WPL GGT vs MI : ముంబై ఘనంగా..
ABN , First Publish Date - 2023-03-05T00:36:44+05:30 IST
ఆల్‌రౌండ్ ప్రదర్శన అంటే ఇదీ.. బ్యాటర్ల తుఫాన్ ఇన్నింగ్స్‌కు తోడు, బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు గుజరాత్ జెయింట్స్ విలవిల్లాడింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)
143 రన్స్‌తో గుజరాత్‌పై విజయం
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శన అంటే ఇదీ.. బ్యాటర్ల తుఫాన్ ఇన్నింగ్స్‌కు తోడు, బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు గుజరాత్ జెయింట్స్ విలవిల్లాడింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 143 రన్స్ తేడాతో ఘనవిజయం అందుకుంది. ముందుగా ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 14 ఫోర్లతో 65), హేలీ మాథ్యూస్ (47), కెర్ (45నాటౌట్) మెరుపు వేగంతో ఆడారు. ఛేదనలో గుజరాత్ 15.1 ఓవర్లలో 64/9 స్కోరుతో చిత్తుగా ఓడింది. హేమలత (29 నాటౌట్), మోనిక (10) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు చేయలేదు. స్పిన్నర్ సైకా ఇషాక్ (4/11), స్కివర్ (2/5), కెర్ (2/12) వణికించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది.
వరుస కట్టారు: గుజరాత్ 208 పరుగుల ఛేదనలో తొలి ఓవర్‌లోనే కెప్టెన్ మూనీ (0) గాయంతో వెనుదిరగ్గా, హర్లీన్ (0) డకౌటైంది. అక్కడి నుంచి వికెట్ల పతనం ఆరంభమై 23/7 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ఒక్క హేమలత మాత్రమే భారీషాట్లతో ఎదురుదాడికి దిగి కాసిన్ని పరుగులు జత చేసింది. కానీ లక్ష్యం కొండంత ఉండడంతో చేసేదేమీ లేకపోయింది. గాయపడిన మూనీ తిరిగి బ్యాటింగ్‌కు దిగలేదు.
హర్మన్ తుఫాన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆరంభం నుంచే విరుచుకుపడింది. ఓపెనర్ యాస్తిక (1) మినహా మిగతా బ్యాటర్లంతా ధాటిని కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 14 ఫోర్లతో చెలరేగింది. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ అద్భుత సిక్సర్లతో ముందుగా స్కోరును ఉరకలెత్తించింది. ఉన్న కాసేపు నాట్ స్కివర్ (23) హేలీకి సహకరించడంతో రెండో వికెట్‌కు 54 పరుగులు వచ్చాయి. వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ అవుటయ్యాక కెప్టెన్ హర్మన్ బౌండరీల జాతర సాగింది. పేలవ బౌలింగ్‌తో పాటు చెత్త ఫీల్డింగ్‌ను అవకాశంగా మలుచుకుంటూ 15వ ఓవర్‌లో ఏకంగా నాలుగు ఫోర్లతో జోరు చూపింది. ఈ ధాటికి 21 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసింది. తర్వాతి ఓవర్‌లోనూ 4,4,4 బాదడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అటు అమేలీ కెర్ కూడా ధాటిని కనబర్చింది. సెంచరీ చేసేలా కనిపించిన హర్మన్‌ను 17వ ఓవర్‌లో స్నేహ్ రాణా అవుట్ చేసింది. దీంతో నాలుగో వికెట్‌కు 42 బంతుల్లోనే 89 పరుగుల మెరుపు భాగస్వామ్యం ముగిసింది. అనంతరం 18వ ఓవర్‌లో కేర్ రెండు ఫోర్లు, 19వ ఓవర్‌లో వస్త్రాకర్ (15) మూడు ఫోర్లు బాదడంతో 200 స్కోరు ఖాయమైంది. చివరి ఓవర్‌లో పూజ అవుటైనా రెండు సిక్సర్లతో 15 రన్స్ వచ్చాయి.
స్కోరుబోర్డు
ముంబై: యాస్తిక (సి) వేర్‌హమ్ (బి) తనూజ 1; హేలీ మాథ్యూస్ (బి) గార్డ్‌నర్ 47; నాట్ స్కివర్ (సి) స్నేహ్ రాణా (బి) వేర్‌హమ్ 23; హర్మన్‌ప్రీత్ (సి) హేమలత (బి) స్నేహ్ రాణా 65; కెర్ (నాటౌట్) 45; వస్త్రాకర్ (సి) మోనిక (బి) స్నేహ్ రాణా 15; వాంగ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 207/5. వికెట్ల పతనం: 1-15, 2-69, 3-77, 4-166, 5-201. బౌలింగ్: గార్డ్‌నర్ 4-0-38-1; మాన్సి 2-0-17-0; తనూజ 2-0-12-1; మోనిక 2-0-34-1; వేర్‌హమ్ 3-0-30-1; సదర్లాండ్ 3-0-32-0; స్నేహ్ రాణా 4-0-43-2.
గుజరాత్: మేఘన (బి) స్కివర్ 2; మూనీ (రిటైర్డ్ హర్ట్) 0; హర్లీన్ (సి) వాంగ్ (బి) స్కివర్ 0; గార్డ్‌నర్ (సి) హేలీ (బి) వాంగ్ 0; సదర్లాండ్ (బి) ఇషాక్ 6; హేమలత (నాటౌట్) 29; వేర్‌హమ్ (బి) ఇషాక్ 8; స్నేహ్ (ఎల్బీ) కెర్ 1; తనూజ (సి) స్కివర్ (బి) కెర్ 0; మాన్సి (ఎల్బీ) ఇషాక్ 6; మోనిక (బి) ఇషాక్ 10; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 15.1 ఓవర్లలో 64. వికెట్ల పతనం: 1-1, 2-3, 3-5, 4-12, 5-22, 6-23, 7-23, 8-49, 9-64. బౌలింగ్: స్కివర్ 2-0-5-2, వాంగ్ 3-0-7-1, సైకా ఇషాక్ 3.1-1-11-4, కెర్ 2-1-12-2, వస్ర్తాకర్ 2-0-9-0, కలిట 2-0-12-0, హేలీ 1-0-8-0.