Share News

Revanth Reddy: 9న ప్రమాణస్వీకారం చేస్తా

ABN , First Publish Date - 2023-11-17T04:06:27+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు!? ఈ ప్రశ్నకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు!

Revanth Reddy: 9న ప్రమాణస్వీకారం చేస్తా

ఎన్టీఆర్‌, వైఎస్‌ సెంటిమెంట్‌తో ఎల్బీ స్టేడియంలోనే

ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా జన్మదినం కూడా

పదేళ్లు అధికారమిస్తే రాష్ట్రంలో మార్పు చూపిస్తా

ఆ మేరకు నాకు స్పష్టమైన విజన్‌ ఉంది

నా మీదున్న కేసులే నా పనితనానికి ఒక ఆధారం

కక్ష సాధింపు ఉండదు.. కేసీఆర్‌ అవినీతిపై విచారణ తప్పదు

కేటీఆర్‌ నా ముందు బచ్చాగాడు.. ఆయన నన్ను తిట్టొచ్చా!?

కామారెడ్డిలో పోటీ పార్టీ నిర్ణయం.. అక్కడ ఏదైనా కావచ్చు

కేసీఆర్‌, కేటీఆర్‌ ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు లెక్కలు

ధరణి పథకం తీసుకొచ్చి వేల కోట్లు దోచుకున్నారు

కేసీఆర్‌ రిటైరై, తర్వాతి తరానికి సలహాలు ఇవ్వాలి

అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా ప్రగతిభవన్‌

చంద్రబాబు అరెస్టు వ్యక్తిగతంగా నన్ను బాధించింది

ఆ విషయంలో కేటీఆర్‌ బలుపు మాటలు మాట్లాడాడు

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో

బిగ్‌ డిబేట్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

ధరణి లావాదేవీలపై విచారణ జరిపిస్తాం

దానిని రద్దు చేసి మెరుగైన విధానం తీసుకొస్తాం

ఆయనకున్న మొత్తం భూమి 76 ఎకరాలు

సీలింగ్‌ నిబంధనల పేరిట 53 ఎకరాలే వేశారు

ధరణి పేరిట ముఖ్యమంత్రే చట్టాల్ని ఉల్లంఘిస్తుండు

వాళ్ల ధరణి వివరాలు ఎవరూ చూడకుండా చేశారు

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు!? ఈ ప్రశ్నకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు! ఎన్టీఆర్‌, వైఎస్‌ సెంటిమెంట్‌తో డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలోనే తన ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు! సీఎం ఎవరనేది అధిష్ఠానం తనకు చెప్పలేదంటూనే.. పదేళ్లపాటు అధికారం ఉంటే తెలంగాణలో మార్పు చూపిస్తానని, ఆ మేరకు విజన్‌ ఉందని అన్నారు! ప్రజలకు అన్నీ ఇచ్చానని అంటున్న కేసీఆర్‌.. వారి స్వేచ్ఛను హరించారని, తెలంగాణ ప్రజలు ఆకలిని భరిస్తారు కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడాన్ని, అహంకారాన్ని సహించరని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అహంకారం పెరిగిందని, వారి నుంచి త్వరలోనే తెలంగాణకు విముక్తి కలుగుతుందని ప్రకటించారు! చంద్రబాబు అరెస్టు తనను బాధించిందని, ఆయన అరెస్టుపై కేటీఆర్‌ బలుపు మాటలు మాట్లాడారని తప్పుబట్టారు!

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై తప్పకుండా విచారణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీలు ప్రచారం చేస్తున్నాయని, కానీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తెలిపారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ గురువారం నిర్వహించిన బిగ్‌ డిబేట్‌లో రేవంత్‌ పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ వివరాలు..

-ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

ఆర్కే: వెల్‌కమ్‌ టు బిగ్‌ డిబేట్‌ రేవంత్‌. మాంచి హుషారుగా ఉన్నట్లున్నావ్‌. ఇంత తిరుగుడుకి అలసిపోయి ఉండాలి. కానీ, కొత్త కళ కనపడుతోంది. ఏంటీ సంగతి?

