Gachibowli LAND .:మరో గచ్చిబౌలి.. మరో గచ్చిబౌలి.. ఇదో పచ్చి మోళీ!
ABN , First Publish Date - 2023-03-05T02:51:36+05:30 IST
వందల ఎకరాల్లో రియల్ వెంచర్లు వేయాలంటే వేల కోట్లు కావాలి! కానీ, కారు చౌకగా భూములు కొనడం.. భారీ ప్రచారంతో రేట్లు పెంచేయడం.. ఆ భూములను తనఖా పెట్టి డబ్బు తెచ్చుకోవడం.. ఆ డబ్బుతో మరోచోట భూములు కొనడం..
జాగామే మాయ
విజయవాడ హైవేలో జీ స్క్వేర్ ఎపిటోమ్ వెంచర్ల బాగోతం
చౌటుప్పల్ మండలంలో 1,242 ఎకరాల్లో విల్లా ప్లాట్లని ప్రచారం
కానీ, అక్కడ హెచ్‌ఎండీఏ అనుమతి ఇచ్చింది 367 ఎకరాలకే
భూములు కొన్న 5 నెలల్లోనే 307 ప్లాట్లు ఫైనాన్స్ సంస్థకు తాకట్టు
రూ.20 కోట్లకు ఏపీఎ్‌ఫఎల్‌కు రిజిస్ట్రేషన్ కూడా చేసిన ఎపిటోమ్
ఒక్కో ప్లాట్‌కు ఎన్‌వోసీ తీసుకున్న తరువాతనే రిజిస్ట్రేషన్లు
కస్టమర్ దొరికితే ఆ డబ్బుతో ఒక్కో ప్లాట్ తనఖా విడుదల
20 కోట్లకు ప్లాట్లు తాకట్టుపెట్టిన సంస్థకు భారీ వెంచర్ సాధ్యమా?
అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు, ఆస్పత్రులు, హోటళ్లు ఎప్పుడో!
అక్కడి నక్షా బాటలూ మాయం.. రైతులతో కొన్నాళ్లుగా వివాదాలు
‘విజయవాడ హైవే.. మరో గచ్చిబౌలి’.. నగరం
నలుమూలలా హోరెత్తిపోతున్న ప్రకటన ఇది! ఎక్కడ చూసినా క్రికెటర్ ధోనీ ఫొటోతో కనిపిస్తున్న ప్రకటనలు! దక్షిణాదిలో తామే నంబర్ వన్ అని చెప్పుకొంటున్న ‘జీ స్క్వేర్’ ప్రచారమిది! ఎపిటోమ్ అనే ‘రియల్’ కంపెనీ వేసిన వెంచర్‌కు జీ స్క్వేర్ మార్కెటింగ్ చేస్తోంది! ఈ ఆర్భాటపు ప్రకటనలు చూసి అక్కడ ప్లాట్ కొనుగోలు చేస్తే ఇబ్బందులే! ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో వాస్తవానికి పొంతన ఉండదు! అనుమతులు అరకొర! వసతులు అంతంతే! ప్లాట్లు తనఖా పెట్టి పెట్టుబడి సమకూర్చుకుంటోంది! అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు సరేసరి! ‘ఎపిటోమ్-జీ స్క్వేర్’ వెంచర్‌తోపాటు ఆ కంపెనీకి చెందిన మరికొన్ని వెంచర్లపై ‘ఆంధ్రజ్యోతి నిఘా విభాగం’ పరిశోధనలో అనేక విషయాలు వెలుగులోకొచ్చాయి! ఇటీవల దక్షిణాది, ఉత్తరాదిన ఏర్పడిన కొత్త రాజకీయ చుట్టరికాలు ఈ సంస్థకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది! బడా నేతలు తెర వెనక నడుపుతున్న రియల్ మోసాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు!
