Share News

AIG Hospitals : కడుపులోనే మద్యం ఫ్యాక్టరీ!

ABN , First Publish Date - 2023-10-21T03:41:29+05:30 IST

మీరెప్పుడూ మద్యం తాగకపోయినా డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయారా? అయితే మీ ఉదర ఆరోగ్యం పట్ల తస్మాత్‌ జాగ్రత్త!! అది ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌’ సమస్య కావొచ్చని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. ‘ఆరోగ్యవంతమైన

 AIG Hospitals : కడుపులోనే మద్యం ఫ్యాక్టరీ!
AIG Hospitals

మద్యం తాగకున్నా డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికితే..

అది ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌ కావచ్చు జాగ్రత్త

మల మార్పిడితో మొండి వ్యాధులకు చికిత్స

ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మీరెప్పుడూ మద్యం తాగకపోయినా డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయారా? అయితే మీ ఉదర ఆరోగ్యం పట్ల తస్మాత్‌ జాగ్రత్త!! అది ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌’ సమస్య కావొచ్చని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. ‘ఆరోగ్యవంతమైన మహిళ, ఆరోగ్యవంతమైన సమాజం’ పేరిట ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో)తో కలిసి ఏఐజీ హాస్పిటల్స్‌ శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. వైద్య శాస్త్రంలో తదుపరి అతి పెద్ద సంచలనంగా గట్‌ మైక్రోబయోమ్‌ నిలువనుందని ఆయన తెలిపారు. మనం తిన్న ఆహారం కడుపులో జీర్ణమై, శక్తిగా మారి, శరీరానికి తగిన పోషకాలను అందించేలా చేయడంలో పేగులు కీలకపాత్ర పోషిస్తాయని.. పేగుల ఆరోగ్యం సరిగా లేకపోతే మన శరీరంలో ప్రతి అవయవం ప్రభావితమవుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంలోనే ఆయన ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌ గురించి చెప్పుకొచ్చారు. ఇటీవల తన స్నేహితుడి కుమార్తె ఒకరు డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారని.. ఎన్నడూ ఆల్కహాల్‌ ముట్టని అమ్మాయి అలా డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడడం తమను షాక్‌కు గురిచేసిందని తెలిపారు. ‘‘కారణం తెలుసుకోవడానికి ఆమెకు వైద్యపరీక్షలు చేయిస్తే ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌’ ఉన్నట్లు తేలింది. అంటే ఆమె ఉదరం ఓ మైక్రో బ్రూవరీ మాదిరి పనిచేస్తోంది. అదే విషయాన్ని కోర్టుకు తెలిపి ఆ సమస్య నుంచి ఆమె బయటపడింది’’ అని నాగేశ్వర్‌ రెడ్డి వివరించారు

. మన కడుపులో మంచి, చెడు.. రెండు రకాల బ్యాక్టీరియాలూ ఉంటాయని, వాటితోపాటు 100కు పైగా రకాల సూక్ష్మజీవులు పేగులలో ఉంటాయని వెల్లడించారు. చెడుబ్యాక్టీరియాపై మంచి బ్యాక్టీరియా పైచేయి సాధిస్తే ఆరోగ్యంగా ఉంటామని.. లేకుంటే ఇలా ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌ సహా పలు సమస్యలు వస్తాయని తెలిపారు. మల పరీక్షల ద్వారా దీన్ని గుర్తించవచ్చన్నారు. శస్త్రచికిత్సలు, పిల్లలకు తల్లిపాలు లభించకపోవడం, యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడడం వంటి కారణాల వల్ల చెడు బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందని హెచ్చరించారు. ఈ సమస్యను నివారించడానికే ఇటీవలికాలంలో మల మార్పిడి ప్రక్రియ ఊపందుకుందని నాగేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి సేకరించిన మలాన్ని జబ్బుపడిన వ్యక్తి పేగులలో ప్రవేశపెట్టడం ద్వారా.. కొన్ని రకాల మొండి వ్యాధులకు చికిత్స చేయడం సాధ్యమవుతుందన్నారు. ఇప్పుడు స్టూల్‌ (మలం) బ్యాంకులూ వస్తున్నాయని చెప్పారు.. పెరుగు మంచి బ్యాక్టీరియాకు నిలయమన్న ఆయన.. వాణిజ్యపరంగా విక్రయించే పెరుగు మాత్రం అంత మంచిది కాదన్నారు. ఇంటిలో చేసుకునే పెరుగుతో ప్రయోజనాలుంటాయని.. అలాగే, పండ్లు, కూరగాయలలో లభించే ప్రో బయాటిక్స్‌ ఆరోగ్యానికి మంచి చేస్తాయని చెప్పారు. ఊబకాయంతో బాధపడేవారు.. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తున్నా బరువు తగ్గడం లేదంటే చెడు బ్యాక్టీరియానే కారణం కావచ్చన్నారు.

Updated Date - 2023-10-21T03:41:29+05:30 IST