Tummala Nageswara Rao : భద్రాద్రిలోకి చుక్క వరద నీరు రానివ్వం
ABN , First Publish Date - 2023-11-22T03:11:21+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత భద్రాచలంలోకి చుక్క వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
భద్రాద్రి కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి తుమ్మల హామీలు..
78 సీట్లతో కాంగ్రె్‌సదే అధికారం: పొంగులేటి
భద్రాచలం, నవంబరు 21: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత భద్రాచలంలోకి చుక్క వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి తుమ్మల భద్రాచలంలో మంగళవారం ప్రచారం(కార్నర్ మీటింగ్) నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ భద్రాద్రి ఖ్యాతిని పెంచేందుకే జాతీయ రహదారులు తీసుకొచ్చామని, రైల్వే లైన్ ఏర్పాటుకూ కృషి చేస్తామని చెప్పారు. భద్రాద్రి వాసుల కోరిక మేరకు భద్రాద్రి పంచాయతీపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నీతిమంతుడు, ధర్మాత్ముడు, హనుమంతుడు లాంటి పొదెం వీరయ్యను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇక, ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేలా ఉండాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలను, విలేకరులను మోసగించిన కేసీఆర్ చివరకు భద్రాద్రి రాముడిని కూడా మోసగించారని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో శ్రీరామనవమి అప్పుడు స్వామి వారికి ఒకేఒక్కసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు 76 నుంచి 78 సీట్లు వస్తాయని, డిసెంబరు 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన దౌర్బాగ్యుడు ఆ సమయంలో భద్రాది ఎమ్మెల్యేకు కూడా రూ.30 కోట్లు ఆశచూపాడని ఆరోపించారు. కానీ, ఆ డబ్బును తిరస్కరించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య తాను నమ్మిన కాంగ్రెస్ పార్టీని, మూడు రంగుల జెండాను వీడలేదని ప్రశంసించారు. నిజాయితీపరుడైన వీరయ్యను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.