(ఆంధ్రజ్యోతి నిఘా విభాగం): వందల ఎకరాల్లో రియల్ వెంచర్లు వేయాలంటే వేల కోట్లు కావాలి! కానీ, కారు చౌకగా భూములు కొనడం.. భారీ ప్రచారంతో రేట్లు పెంచేయడం.. ఆ భూములను తనఖా పెట్టి డబ్బు తెచ్చుకోవడం.. ఆ డబ్బుతో మరోచోట భూములు కొనడం.. ఇటు భూములను అటు పెట్టుబడిని రొటేషన్ చేయడం! ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీల మోడస్ ఆపరెండీ ఇది! జీ స్క్వేర్ - ఎపిటోమ్ చేస్తున్నది కూడా దాదాపు ఇదే! ఈ కంపెనీ నగర శివార్లలో మూడు భారీ రియల్ ప్రాజెక్టులను చేపట్టింది. వీటిలో ఒకటి.. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌటుప్పల్‌లోని ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ వెంచర్! ‘విజయవాడ హైవే.. మరో గచ్చిబౌలి’గా ఊదరగొడుతున్నది దీనినే. ఇక్కడ 1,242 ఎకరాల్లో ప్రాజెక్టు అని ప్రకటనలు గుప్పిస్తోంది! రూ.48 లక్షలకే 267 చదరపు గజాల ప్రీమియం విల్లా ప్లాట్లు ఇస్తామని చెబుతోంది! కానీ, ఇక్కడ జీ స్క్వేర్ - ఎపిటోమ్ సంస్థ హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకున్నది కేవలం 367 ఎకరాలకే! అంతేనా.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి, దేవులమ్మ నాగారం గ్రామాల్లో ఈ వెంచర్ ఉంది. తంగడపల్లిలో సర్వే నంబరు 646/పార్ట్, 647, 648, 666, 667 పార్ట్, 683 పార్ట్, 684 పార్ట్, 685 పార్ట్, 686 పార్ట్, 687 పార్ట్, 688, 689, 690, 691, 694, 695, 697, 702 పార్ట్, 703, 704తోపాటు దేవులమ్మ నాగారంలోని సర్వే నంబరు 61, 62, 63 పార్టు, 65, 66, 67 పార్టు, 68, 69, 70, 71, 72 పార్టు, 97 పార్టు, 98 పార్టు, 99 పార్టు, 100 పార్టులో కలిపి 367 ఎకరాల్లోనే వెంచర్ వేశారు.
దీనికే హెచ్‌ఎండీఏ నుంచి డ్రాఫ్ట్ లే అవుట్ అనుమతులు పొందింది. ఇంకా తుది అనుమతి లభించలేదు. నిబంధనల ప్రకారం తుది అనుమతులు లభించిన తర్వాత మాత్రమే అక్కడ నిర్మాణాలకు అనుమతులు వస్తాయి. అంటే, ఫైనల్ లే అవుట్ వచ్చిన తర్వాత మాత్రమే ప్లాట్లను విక్రయించాలి. కానీ, తాత్కాలిక లే అవుట్‌తోనే ఇక్కడ విక్రయాలు జరిపేస్తున్నారు. వాస్తవానికి, విజయవాడ హైవేకు అనుకుని ఉన్న ఈ భూమిని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంకు సంబంధించిన వ్యక్తులు 2008 నుంచి 2012 వరకు కొనుగోలు చేస్తూ వచ్చారు. జీపీఏల ద్వారా కొంత, సేల్‌డీడ్‌ల ద్వారా మరికొంత కలిపి వందల ఎకరాలు కొనుగోలు చేశారు. అప్పట్లోనే ఈ భూమిని కన్వర్షన్ చేయించి కంపెనీల పేరు మీదకు మార్చారు. విక్టరీ ఇన్‌ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్నో బెర్రీ టౌన్ ప్లానర్స్, వేవ్ లేక్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మికా టౌన్ ప్లానర్స్, ఆర్కిడ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఈ భూములను ఎపిటోమ్ ఎల్‌ఎల్‌పీ సంస్థ కొనుగోలు చేసింది. రెండు విడతలుగా ఈ భూములు తీసుకుంది. 24-12-2020న 5904/2020, 5905/2020, 5906/2020, 20-09-2021న 8221/2021, 8227/2021 డాక్యుమెంట్ల ద్వారా చౌటుప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎపిటోమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంది. తర్వాత వెంచర్ అనుమతులు పొందింది.