రేవంత్‌: 20 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాను. ఈ పదేళ్ల నుంచి మీకు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటాయా!? ఇందుకోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామా? దీని కోసమే 2009లో పొత్తులో భాగంగా కేసీఆర్‌ను గెలిపించడానికి రాత్రంతా తిరిగామా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తొందరలో సమాధానం దొరకబోతోందనే ఉత్సాహం కావచ్చు. కళాకారులకు చప్పట్లు మాదిరిగా.. రాజకీయ నాయకులకు ప్రజల నుంచి వచ్చే ఆదరణ, స్పందన టానిక్‌లా పని చేస్తుంది. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నామన్న నమ్మకం, విశ్వాసం కారణంగా తెలియకుండానే ఉత్సాహం వస్తోంది. ఇస్రో సైంటిస్టుకు, డాక్టరుకు అదే ప్రపంచమన్నట్లుగా 24 గంటలూ నాకు ఇదే వృత్తి, వేరే వ్యాపకం లేదు. ఒక జర్నలిస్టుగా పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించినప్పుడు మీకు కలిగే కిక్కును రాజకీయ నాయకుడిగా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఊహించని విధంగా కాంగ్రె్‌సలోకి వచ్చాను. అతి తక్కువ సమయంలో పార్టీ అధ్యక్షుడిని అయ్యాను. దేశంలోనే బలమైన నాయకుడిని అని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించానని, దానిని చంద్ర మండలానికి తీసుకెళ్లేంత అభివృద్ధి చేశానని చెప్పుకొంటున్న వ్యక్తి(కేసీఆర్‌)తో స్ట్రెయిట్‌ ఫైట్‌ దిగడమనేది...

ఆర్కే: స్ట్రెయిట్‌ ఫైటేనా!? మధ్యలో బీజేపీ లేదా? మీ దృష్టిలో ట్రయాంగిల్‌ ఫైట్‌ లేదా?

రేవంత్‌: బీజేపీకి సౌండ్‌ ఉంది గానీ గ్రౌండు లేదు. బీజేపీ మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదు. అందుకే కిషన్‌రెడ్డి, డీకే అరుణ, మురళీధర్‌రావు తదితర కీలక నేతలంతా పోటీ నుంచి తప్పుకొన్నారు. బీజేపీ నామమాత్రంగానే పోటీ చేస్తోంది. కాంగ్రె్‌సను ఓడించడానికే మాత్రమే వ్యూహాత్మకంగా అభ్యర్థులను పెట్టింది. బీఆర్‌ఎ్‌సను గెలిపించే దిశగా నిర్ణయాలున్నాయి. అందుకే ప్రజల దృష్టిలో రెండు పార్టీల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది.

ఆర్కే: బీజేపీ గెలిచినా, రేవంత్‌ గెలిచినా ఒకటే అన్నట్లుగా అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతున్నారు. గాంధీ భవన్‌నే ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యాలయంగా మార్చేశాడని అంటున్నారు. ఇదో కొత్త స్లోగన్‌ మొదలైంది.

రేవంత్‌: 20 ఏళ్ల నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నా. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నా. ఏ రోజూ ఇలాంటి చర్చ జరగలేదు. ఈ రోజే ఎందుకు జరుగుతోంది!? రేవంత్‌తో ప్రమాదమని వారు అంచనా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా మైనారిటీలు లౌకిక పార్టీ కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రె్‌సవైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో, ముస్లింల్లో ఉన్న పట్టును ఎంఐఎం కోల్పోతోంది. ఆ పార్టీ పోటీ చేస్తున్న 7 సీట్లలో మూడింట నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. అక్కడ ఓడిపోతారన్న చర్చ జరుగుతోంది. మజ్లి్‌సను తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించినా.. ఆ పార్టీ నేతల వ్యవహార శైలి అనుమానాస్పదం. ఇతరులకు లబ్ధి చేకూర్చడానికి వీలుగా వారి నిర్ణయాలు జరుగుతున్నాయి. అమిత్‌ షా చేతిలో అసదుద్దీన్‌ ఒవైసీ కీలుబొమ్మగా మారాడు. ముస్లిం ఓట్లు పోలరైజ్‌ అవుతున్నాయంటూ భ్రమింపజేసి, హిందూ ఓట్లను బీజేపీకి గంపగుత్తగా వేయించి, ఆ పార్టీని అధికారంలో ఉంచడానికి ఒవైసీ వ్యవహరిస్తున్నాడని ప్రజలు గుర్తించారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండడంతో కాంగ్రె్‌సను తిట్టకుండా, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌, ఇతర అంశాలన్నింటినీ నాకు రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు.

