Anganwadi : అంగన్‌వాడీ.. వేడి!

ABN , First Publish Date - 2023-09-22T03:33:35+05:30 IST

సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాలుస్తోంది.

Anganwadi : అంగన్‌వాడీ.. వేడి!

పది రోజులుగా టీచర్లు, హెల్పర్ల సమ్మె

కలెక్టరేట్ల ముట్టడితో పలు చోట్ల ఉద్రిక్తత

ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళిక

నేడు రిలే దీక్షలు, 24న రౌండ్‌టేబుల్‌ భేటీ

26న హైదరాబాద్‌లో ధర్నాకు కార్యాచరణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాలుస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 11 నుంచి అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అంగన్‌వాడీ ఉద్యోగులకు రూ.26వేల వేతనం ఇవ్వడంతోపాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని, గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడితో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంగన్‌వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేశారు. ఈ మేరకు గురువారం మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇంటిని ముట్టడించడంతోపాటు నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మెను విరమించేది లేదని, చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ జేఏసీ నాయకురాలు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు.

శుక్రవారం జిల్లాల వారీగా రిలే దీక్షలకు పిలుపునిచ్చామని, 24న రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నామని, 26న కార్మిక, ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాకు కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. గత నెల 18న మంత్రి సత్యవతితో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. కాగా, సమ్మెను విరమించాలని అంగన్‌వాడీ టీచర్లను మంత్రి సత్యవతి రాథోడ్‌ ఓ ప్రకటనలో కోరారు. ఇతర రాష్ట్రాల కన్నా మెరుగైన వేతనం ఇస్తున్నామని, సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా తమిళనాడు ప్రభుత్వం అంగన్‌వాడీలను పర్మనెంట్‌ చేసి, పే స్కేల్‌ అందిస్తున్నదని గుర్తు చేశారు. పదవీ విరమణ ప్రయోజనాల కింద అస్సాంలో రూ.4లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో రూ.3లక్షల చొప్పున అందిస్తున్నారని.. తెలంగాణలో మాత్రం అలాంటివేమీ లేకపోవడం శోచనీయమన్నారు.

నెరవేరని హామీలు..

అంగన్‌ వాడీల సమస్యలను పరిష్కరించేందుకు గతంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా వారిని ప్రగతి భవన్‌కు పిలిపించి.. సమావేశమయ్యారు. అంగన్‌ వాడీ వర్కర్‌గా ఉన్న పేరును అంగన్‌వాడీ టీచర్‌గా మార్చడంతోపాటు హామీల వర్షం కురిపించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా సర్కారు మాత్రం ఇచ్చిన హామీల అమలుకు ఉపక్రమించడం లేదు. పేరులో టీచర్‌ హోదాను కల్పించినా.. ఆ మేరకు వారికి జీతం, సౌకర్యాలను కల్పించలేదు. అంగన్‌వాడీల్లో పని చేసే వారిలో ఎవరైనా ఉన్నత విద్యావంతులు ఉంటే వారికి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించడంతోపాటు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కట్టిస్తామని హామీ కూడా నెరవేరలేదు. అంతేకాదు.. అంగన్‌వాడీలకు కనీసం టీఏ, డీఏలు, గ్రాట్యూటీలను కూడా అందించడంలేదు. దేశంలోని అంగన్‌వాడీల్లో పని చేస్తున్న వారికి పదవీ విరమణ తరువాత గ్రాట్యూటీ అందించాలని సుప్రీం కోర్టు గత ఏడాది ఏప్రిల్‌ 25న కేంద్రంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినా ఇంతవరకూ రాష్ట్రంలో వీటి అమలుకు చర్యలు లేవు.

సంక్షేమ పథకాలకూ అనర్హులే..

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు అందండం లేదు. కల్యాణలక్ష్మి, ఆస రా పథకాలకు వీరు అర్హులు కాదని గతంలోనే ప్రభు త్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అర్బన్‌లో రూ.2లక్షలు, రూరల్‌లో రూ.1.5లక్షల లోపు ఆదాయ పరిమితి ఉన్న వారు ఈ పథకాలకు అర్హులే. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.13,550, హెల్పర్‌కు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. ఈ లెక్కన వీరు పథకాలకు అర్హులైనా ఎందుకు అందించడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయమై వీరు ఆందోళన చేసినప్పుడల్లా.. ఈ పథకాలను వర్తింపజేస్తామంటూ సర్కారు కాలం వెళ్లదీస్తోందే తప్ప.. ఉత్తర్వులు మాత్రం జారీ చేయడం లేదు.

Updated Date - 2023-09-22T03:48:16+05:30 IST