8 నెలల్లోనే 307 ప్లాట్లు తాకట్టు
ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వేసిందనుకోండి. అక్కడ రోడ్లు వేస్తుంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఆ తర్వాత జనాలకు విక్రయిస్తుంది. కానీ, దక్షిణాదిలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీగా చెప్పుకొంటున్న సంస్థకు డబ్బులకు కొదవ ఉండకూడదు కదా! కానీ, జీ స్క్వేర్ ఎపిటోమ్ రూటే సెపరేటు! భూములు కొనుగోలు చేసిన ఐదు నెలల్లోనే వాటిలోని ప్లాట్లను తాకట్టు పెట్టేసింది. వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే ఈ సంస్థ.. 18.02.2022వ తేదీన ఎపిటోమ్ ప్రాజెక్టులోని 307 ప్లాట్లను (మొత్తం 93,947 చదరపు గజాలు) ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబీఎ్‌ఫఎల్) కంపెనీలో కేవలం రూ.20 కోట్లకు తనఖా పెట్టింది. ఈ మేరకు ఎపిటోమ్ కంపెనీ బోర్డు డైరెక్టర్లు 9.2.2022వ తేదీన తీర్మానం కూడా చేశారు. ప్లాట్లను తనఖా పెట్టేందుకు కంపెనీ డైరెక్టర్ కాంతా జైపాల్‌కు అధికారాన్ని అప్పగించారు. ఈ మేరకు ఏబీఎ్‌ఫఎల్ సంస్థకు చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తన ఖా రిజిస్ట్రేషన్ చేశారు. భూములు కొనుగోలు చేసిన 5 నెలల్లోనే రూ.20 కోట్లకు 307ప్లాట్లను తనఖా పెట్టారంటేనే కంపెనీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కస్టమర్ దొరికితే పండుగే..
దక్షిణాదిన మేమే నంబర్-1 అంటూ విస్తృత ప్రచారం చేసుకుంటున్న జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇప్పుడు కస్టమర్ దొరికితే పండుగ చేసుకునే స్థితిలో ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు కొంత ఆస్తిని బ్యాంకులు, ఇతర ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటుంటాయి. ఇది సాధారణమే. డబ్బు సర్దుబాటు అయినప్పుడు ఆస్తిని విడిపించుకుంటాయి. దక్షిణాదిలో నంబర్ వన్ అని చెప్పుకొంటున్న జీ స్క్వేర్ ఎపిటోమ్ కూడా ప్లాట్లు తాకట్టు పెట్టింది. ఎవరైనా కస్టమర్ దొరికారనుకోండి. వారి నుంచి డబ్బులు తీసుకుంటోంది. అందులో కొంత మొత్తంతో అప్పు ఇచ్చిన ఆదిత్య బిర్లా ఫైనాన్స్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకుని ప్లాట్ రిలీజ్ చేసి కస్టమర్‌కు రిజిస్ట్రేషన్ చేస్తోంది. ‘ప్లాట్ కొనుగోలు ద్వారా కస్టమర్ ఇచ్చే మొత్తాన్ని మా ఖాతాలో జమ చేస్తేనే’ అనే షరతు పెట్టి ఏబీఎ్‌ఫఎల్ ఎన్‌వోసీ ఇస్తోంది. ఒకవేళ కస్టమర్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఎపిటోమ్ సంస్థ ఫైనాన్స్ సంస్థకు చెల్లించకపోతే ఆ తర్వాత న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే.. ప్లాట్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడే ఆస్కారం ఉంటుం ది. ఎందుకంటే.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)లో ఎపిటోమ్ సంస్థ తనఖా పెట్టిన డీడ్ రిలీజ్ కాకపోవడంతో ఎన్‌వోసీ ద్వారా వేరే వారికి రిజిస్ట్రేషన్ అయినా కూడా ఆ ప్లాట్ల నంబర్ ఇంకా తనఖాలో ఉన్నట్లే కనిపిస్తుంది. దీంతో ఎన్‌వోసీ ద్వారా ప్లాట్ కొన్నవారు తిరిగి ఇతరులకు అమ్మాలంటే చికాకులే ఉంటాయి.
అంతర్జాతీయ ప్రమాణాలు ఉత్తుత్తిదే!
జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇచ్చిన ప్రకటన చూసి మీరు వెంచర్ దగ్గరకు వెళ్లారనుకోండి! మీకు చుక్కలు కనిపించడం ఖాయం. ప్రకటనకు, క్షేత్రస్థాయిలో చెప్పే ధరకు, అక్కడ సదుపాయాలకు ఏమాత్రం పొంతన కుదరదు. ఉదాహరణకు, విజయవాడ హైవేపై రూ.48 లక్షలకే 267 గజాల విల్లా ప్లాట్లు అని పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇస్తోంది. తీరా, అక్కడకు వెళితే గజం రూ.20 వేలపైనే అంటూ కొనుగోలుదారులకు చావు కబురు చల్లగా చెబుతున్నారు. అంటే, ప్రకటనకు, అక్కడ చెప్పే రేటుకు దాదాపు రూ.8 లక్షలు ఎక్కువ. అదేమిటి, ప్రకటనలు, ఇక్కడి హోర్డింగుల్లో కూడా రూ.48 లక్షలే ఉంది కదా అని ప్రశ్నిస్తే.. అది ఆఫర్‌లో ఇచ్చిన పాత ధర అని చెబుతున్నారు. అలాగే, వెంచర్‌లో అత్యాధునిక ఆసుపత్రులు, అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు, హోటళ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటనల్లో హోరెత్తిస్తున్నారు. తీరా, అక్కడకు వెళ్లి చూస్తే అవేవీ కనిపించడం లేదు. మౌలిక సదుపాయాలు ఎక్కడ అని ప్రశ్నిస్తే.. ఫేజ్-2, ఫేజ్-3లో నిర్మిస్తామని చెబుతున్నారు. అసలు విచిత్రం ఏమిటంటే.. వీటి అనుమతుల కోసం అసలు ఇంకా దరఖాస్తే చేయలేదు. భూములు కొనుగోలు చేయలేదు. కానీ, చుట్టుపక్కల భూమి అంతా తమదేనంటున్నారు. ఇందులో భూదాన పట్టా, వక్ఫ్, సీలింగ్ పట్టా భూములు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నక్షబాటలు మాయం
పలు అక్రమాలకు పాల్పడుతున్న ఎపిటోమ్ సంస్థ అనుమతులు రద్దు చేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల తంగడపల్లి, దేవులమ్మ నాగారం గ్రామస్తులు, కౌన్సిలర్లు హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నక్ష బాటలు మాయం చేసి రోడ్లను పూర్తిగా మూసివేశారని ఆరోపించారు. వాటికి అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గతంలో 9 మంది ఎపిటోమ్ సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి. వెంచర్ చుట్టూ పారిశ్రామికవాడ ఉంది. దీని నుంచి దుర్గంధభరిత వాసనలు వస్తూనే ఉంటాయి. దీని చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి కదా...? అని అడిగితే కంపెనీలో పెద్ద పెద్ద వారు పెట్టుబడులు పెట్టారని, వాటిని త్వరలోనే తరలించేస్తామంటూ చెబుతున్నారు.
రైతులతో వివాదాలు
జీ స్క్వేర్ ఎపిటోమ్ వెంచర్ విషయంలో స్థానిక రైతులకు, కంపెనీకి మధ్య పెద్ద వివాదాలే జరిగాయి. తమ భూములను ఆక్రమించారంటూ కొందరు రైతులు ఆందోళన చేశారు. చివరకు దీనిపై కేసులు కూడా నడిచాయి. ఈ విషయంలో కొందరు రైతులు జైలుకు కూడా వెళ్లారు. తంగడపల్లి రెవెన్యూ పరిధిలోని 12.25 ఎకరాల భూమిని చదును చేస్తుండగా ఇందులో 1.38 ఎకరాల భూమి తమదేనని మిద్దెల సుగుణమ్మ, మిద్దెల రంగయ్య, మిద్దెల కృష్ణ, మిద్దెల బద్రి, మిద్దెల పరమేశ్ అనే రైతులు అడ్డుకున్నారు. ఈ విషయంలో పరస్పర దాడులు జరిగాయి. లిటిగేషన్ ప్రాపర్టీ అని, ఎవరూ వెళ్లవద్దని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు.
ఈడెన్ గార్డెన్‌లోనూ కిరికిరే!