కేటీఆర్‌ కంటే నేను పెద్దవాడిని కాదా!?

ఆర్కే: కాంగ్రె్‌సలో గతంలో పది ముఖాలు కనిపించేవి. గెలుస్తామో లేదో తెలియని వాడు కూడా ముఖ్యమంత్రి తానే అనేవాడు. ఇప్పుడు ఏ మంత్రం వేశారో, ఢిల్లీవారి చాకచక్యమో తెలియదుగానీ ఎవరూ చప్పుడు చేయడం లేదు. రేవంతే కనపడుతున్నాడు! నువ్వు కూడా ఎక్కడా తగ్గడం లేదు. కేసీఆర్‌ను సన్నాసి అని అంటున్నావు. వయసులో ఆయన పెద్దవాడు కదా?

రేవంత్‌: సర్‌.. మంచి ప్రశ్న అడిగారు. కేటీఆర్‌ కంటే నేను వయసు, అనుభవంలో చాలా పెద్దవాడిని. కేటీఆర్‌ నా మందు బచ్చాగాడు. కేటీఆర్‌ నిక్కర్లు తొడుక్కున్నప్పుడు నేను జూబ్లీహిల్స్‌ సొసైటీకి కన్వీనర్‌ను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కేటీఆర్‌ నిక్కర్‌ వేసుకుని స్కూలుకు వెళ్లేవాడు. మరి, కేటీఆర్‌ నన్ను ‘వాడు వీడు, దొంగ లుచ్చా’ అని అనొచ్చా? కేటీఆర్‌కు, నాకు వయసులో ఎంత గ్యాప్‌ ఉందో, నాకూ కేసీఆర్‌కు అంతే గ్యాప్‌ ఉంది. నన్ను కేటీఆర్‌ అంటే, నేను వాళ్ల నాయనను అంటాను. వాళ్ల నాయన ముఖ్యమంత్రి కాబట్టి, ఆయనిచ్చిన అధికారం వచ్చి ఉండొచ్చు. ఏ రకంగా నాకు, కేటీఆర్‌కు పోలిక?

ఆర్కే: అసలు తెలంగాణలో ఇది ఎందుకొస్తోంది!?

రేవంత్‌: వాళ్లకు అహంకారం, బలుపు. లెక్కలేనితనం. జైపాల్‌రెడ్డి, జానారెడ్డి విషయంలోనూ కేటీఆర్‌ ఎలా మాట్లాడారో మీకు తెలుసు. కేసీఆర్‌ తన కొడుకును పిలిచి చెప్పుకోవాలి కదా? అధికారంలో ఉన్నాం, ఒద్దికగా ఉండాలి, బాధ్యతగా ఉండాలని! వాళ్లు నలుగురు వస్తున్నారు. నేనే ఒక్కణ్ని పోతున్నా. వాళ్లు కుటుంబమంతా మూకుమ్మడిగా దాడి చేయాలని చూస్తున్నారు. (ఆర్‌కే: మీరు ఒంటి చేత్తో తిప్పికొడుతున్నారు). నేను బాధితుణ్ని. జైలుకు వెళ్లినవాడిని. 200 కేసులున్నాయి. 2014 నుంచి 2018 వరకు నాపై 119 కేసులున్నట్లు కోర్టుకిచ్చిన అఫిడవిట్‌లో చెప్పారు. 2018 నుంచి 2023 వరకు ఎన్నికల అఫిడవిట్‌లో 89 కేసులను చూపాల్సి వచ్చింది. ఇప్పుడు నాపై తాజాగా 89 కేసులున్నాయి. డ్రోన్‌ కేసులో నన్ను 18 రోజులపాటు డిటెన్షన్‌ సెల్‌లో పెట్టారు. నేను అంతర్జాతీయ తీవ్రవాదినా? నేరగాణ్నా?

