Mallanna, Ranganayaka Sagar canals : ఎకరానికి రూ.9 లక్షలు!

ABN , First Publish Date - 2023-04-20T02:13:54+05:30 IST

మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌ కుడి, ఎడమ కాల్వల ముంపు బాధితులకు పరిహారం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి రూ.9 లక్షల చొప్పున ఇవ్వాలని ..

Mallanna, Ranganayaka Sagar canals : ఎకరానికి రూ.9 లక్షలు!

మల్లన్న, రంగనాయక సాగర్‌ కాల్వల

ముంపు బాధితులకు పరిహారం పెంపు

కేసును ఉపసంహరించుకుంటున్న రైతులు

కాల్వల తవ్వకానికి లైన్‌ క్లియర్‌!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌ కుడి, ఎడమ కాల్వల ముంపు బాధితులకు పరిహారం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి రూ.9 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించగా.. ఆ మొత్తం తీసుకునేందుకు బాధితులు అంగీకరించారు. దీంతో మైనర్‌, సబ్‌ మైనర్‌ కాల్వల తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కాల్వల తవ్వకం వల్ల భూములు కోల్పోయే వారికి అప్పటి మార్కెట్‌ విలువల ప్రకారం ఎకరానికి రూ.1.50-1.90 లక్షల వరకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తమకు ఆ పరిహారం సరిపోదంటూ 2020- 21లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్‌, నంగనూరు మండలాలకు చెందిన దాదాపు 890 మంది ముంపు బాధితులు కోర్టును ఆశ్రయించారు. రంగనాయక సాగర్‌ కుడి, ఎడమ కాల్వల కింద తవ్వాల్సిన మైనర్‌, సబ్‌ మైనర్‌ కాల్వలకు దాదాపు 140 ఎకరాల భూమి అవసరమని నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. మల్లన్నసాగర్‌ కుడి, ఎడమ ప్రధాన కాల్వల కింద తవ్వాల్సిన మైనర్‌, సబ్‌మైనర్‌ కాల్వలకు దాదాపు 130 ఎకరాల వరకు అవసరమని అధికారులు తేల్చారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో 42 గ్రామాల రైతుల భూములు ముంపునకు గురవుతున్నట్లు గుర్తించారు. అప్పట్లో ప్రకటించిన మేరకు ఇచ్చే పరిహారం చాలదని, ఎక్కువ పరిహారం ఇస్తే భూములు అప్పగిస్తామని బాధితులు తెలిపారు. కొత్త పరిహారం ఇచ్చే వరకు కాల్వల పనులు చేపట్టనివ్వబోమని తేల్చిచెప్పారు.

దీంతో ఈ కాల్వల తవ్వకాలు, ఇతర నిర్మాణ పనులు నిలిచిపోయాయి. చివరికి ప్రభుత్వమే దిగొచ్చింది. ఎకరానికి రూ.9 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. ఫలితంగా ముంపు బాధితులు వేసిన కేసును ఉపసంహరించుకునేందుకు ముందుకు వచ్చారు. సీసీఎల్‌ఏ ప్రాంగణంలోని భూసేకరణ వివాదాలు పరిష్కరించే ప్రత్యేక కోర్టులో బాధితులు ఈ నెల 4 నుంచి కేసును ఉపసంహరించేకునేందుకు రాజీ పత్రంపై సంతకాలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 29 గ్రామాల బాధితులు సంతకాలు చేశారు. మరో 13 గ్రామాలకు చెందిన బాధితులు సంతకాలు చేస్తే ఈ కేసు విత్‌డ్రా అవుతుంది. బుధవారం నంగనూరు మండలం పాలమాకుల, అక్కనపల్లి, మగ్దుంపూర్‌, అప్పలయచెరువు, గట్టుమల్లేల, బద్దిపడగ గ్రామాలకు చెందిన బాధితులు సీసీఎల్‌ఏ (భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌) కార్యాలయానికి వచ్చారు. ప్రత్యేక కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు సంతకాలు చేశారు.

Updated Date - 2023-04-20T02:13:54+05:30 IST