Share News

కమలానికి ఉపశమనం

ABN , First Publish Date - 2023-12-04T04:04:07+05:30 IST

రెండు మూడు నెలల కిందటి వరకూ పార్టీలో నిస్తేజం.. 119 నియోజకవర్గాల్లో కనీసం ఉనికినైనా చాటుకుంటుందా అన్న అనుమానం..

కమలానికి ఉపశమనం

స్థానాల్లో గెలుపు, 19 స్థానాల్లో రెండో స్థానం..

14 శాతం ఓట్లు.. గత ఎన్నికలతో పోల్చితే రెట్టింపు

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో 7 సీట్లు

కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలపై వెంకట రమణారెడ్డి సంచలన విజయం

గోషామహల్‌లో రాజాసింగ్‌ హ్యాట్రిక్‌

ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల ఓటమి

లబ్ధి చేకూర్చని జనసేన పొత్తు

చివరి నిమిషం యత్నాలతో దక్కిన పరువు

బండిని కొనసాగించి, కవితపై దర్యాప్తు జరిపి ఉంటే ఇంకా మెరుగ్గా..: శ్రేణులు

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రెండు మూడు నెలల కిందటి వరకూ పార్టీలో నిస్తేజం.. 119 నియోజకవర్గాల్లో కనీసం ఉనికినైనా చాటుకుంటుందా అన్న అనుమానం.. మరోవైపు, బీఆర్‌ఎ్‌స-బీజేపీ ఒక్కటే, బీజేపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనంటూ కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున చేసిన ప్రచారం.. క్యాడర్‌లో గందరగోళం.. వీటన్నింటి మధ్యనే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, చివరి దశలో పార్టీ జాతీయ నాయకత్వం ప్రచారాన్ని సీరియ్‌సగా తీసుకొని ప్రధాని మోదీ, నడ్డా, అమిత్‌షా తదితరులతో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించటం, మాదిగల విశ్వరూప మహాసభకు మోదీ స్వయంగా హాజరై ఎస్సీ వర్గీకరణకు హామీ ఇవ్వటం, బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించటంతో బీజేపీ పరిస్థితి మెరుగైందన్న సంకేతాలు వెలువడ్డాయి. అయినా, 3-4 స్థానాలకు మించి దక్కకపోవచ్చని అంచనాలు, విశ్లేషణలు వచ్చాయి. కానీ, అనూహ్యంగా 8 స్థానాల్లో గెలిచి, 19 స్థానాల్లో రెండో స్థానాల్లో నిలిచి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32.35 లక్షల (14 శాతం) ఓట్లను కైవసం చేసుకొని విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించగా, ఈసారి దాన్ని రెట్టింపు చేసుకుంది. ఒకవేళ బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించి, బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటనే ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై నమోదైన ఆరోపణల మీద దర్యాప్తును కొనసాగించి ఉంటే 25-30 స్థానాల్లో కచ్చితంగా గెలిచేవారమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఉత్తర తెలంగాణలో సత్తా చాటిన కమలం

కమలం పార్టీ ఉత్తర తెలంగాణలో సత్తా చాటింది. బీజేపీ గెలుచుకున్న 8 స్థానాల్లో ఏడు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోనివే. కాగా, పార్టీ నుంచి బరిలోకి దిగిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌, బాపూరావులకు చుక్కెదురయ్యింది. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు ఓటమిపాలయ్యారు. ఒక దశలో సీఎం అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఈటల.. హుజూరాబాద్‌, గజ్వేల్‌లో ఓడిపోయారు. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్యంగా గెలుపొందిన రఘునందన్‌ ఈసారి విజయాన్ని ఖాతాలో వేసుకోలేకపోయారు. అయితే, గోషామహల్‌లో రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ను, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఓడించడం ద్వారా కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి సంచలనం సృష్టించారు.

అంచనాలు లేని దశ నుంచి..