ఆర్కే: కేసులు ఎన్ని ఎక్కువగా ఉంటే.. ముఖ్యమంత్రి పదవికి అంత అర్హత ఉంటుందట కదా?

రేవంత్‌: నేను వాటిని మెడల్స్‌లా ఫీల్‌ అవుతా.

ఆర్కే: రేప్పొద్దున కాలం కలిసొచ్చి, అధికారం వస్తే.. కేసీఆర్‌ మీద ప్రతీకారం తీర్చుకుంటావా?

రేవంత్‌:లేదు సర్‌. చాలామంది నా విధానాన్ని చూసి అలా అనుకుంటున్నారు. మన వ్యక్తిగత కోపాన్ని, కక్షను సాధించుకోవడానికి ప్రజలు మనకు అధికారం ఇవ్వడం లేదు. ఒక వ్యక్తి అలా చేశాడని, నేను చేయను.

ఆర్కే: రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా... కేసీఆర్‌ కుటుంబంపై ఏ విచారణ జరగదా?

రేవంత్‌: ఏ విచారణ జరగదన్నది తప్పు. వ్యక్తిగత కక్ష, అక్రమ అరెస్టులు వేరు. చట్టబద్ధంగా అరెస్టు చేయడం వేరు. అవినీతి, పరిపాలన, విధానపరమైన నిర్ణయాలను సమీక్షించేటప్పుడు చట్టమనేది దాని పరిధిలో అది పని చేస్తుంది. విచారణ అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాంగ్రె్‌సలో కలెక్టివ్‌ డెసిషన్‌ ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీపరంగా కొన్ని నిర్ణయాలుంటాయి. ప్రభుత్వం అమలు చేస్తుంది. రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తారన్నది ఉండదు.

కేసీఆర్‌ను ప్రజా కోర్టులో శిక్షించడానికే..

ఆర్కే: కామారెడ్డిలో పోటీ ఎందుకు? వ్యూహం ఏమిటి? అక్కడ పోటీ చేయాలనేది వ్యక్తిగత నిర్ణయం కాదు కదా..?

రేవంత్‌: అది పార్టీ వ్యూహం, నిర్ణయం. కేసీఆర్‌ నిర్ణయాలు, పాలనలో లోపాల్ని ఎత్తి చూపడం; వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లి దోషిగా నిలబెట్టడం, కేసీఆర్‌నే స్వయంగా ఓడించడం ద్వారా ప్రజా కోర్టులో శిక్ష విధించాలనేది పార్టీ ఆలోచన. ఆయన అవినీతి, అహంకారం భరించలేని స్థాయికి వెళ్లిపోయింది. తెలంగాణ సమాజం వీటిని భరించదు. అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ఎప్పుడూ భరించలేదు. ఆకలితోనైనా చచ్చారుకానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. సంక్షేమం అంటే ఎన్టీఆర్‌, రాజశేఖర రెడ్డి గురించే మాట్లాడాలి. కానీ, కేసీఆర్‌ నేను రైతు బంధు, కల్యాణ లక్ష్మి, దళిత బంధు ఇచ్చానని అనుకుంటున్నాడు. ఇవన్నీ ఇచ్చి మా నుంచి స్వేచ్ఛను గుంజుకున్నావు. ఆత్మగౌరవం గుంజుకున్నావు. మమ్మల్ని బానిసలుగా చూస్తున్నావు. ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికే కామారెడ్డిలో పోటీ! అడ్వెంచర్స్‌ ఉన్నప్పుడే నేను సక్సెస్‌ అయ్యా. కంఫర్ట్‌ ఉన్నప్పుడు సక్సెస్‌ కాలేదు.

ఆర్కే: సో.. గుర్రం ఎగరావచ్చు అంటావ్‌ కామారెడ్డిలో!

