కంది ధర అదిరింది
ABN , First Publish Date - 2023-06-02T02:42:54+05:30 IST
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో కందులకు రికార్డు ధర పలికింది.
సూర్యాపేట మార్కెట్‌లో క్వింటా 9,340
మద్దతు ధరకు మించి రూ.2,740 అధికం
సాగు విస్తీర్ణం తగ్గడమే కారణం
సూర్యాపేట సిటీ, జూన్ 1: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో కందులకు రికార్డు ధర పలికింది. మార్కెట్‌లో కంది ధర రోజు రోజుకూ పైపైకి దూసుకుపోతోంది. రెండురోజులుగా అత్యధిక ధరలు పలుకుతున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.6,600 ఉండగా బుధవారం క్వింటాకు రూ.9,329 పలికిన ధర గురువారం మరో రూ.11 పెరిగి రూ.9,340కి చేరింది. మద్దతు ధరతో పోల్చితే రూ.2,740లు అధికంగా వచ్చింది. అధిక ధరలు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మార్కెట్‌కు 14 మంది రైతులు 26 బస్తాల కందులను తీసుకురాగా రమేష్ అనే రైతు తీసుకువచ్చిన నాలుగు బస్తాల కందులకు కమిషన్‌దారుడు రూ.9,329లు ధర ఇచ్చారు. గురువారం తొమ్మిది బస్తాల కందులు రాగా గరిష్ఠంగా రూ.9,340లు, కనిష్ఠ ధర రూ.9,219లు వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి ఫసియొద్దీన్ తెలిపారు.