తెలంగాణలో క్షేత్రస్థాయిలో పెద్దగా ఉనికిలో లేని బీజేపీ.. కేసీఆర్‌ రెండో దశ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా విస్తరించడం మొదలుపెట్టింది. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో విజయాలు నమోదు చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్‌లు గెలుచుకుని, 35.46 శాతం ఓటుబ్యాంకు కైవసం చేసుకొని బీఆర్‌ఎ్‌సకు ముచ్చెమటలు పట్టించింది. మునుగోడు ఉప ఎన్నికలో 38.48 శాతం సాధించి బీఆర్‌ఎ్‌సతో పోటాపోటీగా నిలిచింది. దీంతో తెలంగాణలో బీఆర్‌ఎ్‌సకు దీటైన ప్రతిపక్షం బీజేపీయేననే పరిస్థితి వచ్చింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌స నుంచి ప్రముఖ నేతలు బీజేపీలో చేరడం కూడా ఆ పార్టీ బలాన్ని మరింత పెంచింది. కానీ, రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్‌ని అకస్మాత్తుగా తొలగించటం బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేసింది. ఇదే క్రమంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. కార్యకర్తలకు దశాదిశాకరువయ్యాయి. మరోవైపు, మద్యం కుంభకోణంలో కేసీఆర్‌ కుమార్తె కవిత అరెస్టు ఖాయమంటూ తొలుత ఉధృత ప్రచారం చేసిన బీజేపీ ఆ తర్వాత మాటమార్చటం, ఆ కేసుపై కేంద్రప్రభుత్వం పట్టు సడలించటంతో బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్న వాదన బయల్దేరింది. దీనిని కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రచారం చేసి, పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుంది. తాము బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ, వ్యూహాత్మక పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఎంత చెప్పినా ప్రజలే కాదు, పార్టీ కేడరే నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న అత్యంత కీలకమైన తరుణంలో బీజేపీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీని గణనీయంగా బలహీనపర్చాయి. దీనికి తోడు పార్టీ ముఖ్యనేతల మధ్య అంతర్గత విభేదాలు, టికెట్ల పంపిణిలో గందరగోళం, ముక్కూమొహం తెలియని అభ్యర్థులను బరిలోకి దింపడం, సీనియర్‌ నేతలు ఇతర పార్టీల్లోకి ముఖ్యంగా కాంగ్రె్‌సలోకి వెళ్లిపోవటం, నామినేషన్‌ల చివరి క్షణం వరకూ అభ్యర్థులను ఖరారు చేయకపోవడం వంటివి పార్టీని మరింత దెబ్బతీశాయి. జాతీయ నాయకత్వం చివరి దశలో బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అస్త్రాలను ప్రయోగించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, అధ్యక్షుడు నడ్డా సహా కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎన్నికల రణరంగంలోకి తరలివచ్చింది. బీసీలకు 36 టిక్కెట్లు కూడా ఇచ్చింది. మరోవైపు, రెడ్డి సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకునేలా పార్టీ సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్‌గా అవకాశం ఇచ్చింది. ఈ చివరి దశ ప్రయత్నాలే బీజేపీని నిలబెట్టాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఏమాత్రం పట్టులేని జనసేనతో పొత్తు లాభం చేకూర్చలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం వ్యతిరేకించినా ఎన్డీయేలో ఉందని పేర్కొంటూ 8 సీట్లు ఇచ్చింది. వీటన్నిటినీ బేరీజు వేస్తూ.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోని జాతీయ నాయకత్వం, ఒకరిద్దరు నేతల మాటలు విని నిర్ణయాలు తీసుకుంది. దాని ఫలితమే ఈ దుస్థితి’ అని పార్టీ సీనియర్‌ నేత మరొకరు అభిప్రాయపడ్డారు.

19 నియోజకవర్గాల్లో రెండోస్థానం

రాష్ట్రవ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలిచారు. ఇందులో పాతబస్తీలోని సెగ్మెంట్లు కూడా ఉండడం విశేషం. చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, కార్వాన్‌లలో బీజేపీ అభ్యర్థులు తమ ప్రధాన ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. అంబర్‌పేట, బోథ్‌, దుబ్బాక, గజ్వేల్‌, హుజురాబాద్‌, కల్వకుర్తి, కరీంనగర్‌, కోరుట్ల, మహేశ్వరం, మంచిర్యాల, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌, వరంగల్‌ ఈస్ట్‌, ఎల్బీనగర్‌లలో కూడా బీజేపీ రెండోస్థానంలో నిలిచింది.

కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లకు షాక్‌

ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన ఇద్దరు అగ్రనేతలకు ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేట (కిషన్‌రెడ్డి), ముషీరాబాద్‌ (లక్ష్మణ్‌)లలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడిగా కిషన్‌రెడ్డి తన సెగ్మెంటు పరిధిలో ఒక్క అభ్యర్థినీ గెలిపించుకోలేకపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న లక్ష్మణ్‌ కూడా కనీసం గ్రేటర్‌ హైదరాబాద్‌లో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారన్న విమర్శ వస్తోంది. బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రె్‌సలో చేరిన సీనియర్‌ నేతలు వివేక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాసరెడ్డి విజయం సాధించడం గమనార్హం.

Updated Date - 2023-12-04T04:04:08+05:30 IST