రేవంత్‌: ఆరు నూరు కావచ్చు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా. ఆరు నూరు కావచ్చు కామారెడ్డిల. దానికంటే నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. మాట ఒక్కటే కాదు. ప్రజలు కన్విక్షన్‌ను ఎక్కువ నమ్ముతారు. తెలివి కలవాడి కంటే నిజాయితీపరుడు ఎక్కువసార్లు గెలుస్తాడు. నిజాయితీ అంటే ప్రజలతో మమేకమయ్యేవాడు. కేసీఆర్‌ను కొడితే నేనే కొట్టాలనే ఆలోచన నాకూ ఉంది. పార్టీకీ ఉంది. అసలు కేసీఆర్‌ను ఎట్లైనా కొట్టాల్సిందే అనే ఆలోచన ఉంది. పీసీసీ అధ్యక్షుడు అంటే పార్టీలో నంబర్‌ వన్‌ పోస్ట్‌. ఒక స్టేజీ వచ్చిన తర్వాత రాజు కూడా యుద్ధానికి దిగాల్సిందే కదా!

ఆర్కే: ప్రభుత్వంపై వ్యతిరేక భావం ఉందనే ప్రచారం ప్రజల్లో జరుగుతోంది. దానికి ప్రాతిపదిక ఏంటి? ఇదే విషయాన్ని కేటీఆర్‌ కూడా అడిగారు ఇదే షోలో.

రేవంత్‌: ఇది ఆఖరి పోరాటం. కాంగ్రెస్‌ శ్రేణుల్లో కూడా మనోస్థైర్యాన్ని నింపి సీరియ్‌సగా యుద్ధం చేస్తున్నాం. దీనిని డూ ఆర్‌ డై కింద చేయాల్సిందే. బై హుక్‌ ఆర్‌ కుక్‌ మనం గెలవాల్సిందే. నన్ను కామారెడ్డిలో పోటీ చేయించడం ద్వారా క్యాడర్‌లో మోరల్‌ కరేజ్‌ పెంచాలనేది పార్టీ ఆలోచన. నాగ్గూడా మళ్లీ మళ్లీ ఇట్లాంటి అవకాశం రాదు. రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్‌ మీదనే పోటీ చేయడం అనేది నాకు మొదటిసారి టికెట్‌ వచ్చినప్పుడు ఉన్న ఉత్సాహం కంటే ఎక్కువ కిక్‌ ఇస్తోంది. అది కూడా నేనే సంతకం పెట్టిన కామారెడ్డి బీఫాం తీసుకున్నా కదా! అప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యా.

ఆర్కే: అసలు ఊహించావా కాంగ్రె్‌సలో చేరినప్పుడు ఈ స్థాయికి వస్తానని?

రేవంత్‌: లేదు. ఏరోజూ ఊహించలేదు. కానీ, కష్టపడితే ఫలితం ఉంటుందని ఎక్కువగా నమ్ముతా. చాలా కన్వెక్షన్‌తో, కాన్సట్రేషన్‌తోని పనిచేస్తా. క్యాజువల్‌ యాటిట్యూడ్‌ ఉండనే ఉండదు.

డిసెంబరు 9 సెంటిమెంట్‌

ఆర్కే: డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారమని ప్రకటించారు. ముఖ్యమంత్రి నేను అని చెప్పడం తప్ప అన్ని రకాల ఆహ్వాన పత్రికలు తయారు చేశారు. ఎన్టీఆర్‌ సెంటిమెంటా?

రేవంత్‌: ఎన్టీఆర్‌ సెంటిమెంటు, రాజశేఖర రెడ్డి సెంటిమెంటు. 2004లో ఉచిత విద్యుత్తు, బకాయిల మాఫీ మీద వైఎస్‌ మొదటి సంతకం పెట్టింది అక్కడే. ఆరు గ్యారంటీలపై కూడా అక్కడే సంతకం చేయాలని అనుకున్నాం. గత ఏడాది సెప్టెంబర్‌ 17నే డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారమని చెప్పాను. కాలం కూడా నేను అనుకున్నట్లుగా కలిసి వస్తోంది. 2009 డిసెంబర్‌ 9న చిదంబరం నుంచి మొట్టమొదటి తెలంగాణ ప్రకటన వచ్చింది. సోనియా గాంధీ జన్మదినం కూడా డిసెంబరు 9నే. నేను అక్టోబర్‌ 31న కాంగ్రె్‌సలో చేరి, డిసెంబరు 9న గాంధీ భవన్‌లో అడుగు పెట్టాను. ఇందులో సెంటిమెంట్‌ వాల్యూ ఉంది. అందుకే డిసెంబరు 9 నాకు పర్సనల్‌గా ఒక కమిట్‌మెంట్‌.

