Share News

Telangana Election: ఇళ్లు, స్థలాలు, పొలాలు, బంగారు నగలు.. ఫామ్‌హౌజ్‌లు.. తాకట్టు పెట్టి మరీ పోటీ

ABN , First Publish Date - 2023-11-20T04:12:40+05:30 IST

ఎమ్మెల్యే పదవి అంటే కొందరికి ఎన్నాళ్లో వేచిన కల. ఆ కల నెరవేరినవారికి.. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సుస్థిరం చేసుకోవాలనే తపన.

Telangana Election: ఇళ్లు, స్థలాలు, పొలాలు, బంగారు నగలు.. ఫామ్‌హౌజ్‌లు.. తాకట్టు పెట్టి మరీ పోటీ

ఆస్తులు అమ్మేసి అయినా.. అధ్యక్షా అనాలని

ఇళ్లు, స్థలాలు, పొలాలు, బంగారు నగలు.. ఫామ్‌హౌజ్‌లు.. తాకట్టు పెట్టి మరీ పోటీ

ఖర్చు ఎంతైనా.. సై అంటే సై అంటూ బరిలోకి.. ప్రతిపక్షాల అభ్యర్థుల్లో ఇలాంటివారు ఎక్కువ

మ్మెల్యే పదవి అంటే కొందరికి ఎన్నాళ్లో వేచిన కల. ఆ కల నెరవేరినవారికి.. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సుస్థిరం చేసుకోవాలనే తపన. ‘‘ఏం చేసి అయినా సరే గెలవాలి. ఎమ్మెల్యే కావాలి. అధ్యక్షా అని పిలవాలి.’’ అని తపిస్తారు. మరి గెలవాలంటే ఎన్నికల ఖర్చుకు బోలెడు డబ్బులు కావాలి. కానీ.. అంత డబ్బు అందరి దగ్గరా ఉండదు. అప్పుడేం చేయాలి? అంటే.. ‘తగ్గేదే లేదు. వీలైనంతమేరకు అప్పులు చేద్దాం. ఆస్తులు తాకట్టు పెడదాం. అయినా కావాల్సిన డబ్బు సమకూరకుంటే.. కొన్ని ఆస్తులు అమ్మేద్దాం’’ అన్నట్లుగా ఆయా అభ్యర్థుల వ్యవహార శైలి ఉంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు.. తన సమీప ప్రత్యర్థి ప్రచారంలో చేస్తున్న హంగామా కంటే తన ప్రచారంలో ఎక్కువ హంగు హర్బాటం ఉండాలన్నట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రచారానికి అయ్యే ఖర్చుకు తోడు.. ‘పంపిణీ’ ఖర్చు అదనం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కులాలు, సంఘాలు, మతాలవారీగా ఓట్లు రాబట్టుకునే ప్రక్రియ మొదలుపెట్టి వారికి కావాల్సిన తాయిలాలు అందజేస్తున్నారు. ఫలానా చోట యువత తమకు వ్యతిరేకంగా ఉందని అభ్యర్థులకు తెలిస్తే వెంటనే అక్కడికి వాలిపోయు వారితో బేరసారాలు చేసుకొని వారిని సంతృప్తిపరుస్తున్నారు.

ఎవరి పరిస్థితి ఏంటంటే..

అన్ని పార్టీల అభ్యర్థులూ ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును దాదాపుగా అంచనా వేసి అందుకు కావల్సిన మొత్తాన్ని వివిధ మార్గాల ద్వారా ఇప్పటికే సమకూర్చుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ అభ్యర్థులకు పార్టీ ఫండ్‌ కింద ఒక్కో నియోజకవర్గానికీ ఇంతని ఇప్పటికే నగదు సమకూర్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్లో కొందరు మాత్రం ప్రచార ఖర్చుల కోసం కావాల్సిన డబ్బును వివిధ మార్గాల్లో సమకూర్చుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఇక.. ప్రజల్లో మంచి పేరున్న అభ్యర్థులకు ఎన్నారైలు, స్నేహితులు, బంధువులు, రియల్టర్లు, వ్యాపారస్తులు చందాల రూపంలో డబ్బును సర్దుబాటు చేస్తున్నారు.

అప్పుల అప్పారావులు..

వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు లేక తన ఆస్తులను.. తాండూర్‌ నియోజకవర్గానికి చెందిన ఓ నేత దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీకే చెందిన మరో అభ్యర్థి హైదరాబాద్‌ శివారులోని తన రూ.10 కోట్ల విలువైన ఫామ్‌ హౌస్‌ను తనఖా పెట్టి డబ్బులు సమకూర్చుకున్నారు.వనపర్తి, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో ఓ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికలకు కొన్ని నెలల ముందే హైదరాబాద్‌లోని స్థలం అమ్మినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులు నగరంలో ఉన్న కొంత ఆస్తిని అమ్మినట్లు ప్రచారం జరుగుతుంది. మరో అభ్యర్థికి ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారస్తులు చందాల రూపంలో డబ్బులు అందజేసినట్లు సమాచారం.పెద్దపల్లి, కరీనంగర్‌ జిల్లాలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టి డబ్బులు పోగుచేసుకున్నట్లు తెలిసింది.


అప్పుల కోసం విదేశీమిత్రుల దగ్గరికి

అప్పుల కోసం కొందరు అభ్యర్థులు విదేశీ మిత్రులను ఆశ్రయించారు. వికారాబాద్‌, రంగారెడ్డి , అదిలాబాద్‌ జిల్లాలకు చెందిన కొందరు అభ్యర్థులు ఎన్నారైల దగ్గరకు తమ కుటుంబ సభ్యులను పంపించి మరీ అప్పుల ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. వారికి ప్రామి సరీ నోట్లు రాసిచ్చి ఇక్కడే డబ్బులు ఏర్పాటు చేయించుకుంటున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ ఎన్నికల కోసం హైదరాబాద్‌లో ఉన్న భూములను అమ్ముకున్నారు. బీజేపీకి చెందిన ఒక అభ్యర్థి కూడా ఇదే విధంగా తన స్థిరాస్తులు అమ్ముకున్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో ఓ బీజేపీ అభ్యర్థి కామారెడ్డి పట్టణంతో పాటు వరంగల్‌, హైదరాబాద్‌లోని రూ.20 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను అమ్మినట్లు.. మరికొన్ని ఆస్తులను తాకట్టు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

నిండు సభలో.. రాష్ట్రమంతా టీవీల్లో చూస్తుండగా.. అసెంబ్లీలో మైకు పుచ్చుకుని.. ‘అధ్యక్షా’.. అంటే ఆ కిక్కే వేరబ్బా! అలా ప్రసంగించడంలో ఉండే కిక్కు రాజకీయ నాయకులకే తెలుసు! అందుకే.. ఎమ్మెల్యే కావడానికి వారు ఎన్ని కష్టాలైనా పడతారు! అవసరమైతే ఆస్తులు తాకట్టు పెడతారు. కుదరకపోతే.. ఆస్తుల్ని అమ్మేసైనా సరే బరిలోకి దిగి సై అంటే సై అంటారు!! ఈ ఎన్నికల్లోనూ అలాంటి నాయకులు చాలామందే ఉన్నారు.

Updated Date - 2023-11-20T10:55:19+05:30 IST