Xiaomi 13 Pro: లాంచ్ అయిన షావోమీ 13 ప్రొ.. ధర వింటే ఎలా ఫీలవుతారో?
ABN , First Publish Date - 2023-02-27T19:52:13+05:30 IST
చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ తాజాగా ‘13 ప్రొ’(Xiaomi 13 Pro)ను విడుదల చేసింది
న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ తాజాగా ‘13 ప్రొ’(Xiaomi 13 Pro)ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు భారత్‌లో ఎలా ఉండబోతున్నాయనేది మంగళవారం (28న) మధ్యాహ్నం 12 గంటలకు తెలుస్తుంది. ‘షావోమీ 13 ప్రొ’(Xiaomi 13 Pro) గతేడాది డిసెంబరులో చైనాలో విడుదలైంది. తాజాగా సాఫ్ట్‌వేర్‌లో స్వల్ప మార్పులతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. హార్డ్‌వేర్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
షావోమీ 13 ప్రొ(Xiaomi 13 Pro)లో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్సీవో, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్లో షావోమీ(Xiaomi) ప్రధానంగా కెమెరాపై దృష్టిసారించింది. ఇందులోని కెమెరా సిస్టంను లీకాతో కలిసి అభివృద్ధి చేసింది. వెనకవైపు మూడు 50 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి.
షావోమీ 13 ప్రొ స్పెసిఫికేషన్లు
షావోమీ 13 ప్రొ(Xiaomi 13 Pro)లో 6.73 అంగుళాల E6 అమోలెడ్ కర్వడ్ డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్‌ను సపోర్ట్ చేసే డిస్ప్లే, సినిమాలు, గేమింగ్ సమయంలో వ్యూయింగ్ అనుభవాన్ని పెంచేందుకు హెచ్డీఆర్ 10 ఏర్పాటు వంటివి ఉన్నాయి. క్వాల్కామ్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్, ఐకూ 11 ప్రొ, వన్ ప్లస్ 115జీ లోనూ ఇదే చిప్సెట్ ఉపయోగించారు.
50 మెగాపిక్సల్స్‌తో వెనకవైపు మూడు కెమెరాలు ఏర్పాటు చేయగా, ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం ఉన్న షావోమీ 13 ప్రొ మూడేళ్ల ఓఎస్ అప్డేట్తో వస్తోంది. 30 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. దీని ధర భారత్‌లో ఇంచుమించుగా రూ. 1.13 లక్షలు ఉండే అవకాశం ఉంది.