కేసీఆర్‌ పాజిటివ్‌ ఓటు అడగడం లేదేం!?

ఆర్కే: ఇప్పుడు మీకు రెండు ప్రధానమైన ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మీకు బూస్ట్‌గా పని చేశాయి. ఇప్పుడు అదే కర్ణాటక ప్రభుత్వ పనితీరు ప్రతిబంధకంగా మారబోతోందనేది ఒకటి. అక్కడ కరెంట్‌ సమస్య ఒకటి. ఆరు గ్యారెంటీల్లో కొన్నిటిని పూర్తిగా అమలు చేయలేకపోతున్నారని. అందుకే, బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ కావాలా? కరెంట్‌ కావాలా అంటున్నారు.

రేవంత్‌: కరెంటును ఎజెండాగా మార్చాలని వాళ్లు తెలివి తేటలు ప్రదర్శించారు. అసలు కర్ణాటకలో ఐదు గ్యారెంటీల్లో కరెంట్‌ లేనే లేదు. అక్కడ గ్యారంటీల అమలును పరిశీలించడానికి మంత్రులు, అధికారులకు ఏర్పాట్లు చేస్తానని, పూర్తి వివరాలు ఇస్తానని కామారెడ్డిలో సాక్షాత్తూ సిద్దరామయ్య చెప్పారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు పోతలేదు. హామీ ఇచ్చిన ప్రకారం కర్ణాటకలో గ్యారంటీలను అమలు చేస్తున్నారు. కరెంట్‌ మీద అసలు చర్చనే అనవసరం. ఎందుకంటే.. అసలు ఉచిత కరెంట్‌ మొదలు పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. అసలు పదేండ్ల తర్వాత కేసీఆర్‌ తన పరిపాలనను చెప్పి పాజిటివ్‌ ఓటు అడగకుండా రేవంత్‌ రెడ్డి మూడన్నడా.. రెండన్నడా.. అనడంలో ఏమన్నా అర్థం ఉందా!?

ఆర్కే: కేసీఆర్‌ మిమ్మల్నందర్నీ డిఫెన్స్‌లోకి తోస్తున్నడు కదా.. మేం 24 గంటలు ఇస్తామని నీవు చెప్పావా ఇప్పటిదాకా.. కర్ణాటకలో అనలేదని చెప్పడమూ ఎక్స్‌ప్లనేషనే.

రేవంత్‌: అవును. మేం సబ్‌ స్టేషన్లకు పోయి చూపించినం. ఈరోజు కూడా నేను అదే చెబుతున్నా. కేసీఆర్‌ వైఫల్యాలను, అవినీతిని, అహంకారాన్ని, కుటుంబ పాలనను కప్పి పుచ్చుకోవడానికి దీనిని తెరపైకి తెచ్చాడు. 24 గంటలు అన్నాడు కానీ 8 గంటలు కూడా ఇవ్వట్లేదు.

సీఎం పదవిపై నాకు చెప్పినా.. మీకు చెబుతానా!?

ఆర్కే: మనలో మాట.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తే నువ్వే ముఖ్యమంత్రివి అని హైకమాండ్‌ ఏమైనా చెప్పిందా? 2004 ఎన్నికల తర్వాత రాజశేఖర్‌ రెడ్డి వెళ్లి తన పరిస్థితి ఏమిటని సోనియాగాంధీని అడిగారు. ప్రభుత్వం వస్తే మీరే సీఎం అని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆయన నిమ్మళంగా కూర్చున్నారు. ప్రభుత్వం రాకపోతే తన పరిస్థితి డిఫరెంట్‌గా ఉండేదని ఆయనే చెప్పుకొన్నారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ నాతో స్వయంగా చెప్పారు. అలాంటి కమిట్‌మెంట్‌ రేవంత్‌ రెడ్డికి కూడా వచ్చిందనేది నా ఇన్ఫర్మేషన్‌..

