపాడు. మూడో గేమ్‌లోనూ 40-30తో పైచేయిలోనే ఉన్నా జొకో పట్టు వీడలేదు. బ్రేక్‌ పాయింట్‌ సాధించడమే కాక, సర్వీ్‌సను కాపాడుకోవడంతో 2-2తో పోటీలోకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ 6-6తో నిలడంతో టైబ్రేకర్‌ తప్పలేదు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా 13 టైబ్రేక్‌లు గెలిచిన జొకోకు షాకిస్తూ అల్కరాస్‌ 7-6తో రెండో సెట్‌ దక్కించుకున్నాడు. ఈ జోష్‌లో మూడో సెట్‌ తొలి గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌తో పాటు సర్వీస్‌ను కాపాడుకుని అల్కరాస్‌ 2-0తో ముందంజ వేశాడు. మూడో గేమ్‌లో జొకో తొలి పాయింట్‌ సాధించాడు. ఇక 13 డ్యూస్‌లతో అరగంటపాటు సాగిన ఐదో గేమ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే అల్కరాస్‌ ఈ సెట్‌ను 6-1తో గెలుచుకున్నాడు. నాలుగో సెట్‌ను జొకో బ్రేక్‌ పాయింట్‌తో నెగ్గడంతో మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారింది. నిర్ణాయక సెట్‌లో బ్రేక్‌ పాయింట్‌తో అల్కరాస్‌ 2-1తో దూసుకెళ్లాడు. అయితే ఐదో గేమ్‌ను గెలుచుకున్న జొకో.. ఆరో గేమ్‌లో ఒత్తిడికి లోనై పదేపదే కోర్టు బయటకు షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక తొమ్మిదో గేమ్‌ను జొకో అలవోకగా గెలిచినా.. చాంపియన్‌షి్‌ప సర్వీ్‌సతో పెద్దగా ఒత్తిడి లేకుండానే అల్కరాస్‌ పదో గేమ్‌ను ముగించి సంబరాల్లో తేలాడు.

వచ్చాడు మొనగాడు!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

జొకోవిచ్‌, ఫెడరర్‌, నడాల్‌..దిగ్గజ త్రయాన్ని సవాలు చేసే ఆటగాడొచ్చాడు. ఇటీవలి వరకు ఈ త్రయం వారసుడెవరు? అని ప్రశ్నిస్తే ఠక్కున సమాధానం ఇవ్వలేని పరిస్థితి. సిట్సిపాస్‌, సిన్నర్‌, రూడ్‌ వంటి ఆటగాళ్లున్నా..ముగ్గురు మొనగాళ్లలో ఒకరినైనా ఓడించి గ్రాండ్‌స్లామ్‌ అందుకొన్న ఘనత వారింకా సాధించలేదు. కానీ స్పెయిన్‌ యువ కెరటం అల్కరాస్‌ ప్రపంచ టెన్నిస్‌లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే రెండు గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకోవడం..అందులో ఒక టైటిల్‌ను జొకోవిచ్‌ను ఓడించి అందుకోవడం అతడి సత్తాకు నిదర్శనం. అందుకే పురుషుల టెన్నిస్‌ భావి స్టార్‌గా కార్లో్‌సను టెన్నిస్‌ పండితులు పరిగణిస్తున్నారు. ఐదుసెట్ల సమరంలో అమోఘమైన రికార్డు కలిగిన జొకోవిచ్‌ను ఓడించడమంటే ఆషామాషీకాదు. 19ఏళ్లకే నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ కైవసం చేసుకొని రికార్డు సృష్టించడంతోనే అందరి దృష్టి ఈ స్పెయిన్‌ టీనేజర్‌పై పడింది. మూడు సంవత్సరాల ప్రొఫెషనల్‌ కెరీర్‌లోనే 2 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గడం అతడి ప్రతిభకు తార్కాణం. రెండు అంశాల్లో జొకోవిచ్‌, నడాల్‌తో అల్కరా్‌సకు పోలిక ఉంటుంది. శారీరక దారుఢ్యం, దూకుడైన ఆటతో నడాల్‌ను తలపిస్తాడు. ఇక కోర్టు నలుమూలలా పరిగెడుతూ ప్రత్యర్థుల షాట్లను తిప్పికొట్టే కొట్టే తీరు అచ్చం జొకోలా ఉంటుంది. మరి దిగ్గజ త్రయంలోని ఇద్దరు స్టార్ల ఆటను పుణికిపుచ్చుకున్న అల్కరాస్‌ భవిష్యత్‌లో వారి స్థాయిని చేరుకుంటాడేమో చూడాలి.

Updated Date - 2023-07-17T01:12:31+05:30 IST