Share News

Raja Singh : బీజేపీ చీఫ్‌గా నాది విజయపరంపర

ABN , First Publish Date - 2023-11-07T03:52:28+05:30 IST

‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగిన. హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసిన. అన్ని ఎన్నికల్లో విజయపరంపర

 Raja Singh : బీజేపీ చీఫ్‌గా నాది విజయపరంపర

హిందూ ఓటు బ్యాంకును ఏకం చేశా: బండి

సంజయ్‌ ఓ శక్తి.. దున్నపోతులు పోటీ పడలేవు

గంగుల తప్పుకొంటేనే మంచిది: రాజాసింగ్‌

హైదరాబాద్‌/ కరీంనగర్‌/కరీంనగర్‌టౌన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగిన. హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసిన. అన్ని ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించిన. 80 శాతం హిందూ ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చడమే లక్ష్యంగా పని చేసిన. ధర్మంపై కక్ష కట్టిన వారి పని పట్టాలని 150 రోజులు పాదయాత్ర చేసిన. రైతుల కోసం కాళ్లు చేతులు విరిగినా లెక్క చేయలే. టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీక్‌ చేస్తే నిరుద్యోగుల కోసం పోరాడి జైలుకు పోయిన. 317జీవో పేరుతో ఉద్యోగులను చెట్టుకొకరిని, పుట్టకొకరిని పంపిస్తే.. వాళ్ల పక్షాన నిలబడ్డా. తెలంగాణలో ఏ వర్గానికి అన్యాయం చేసినా వాళ్ల పక్షాన పోరాడిన. నాపై 30కి పైగా కేసులు పెట్టినా లెక్క చేయలే’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ తరఫున కరీంనగర్‌ అభ్యర్థిగా సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు అంతకుముందు కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయానికి నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. తన మాతృమూర్తి చేతుల మీదుగా నామినేషన్‌ పత్రాలను అందుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్‌, జి.మనోహర్‌రెడ్డి, ధర్మపురి అసెంబ్లీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి, చీకోటి ప్రవీణ్‌కుమార్‌ తదితరులతో కలిసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ మేడిగడ్డ కుంగుబాటుపై కేంద్ర కమిటీ నివేదికను తప్పు పడుతున్న కేసీఆర్‌ కొడుక్కి సిగ్గు లేదని విమర్శించారు. ఆయనకు అహంకారం ఎక్కువైందని, దాన్ని దించే సమయం ఆసన్నమైందని అన్నారు. కేసీఆర్‌ లేకుంటే కేటీఆర్‌ది బిచ్చపు బతుకయ్యేది అని దుయ్యబట్టారు. బీజేపీ ఏనాడైనా తెలంగాణ జెండా పట్టిందా? అంటున్న కేసీఆర్‌కు కొంచెమైనా సిగ్గుండాలె.. అని సంజయ్‌ అన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌ పుట్టకముందే తెలంగాణ కోసం 1998లో కాకినాడలో తీర్మానం చేసినం.

ఆ పార్టీకి ఉన్న ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చేదా? పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుంటే తాగి పండిన చరిత్ర కేసీఆర్‌ది. ఆనాడు బిల్లు పెట్టించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించిన ఘనత బీజేపీది’’ అని వ్యాఖ్యానించారు. రజాకార్ల పాలన నుంచి ప్రజలను రక్షించేందుకు పోరాడుతున్న తనపై మతతత్వ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. తాను ధర్మం తరఫున పోరాడుతున్నానని, ఎప్పుడూ కాషాయ జెండాను వీడలేదని గుర్తు చేశారు. కరీనంగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన గంగుల కమలాకర్‌.. పౌరసరఫరాల మంత్రిగా ఉండి.. ఒక్క కొత్త రేషన్‌ కార్డైనా ఇచ్చారా? అని నిలదీశారు. చివరకు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కమీషన్లు దండుకున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే.. మజ్లిస్‌ పార్టీకి మేయర్‌ పీఠం కట్టబెట్టేందుకు ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ‘‘ఎంపీగా గెలిపిేస్త ఏం చేశావని కొందరు ప్రశ్నించిన వాళ్లకు చెబుతున్నా...మూడేళ్లలో రూ.8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. స్మార్ట్‌సిటీ నిధులు, రేషన్‌ బియ్యం, పల్లెలు, మునిసిపాలిటీలకు వచ్చిన అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే’’ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పే టైమొచ్చిందని, యువకులే కరీంనగర్‌ చరిత్రను మార్చబోతున్నారని అన్నారు. ధర్మం కోసం ప్రజల పక్షాన పోరాడుతున్న బండి సంజయ్‌ పక్షాన ఉంటారా? అవినీతితో వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ.20వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పక్షాన ఉంటారా? తేల్చుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. బండి సంజయ్‌ వ్యక్తి కాదని, ఓ శక్తి అని అభివర్ణించారు. అంతటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవని సెటైర్లు వేశారు. బండి సంజయన్న పోటీ చేస్తున్నడని తెలియగానే కమలాకర్‌.. దారుస్సలాం పోయి సలాం చేసిండని వెల్లడించారు. ఈ నియోజకవర్గం నుంచి తప్పుకుంటే ఆయనకే మంచిదన్నారు. కరీంనగర్‌లో ఎంఐఎం అభ్యర్థిని పోటీ చేయించే దమ్ముందా? అని ఒవైసీని ప్రశ్నించారు.

Updated Date - 2023-11-07T03:52:29+05:30 IST