Share News

Priyanka Gandhi : మోదీ తమ్ముడు కేసీఆర్‌

ABN , First Publish Date - 2023-11-26T02:23:35+05:30 IST

ప్రధాని మోదీకి కేసీఆర్‌ తమ్ముడులాంటివారని.. కేసీఆర్‌కు ఏ చిన్న ఆపద వచ్చినా మోదీ తెలంగాణలో వాలిపోతారని, కేంద్రంలో ఏ బిల్లులున్నా కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి మోదీకి మద్దతిస్తారని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంఽధీ అన్నారు. ప్రభుత్వ సంస్థలను

Priyanka Gandhi : మోదీ తమ్ముడు కేసీఆర్‌

ఢిల్లీ వెళ్లి బిల్లులకు మద్దతు ఇస్తారుకేసీఆర్‌కు ఆపదొస్తే మోదీ వచ్చి వాలిపోతారు

పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని దోచుకున్నారు

పదేళ్ల పాలనలో కేసీఆర్‌ బుద్ధేంటో తెలిసింది

రుణమాఫీ చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి

బీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌కు బుద్ధి చెప్పండి

సంపద సృష్టించి ప్రజల జేబుల్లో పెడతాం

కాంగ్రెస్‌ను గెలిపిస్తే కొత్త ఏడాదిలో నవశకం

ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర ప్రచార

సభల్లో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ

ప్రభుత్వ సంపదను ప్రజల జేబుల్లో పెట్టే కాంగ్రెస్‌ ఓ వైపు, అన్ని వర్గాలను మోసగించి, ఇబ్బందులకు గురి చేసిన బీఆర్‌ఎస్‌, బీజేపీ మరోవైపు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి.. కొత్త సంవత్సరంలో నవశకాన్ని ప్రారంభిద్దాం.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం. ఆరు గ్యారెంటీల అమలుపై భరోసా కల్పించాలంటూ మా అమ్మ సోనియా గాంధీ నన్ను తెలంగాణకు పంపారు. మేం మాట ఇస్తే తప్పం.

- ప్రియాంకా గాంధీ

ఖమ్మం, ఆంధ్రజ్యోతి ప్రతినిధి/ఖమ్మం రూరల్‌/కల్లూరు/మధిర, నవంబరు 25: ప్రధాని మోదీకి కేసీఆర్‌ తమ్ముడులాంటివారని.. కేసీఆర్‌కు ఏ చిన్న ఆపద వచ్చినా మోదీ తెలంగాణలో వాలిపోతారని, కేంద్రంలో ఏ బిల్లులున్నా కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి మోదీకి మద్దతిస్తారని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంఽధీ అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మోదీ గండి కొడుతున్నారని, సింగరేణిని కూడా ప్రైవేటీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఆ సంస్థ ప్రజలదని ప్రైవేట్‌పరం కానివ్వబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంపదను ప్రజల జేబుల్లో పెట్టే కాంగ్రెస్‌ ఓవైపు, అన్ని వర్గాలను మోసగించి ఇబ్బందులకు గురి చేసిన బీఆర్‌ఎస్‌, బీజేపీ మరోవైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. శనివారం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం, పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్‌ మండలం వరంగల్‌ క్రాస్‌రోడ్‌, సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో రోడ్‌ షోలు, మధిరలో బహిరంగ సభలో ప్రియాంక పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మట్టా రాగమయి, మల్లు భట్టి విక్రమార్కకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

కొత్త సంవత్సరంలో నవశకాన్ని ప్రారంభించేందుకు, ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రె్‌సను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీల అమలుపై భరోసా కల్పించాలంటూ తన తల్లి సోనియాగాంధీ తనను పంపారని, తాము మాట ఇస్తే అమలు చేసి తీరతామని అన్నారు. ‘‘పదేళ్ల పాలనలో కేసీఆర్‌ బుద్ధేంటో ప్రజలకు తెలిసింది. నిరుద్యోగులకు కొలువులు రాలేదు కానీ ఆయన కుటుంబసభ్యులకు ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర సంపదను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, ఆడ బిడ్డల కలలు నెరవేరలేదు. మహిళల ఉపాధిని నిర్లక్ష్యం చేశారు. టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రాలను అంగట్లో అమ్ముకుని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. కాళేశ్వరం నుంచి గ్రామస్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతోంది. కమీషన్ల వ్యవస్థ నడుస్తోంది. ఉద్యోగాలు కావాలంటే ఈ ఎన్నికల్లో మార్పు రావాలి. అందరి కలలు నెరవేరాలంటే రుణ మాఫీ చేసే, ఉద్యోగాలిచ్చే, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రె్‌సను భారీ మెజారిటీతో గెలిపించాలి. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంఐఎంకు బుద్ధి చెప్పాలి’’ అని కోరారు. ఫాంహౌజ్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్‌ పాలనతో ఇబ్బంది పడ్డామని, ఇంతకాలం పట్టించుకోని పెద్దమనిషి ఎన్నికలప్పుడు బయటకు వస్తారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

రాహుల్‌ యాత్రలాగే భట్టి పాదయాత్ర

ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు తన సోదరుడు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర చేశారని, రాష్ట్రంలో భట్టి విక్రమార్క కూడా అలాగే పాదయాత్ర చేశారని ప్రియాంక కొనియాడారు. మధిర సభలో భట్టి మాట్లాడుతూ వందమంది కేసీఆర్‌లు వచ్చినా మఽధిర గేటును కూడా తాకలేరని తనను ఏం చేయలేరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రియాంకకు జనం నీరాజనం పలికారు. పాలేరు కారర్‌మీటింగ్‌ సందర్భంగా బంజారా మహిళల్లో ఇద్దరిని వాహనంపైకి ప్రియాంక పిలిచారు. ‘‘మూడు రంగుల జెండా పట్టి సింగమోలె కదిలినాడు’’ అంటూ రేవంత్‌రెడ్డిపై రూపొందించిన పాటకు వారితో కలిసి నృత్యం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సభలకు విశేష ఆదరణ వస్తోందని.. రాష్ట్రంలో మార్పునకు ఇది సంకేతమని ప్రియాంక ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-11-26T02:23:36+05:30 IST