Share News

RS Praveen Kumar Interview : బహుజనుల బంధువునై కొట్లాడతా

ABN , First Publish Date - 2023-11-28T03:24:39+05:30 IST

ప్రభుత్వ ఏర్పాటులో మీ అవసరం వస్తే ఎవరికి మద్దతిస్తారు? రెండంకెల సీట్లు సాధిస్తామనే నమ్మకం ఉంది. బహుజనులకు ఎకరం భూమితో పాటు విద్య, వైద ్యం, స్వయం ఉపాధితోపాటు ..

 RS Praveen Kumar Interview : బహుజనుల బంధువునై కొట్లాడతా

ఓట్లు చీల్చడం బీఎస్పీ విధానం కాదు

కచ్చితంగా రెండంకెల సీట్లు సాధిస్తాం

సిర్పూర్‌ నుంచి నేను పోటీ చేస్తుంటే

అగ్రవర్ణాల నేతల్లో అంత ఉలుకెందుకు?

దళిత బిడ్డ శిరీషపై దాడులు హేయం

‘ఆంధ్రజ్యోతి’తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ప్రభుత్వ ఏర్పాటులో మీ అవసరం వస్తే ఎవరికి మద్దతిస్తారు?

రెండంకెల సీట్లు సాధిస్తామనే నమ్మకం ఉంది. బహుజనులకు ఎకరం భూమితో పాటు విద్య, వైద ్యం, స్వయం ఉపాధితోపాటు ప్రభుత్వ కాంట్ర్టాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పే పార్టీకే మా మద్దతు ఉంటుంది. ఈ అంశంపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితోనూ మాట్లాడి, తుది నిర్ణయం తీసుకుంటాం.

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఓట్లు చీల్చడం బీఎస్పీ విధానం కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బహుజన వాదం బలంగా ఉందని, బహుజనుల బంధువునై కొట్లాడేందుకు తాను ఎన్నికల బరిలోకి దిగానని పేర్కొన్నారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు అంశాలను వెల్లడించారు.

ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఎన్ని స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వబోతోంది?

రాష్ట్ర వ్యాప్తంగా 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. అన్ని స్థానాల్లోనూ మా అభ్యర్థులు బలమైన పోటీ ఇవ్వబోతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చితే మీరు అనుకున్న ప్రయోజనాలు నెరవేరుతాయా?

ఓట్లు చీల్చడం మా పార్టీ విధానం కాదు. రాష్ట్రంలో ఈ సారి బహుజనవాదం బలంగా వీస్తోంది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓట్లు వేసినా బహుజనుల బతుకుల్లో మార్పు రావడం లేదు. దాన్ని మార్చాలంటే ఆధిపత్య కులాల నాయకులకు, దోపిడీ పార్టీలకు వేయకుండా బహుజనుల ఓట్లు బహుజనులకే వేసుకుంటాం.

సొంత నియోజకవర్గం అలంపూర్‌ కాదని సిర్పూర్‌లో పోటీ వెనుక వ్యూహం ఏంటి?

దళితులు జనరల్‌ స్థానంలో పోటీ చేయవద్దని ఎక్కడ ఉంది..? నేను పోటీ చేస్తే అగ్రవర్ణాలకు ఎందుకంత ఉలుకు? సిర్పూర్‌ నేటికీ ఆంధ్రా దోపిడీ పాలనలో ఉంది. దాన్ని తెలంగాణలో కలపడానికే ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నా. సహజవనరులు ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడి ప్రజలు దోపిడీ దారులను, కబ్జాకోరులను ఓడించేందుకు నన్ను దత్తత తీసుకున్నారు. బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక వారిలో ఒకడిగా వారి బంధువుగా కొట్లాడేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను.

కొల్లాపూర్‌లో బర్రెలక్క(శిరీష)పై దాడులు జరిగాయి కదా.. మీ అభిప్రాయం ఏంటి?

బర్రెలక్క (శిరీష) ఓ నిరుపేద దళిత అమ్మాయి. చట్ట సభల్లో నిరద్యోగులకు అండగా గొంతు వినిపించేందుకు జనరల్‌ స్థానం నుంచి పోటీ చేస్తే దాడులు చేయడం హేయమైన చర్య. గతంలో యూట్యూబ్‌ వీడియో చేసినందుకు శిరీషపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసింది. అప్పుడు నేను పోలీసులతో మాట్లాడి, ఆమెకు ధైర్యం చెప్పాను. ఎన్నికల్లో శిరీష పోటీ చేస్తుందనే సమాచారం నాకు లే దు. అక్కడ మా పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అందుకే బీఎస్పీ ప్రత్యక్షంగా ఆమెకు మద్దతు ఇవ్వలేకపోతోంది.

రాజకీయ ఆరంగేట్రం కోసమే మీరు గురుకులాల కార్యదర్శిగా పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి?

నా రాజకీయ రంగప్రవేశం యాదృశ్చికమే.. ముందస్తు ప్రణాళిక ఏదీలేదు. విద్యావ్యవస్థలో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాం ఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాను. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా అదే పదవిలో కొనసాగాను. గురుకులంలో చదివే విద్యార్థులందరూ నా బిడ్డలతో సమానం అనుకున్నాను. ప్రతిఒక్కరిని ఎవరెస్ట్‌ అంతఎత్తు ఎదిగేలా తీర్చిదిద్దాను. గురుకుల విద్యాసంస్థలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాను.


నకిలీ నెక్లెస్‌లు ఇస్తారు.. మోసపోవద్దు: ప్రవీణ్‌

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఓట్లు రాబట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు నకిలీ బంగారు నెక్లె్‌సలు ఇచ్చే అవకాశం ఉందని, వాటిని నమ్మి మోసపోవద్దని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సిర్పూర్‌ నియోజకవర్గంలోని కౌటాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్‌ పేరుతో మేడిగడ్డకు తరలించారన్నారు. దీనికి ఎమ్మెల్యే కోనప్పే కారణమని ఆరోపించారు. ఒకవైపు గోదావరి, ప్రాణ హిత నదులు ఉన్నప్పటికీ, సాగునీరు అందక ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వడంలో సర్కారు విఫలమైందన్నారు. ఆరె కులాన్ని కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-11-28T03:25:26+05:30 IST