Amit Shah: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 350 సీట్లకు పైగా వస్తాయి.. అమిత్ షా ధీమా
ABN , Publish Date - Dec 28 , 2023 | 06:55 PM
గురువారం తెలంగాణకు విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా...
Amit Shah: గురువారం తెలంగాణకు విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిందని, దానికి వేవ్ లేదని విమర్శించారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకం వెలిబుచ్చారు. ప్రతి కార్యకర్త.. పార్టీ నాది, దేశం మనది అనే భావనతో పని చేయాలని పిలుపునిచ్చారు. అలా పని చేస్తే.. తప్పకుండా లోక్‌సభ ఎన్నికల్లో 350 నుండి 400 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తల్ని అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికలు ఒక వ్యక్తికి చెందినవి కావని.. దేశానికి, దేశ భవిష్యత్తుకు సంబంధించినవని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో.. విభేదాలు మరిచిపోయి 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకుల్ని అమిత్ షా ఆదేశించారు. రాష్ట్ర నేతల మధ్య విభేదాల కారణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించాలని నేతల్ని సూచించారు. తెలంగాణ బీజేపీ నేతలతో వ్యూహాలపై చర్చించి, తదనుగుణంగా వారికి దిశానిర్దేశం చేశారని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను లక్ష్యంగా చేసుకుని మరింత కష్టపడి పనిచేయాలని కోరిక ఆయన.. పార్టీ స్థితిగతులపై నిర్వహించే సర్వే ఆధారంగా సిట్టింగ్ ఎంపీలు, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తామని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను గుర్తించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని నాయకులను కోరారు.
కాగా.. ఒక రోజు పర్యటనలో భాగంగా అమిత్ షా గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమాణంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పార్టీ నేతలతో భేటీ అయిన తర్వాత చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కొంగరకలాన్‌లోని శ్లోక సమ్మేళనంలో పార్టీ నేతలతో షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడి నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు అందరూ పాల్గొన్నారు.