అయ్యో.. ఆచారీ!
ABN , First Publish Date - 2023-12-04T23:55:43+05:30 IST
కల్వకుర్తి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారికి అదృష్టం కలిసి రావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో బీజేపీకి గట్టిపట్టున్న కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ సారి కూడా ఆ పార్టీ విజయం సాధించకలేక పోయింది.
ఆరోసారీ అపజయం
కల్వకుర్తిలో వికసించని కమలం
ఆచారిని వెంటాడుతున్న పరాజయం
విజయం అంచుల్లోకి వచ్చి ఓటమి
కలత చెందిన బీజేపీ శ్రేణులు
ఆమనగల్లు, డిసెంబర్ 4: కల్వకుర్తి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారికి అదృష్టం కలిసి రావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో బీజేపీకి గట్టిపట్టున్న కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ సారి కూడా ఆ పార్టీ విజయం సాధించకలేక పోయింది. వరుసగా ఆరోసారి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన తల్లోజు ఆచారి ఈ సారి కూడా అపజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో 78, 2018లో 3,449 ఓట్లతో పరాజయం పొందిన ఆచారి ఈ సారి ఏవిధంగానైనా గెలుపొందాలని సర్వశక్తులొడ్డి పోరాడారు. తీరా విజయపుటంచుల వరకు వచ్చి మళ్లీ ఓటమి పాలయ్యారు. ఆచారి ఆరోసారి అపజయం బీజేపీ శ్రేణులను, ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. విజయంపై పెంచుకున్న ఆశలు ఆవిరయ్యాయి. వరుస ఓటములను ఆచారి, బీజేపీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఆమనగల్లు పట్టణానికి చెందిన తల్లోజు ఆచారి 35 ఏళ్లుగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీజేపీ పార్టీలో అనేక పదవులు నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమనగల్లు సర్పంచ్‌గా పనిచేసిన ఆచారి రాజకీయంగా చిన్న వయస్సులోనే రాణించి గుర్తింపు పొందారు. ఆచారి 1994లో తొలిసారిగా కల్వకుర్తి నుంచి బీజేపీ తరపున అసెంబ్లీ బరిలో నిలిచి 8,682 ఓట్లు సాధించి ఓటమి చెందారు. 2004లో బీజేపీ తరపున రెండో సారి అసెంబ్లీ బరిలో నిలిచి 54వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2009లో మూడోసారి అసెంబ్లీ బరిలో నిలిచిన ఆయన 25వేల ఓట్లు సాధించారు. 2014లో నాలుగోసారి బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఆచారి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై 78 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 2018లో ఐదోసారి పోటీకి దిగి 3,449 ఓట్లతో ఓటమిని చవిచూశారు. 2023లో ఆరోసారి విజయం కోసం తీవ్రంగా పోరాడారు. ఆరోసారైనా తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజల్లో కూడా ఆయనపై సానుభూతి పవనాలు వీచాయని అందరూ భావించారు. ఆ సానుభూతితో ఆచారి విజయం ఖాయమని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. చివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిపై 5,410 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డికి 75,858 ఓట్లు రాగా, ఆచారికి 70,448 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన ఆచారి వరుస అపజయాలతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి.