Teacher posts : టీచర్ పోస్టులకు దరఖాస్తులు 20 నుంచి
ABN , First Publish Date - 2023-09-09T02:42:25+05:30 IST
లక్షలాది మంది ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 21 నుంచి నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
అక్టోబరు 21 వరకూ స్వీకరణ
నవంబరు 21 నుంచి నియామక పరీక్షలు
80 మార్కులకు పరీక్ష.. టెట్ వెయిటేజీ 20
5,089 పోస్టులకు టీఆర్‌టీ నోటిఫికేషన్
1,523 స్పెషల్ టీచర్ల భర్తీ లేనట్లే?
హైదరాబాద్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): లక్షలాది మంది ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 21 నుంచి నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. 6,612 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 5,089 పోస్టులకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచ ర్ పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెల 20 నుంచి అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఫీజును రూ.1000గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. పోస్టుల భర్తీకి విద్యా శాఖ అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్రం యూనిట్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. నవంబరు 20-30 మధ్య కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీఆర్‌టీ) పద్ధతిలో దీనిని నిర్వహిస్తారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో (మొత్తం 11) పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
160 ప్రశ్నలు.. ఒక్కోటి అర మార్కు
ఉపాధ్యాయ నియామక పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కోటి అర మార్కు చొప్పున 160 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. టెట్ వెయిటేజీ కింద 20 మార్కులను కేటాయించారు. 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్ జాబితా రూపొందించనున్నారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలను చేపట్టనుంది. చివరగా.. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి ధ్రువపత్రాల తనిఖీ చేపడతారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికతను అమలు చేయనున్నారు. జిల్లాల్లోని పోస్టులకు రోస్టర్ విధానం పాటిస్తారు. కాగా, బీఈడీ పట్టా ఉన్న అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అనర్హులని, డీఈడీ చేసినవారు మాత్రమే అర్హులని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీచర్ పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకోనున్నారు.
1,523 స్పెషల్ టీచర్ పోస్టులపై అస్పష్టత!
తాజా నోటిఫికేషన్‌లో స్పెషల్ టీచర్ పోస్టులపై ప్రభుత్వం ఏ ప్రకటన చేయకపోవడంతో అసలు వీటిని భర్తీ చేస్తారా? లేదా? అనే సందేహం నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పోస్టుల్లో కొన్నిటిని పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. వీటిని మినహాయించి, మిగిలిన వాటికి నేరుగా నియామకాలు జరపాల్సి ఉంటుంది. దాంతో ప్రస్తుతం స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
పరీక్షల కోసం రెండు నెలల గడువును మాత్రమే ఇవ్వడం పట్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 నుంచి 6 నెలల సమయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక రూ.200 ఉన్న దరఖాస్తు ఫీజును రూ.1000కి పెంచడం పైనా విమర్శలు వస్తున్నాయి.