ఈడెన్‌గార్డెన్ తపోవన్ వెంచర్‌కు దొడ్డిదారి అనుమతులు
అటవీ భూముల్లో దారి చూపి ఆపై కేంద్రానికి దరఖాస్తు
జీ స్క్వేర్ ఎపిటోమ్‌కు సలామ్ కొడుతున్న వ్యవస్థలు
ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా ప్రధాన రహదారితో సహా లే అవుట్‌కు అనుమతి తీసుకుంటుందా!? లేక లే అవుట్‌కు అనుమతి తీసుకున్న తర్వాత రోడ్డు కోసం అనుమతికి దరఖాస్తు చేస్తుందా!? ఏ కంపెనీ అయినా మొదటిదే చేస్తుంది! కానీ, నాగార్జున సాగర్ రోడ్డుకు సమీపంలో ‘ఈడెన్ గార్డెన్ తపోవన్’ పేరిట జీ స్క్వేర్ వెంచర్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఈ వెంచర్‌కు సమీపంలోనే విపాసన కేంద్రం ఉంది. ధ్యానం, ప్రజాహితం కోసం దీనిని ఏర్పాటు చేశారు కనక.. అక్కడి అటవీ భూభాగం నుంచి 60 అడుగుల రోడ్డు వేసుకునేందుకు గతంలో ఎప్పుడో ఆంక్షలతో కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనిని విపాసన కేంద్రానికి వెళ్లే వారే వినియోగించాలని, ఇతరులు వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు కూడా పెట్టింది. ఆ తర్వాత ఈ రోడ్డునే ప్రధాన రహదారిగా చూపిస్తూ వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్ వెంచర్ వేసింది. దానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు ఇచ్చేసింది. ఈ వెంచర్‌కే ఇప్పుడు జీ స్క్వేర్ భారీ ప్రచారంతో మార్కెటింగ్ చేస్తోంది. నిజానికి, వెంచర్‌లోని ప్లాట్లను తనఖా పెట్టి టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్ రూ.120 కోట్ల రుణం (23-04-2022 తేదీన) తీసుకుంది. తనఖా పెట్టిన ప్లాట్లను 19-01-23న రిలీజ్ చేసుకుంది. అదే రోజు ఈ కంపెనీలో కొన్ని ప్లాట్లు కొనుగోలు చేయడం ద్వారా జీ స్క్వేర్ ఇందులో భాగస్వామిగా మారింది. ఇందుకు రూ.53.9 కోట్లు చెల్లించింది. అదే రోజు వెస్ట్రన్ ప్రమోటర్లలో ఒకరైన లేఖ రియల్టర్స్ నుంచి రూ.9.67 కోట్లతో మరికొన్ని ప్లాట్లు కొనుగోలు చేసింది. ఇలా జీ స్క్వేర్ కంపెనీ భాగస్వామిగా చేరింది. మొత్తం వెంచర్‌కు మార్కెటింగ్ చేస్తోంది. ఇంత తక్కువ ధరకు ప్లాట్ ఎక్కడా దొరకదంటూ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బొమ్మతో విస్తృత ప్రచారం మొదలు పెట్టింది. ‘ఈడెన్ గార్డెన్ తపోవన్’ పేరిట గజం రూ.70 వేలకుపైగా ధర నిర్ధారించి అమ్మకాలు చేస్తోంది. నిజానికి, ఇలాంటి పెద్ద వెంచర్‌కు ప్రధాన రహదారి (అప్రోచ్ రోడ్డు) 100 అడుగులు ఉంటేనే అనుమతి ఇస్తారు. కానీ, సంబంధం లేని రోడ్డును చూపించినా జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చేసింది. అంతేనా.. 60 అడుగుల ఆ రోడ్డునే లే అవుట్ మాస్టర్ ప్లాన్‌లో 100 అడుగుల రోడ్డు వస్తున్నట్లు చూపారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు అనుమతులు ఇవ్వడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పర్యావరణ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.
దాంతో, విపాసన కేంద్రానికి వెళ్లేందుకు ఇచ్చిన 60 అడుగుల రహదారిలో తమకు అనుమతి ఇవ్వాలని వెస్టర్న్ కన్‌స్ట్రక్షన్, జీ స్క్వేర్ దరఖాస్తు చేసుకున్నాయి. జీ స్క్వేర్ వెనక రాజకీయ ప్రముఖులు ఉండడంతో ఫైళ్లు కూడా చకచకా కదిలాయి. విపాసన కేంద్రం తప్ప ఇతరులు వినియోగించుకోవడానికి వీల్లేదని గతంలో స్పష్టం చేసిన కేంద్ర అటవీ శాఖ.. ఇప్పుడు ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థకే ఆగమేఘాలపై తాత్కాలిక అనుమతులు ఇచ్చేసింది. షరతులతో రహదారికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు లేఖ రాసింది. దానికి సమానమైన భూమిని పక్కనే ఇవ్వాలని షరతు పెట్టింది. అదే సమయంలో, 60 అడుగుల రహదారిపై హక్కులు మాత్రం అటవీ శాఖకే ఉంటాయని తేల్చి చెప్పింది. అంటే, రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రధాన రహదారిగా ఈ 60 అడుగుల రోడ్డు ఉన్నా.. అది ఎప్పటికీ అటవీ శాఖదేనన్నమాట. రహదారికి ఇస్తున్న తాత్కాలిక అనుమతితోపాటు నిబంధనలతో కూడిన బోర్డు పెట్టాలని నిర్దేశించింది. కానీ, ఇందుకు విరుద్ధంగా జీ స్క్వేర్ వ్యవహరిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా భారీ ప్రకటనతో బోర్డులు పెట్టింది.