రేవంత్‌: పార్టీ ఎప్పుడూ అలా చెప్పనే చెప్పదు. నేను హైకమాండ్‌ను కూడా అడగలేదు. ఒకవేళ నాకు వచ్చినా.. మీకు చెబుతానా సర్‌!? మీకు సమాచారం ఉండొచ్చు. నేను చెప్పడం బాధ్యత కాదు.

ఆర్కే: కాంగ్రె్‌సలో మాట్లాడితే సీనియర్లమని అంటారు. సరుకు ఉండాలి కదా? 40 ఏళ్ల నుంచి కాంగ్రె్‌సలో ఉన్నానని అంటే ఎలా!? కార్యకర్తలు కూడా 40-50 ఏళ్ల నుంచి పార్టీలో ఉంటారు కదా? వాళ్లను ముఖ్యమంత్రిని చేయరు కదా?

రేవంత్‌: కాంగ్రె్‌సకు అదే బలం, బలహీనత. ఇప్పుడు కాంగ్రె్‌సది న్యూ వెర్షన్‌. ఇది 2.0 వెర్షన్‌. ఇప్పుడు మేము ఇచ్చిన టికెట్లు చూశారు కదా. కుటుంబానికి రెండు టికెట్లు లేవంటూ పార్టీ నిర్ధిష్టమైన అభిప్రాయంతో ఉండేది. మైనంపల్లి హన్మంతరావును పార్టీలోకి తీసుకోగానే.. తండ్రీ కొడుకులిద్దరికీ టికెట్లు ఇచ్చాం. ఉత్తమ్‌ ఇంట్లో ఇచ్చాం. వివేక్‌, వినోద్‌.. అన్నదమ్ములిద్దరికీ ఇచ్చాం. ఈ రోజు గెలిచే గుర్రాలు కావాలి.

కేసీఆర్‌ హుందాగా తప్పుకోవాలి

ఆర్కే: మీరు వేయలేదా కేసీఆర్‌పై రాళ్లు?

రేవంత్‌: మేం కేసీఆర్‌ తప్పులనే విమర్శించాం. ఇది యుద్ద తంత్రం. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడమే. అందులో అనైతికం, అధర్మం ఉండకూడదు. ఆయన నాకు, కేటీఆర్‌కు, హరీ్‌షరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కిషన్‌రెడ్డి వీరందరి కంటే ఎబౌవ్‌ ఆల్‌. మేమంతా ఆయన తర్వాతి తరం. ఆ తర్వాతి తరంతో మాట్లాడేప్పుడు ఆయన హుందాతనం, గౌరవం కాపాడుకోవాలి. ఆయనే పోటీపడితే ఎలా? మీ షో ఆయన కూడా చూస్తాడు. అందుకే ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్‌.. బరిలోనుంచి తప్పుకోండి. ఇప్పటికైనా తెలంగాణకు ఓ పెద్దమనిషిలా ఉండదలచుకున్నా. పోటీ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటున్నా. మా కుటుంబం నుంచి కొడుకు, కూతురు, అల్లుడు బరిలో ఉంటారు.. అని చెప్పి తప్పుకుంటే ఆయనకు గౌరవం అయినా మిగులుద్ది.

ఆర్కే: లేకుంటే ఓడిస్తారంటారు..?

రేవంత్‌: వంద శాతం.. ప్రజలు ఓడిస్తరు. ఎందుకంటే నాకున్న వయస్సు, రాజకీయ అనుభవాన్ని కేసీఆర్‌తో పోల్చినప్పుడు ఆయన ఓడిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది.? ఇక రాష్ట్రాన్ని తర్వాతి తరం ముందుకు తీసుకెళ్లాలి. రేపు అధికారంలో ఎవరున్నా పెద్దమనిషిలా సలహా ఇస్తా అనాలి. రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, కేటీఆర్‌, హరీష్‌ రావు, కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌.. ఇలా ఎవరొచ్చినా సలహాలు ఇస్తా. అవసరం ఉంటే, అవకాశం వస్తే కేంద్ర రాజకీయాల్లో ఉంటా.. అని తప్పుకోవాలి. తప్పుడు అఫిడవిట్లు చూపిస్తూ అబద్దాలు చెప్పవద్దని అంటున్నా. ఇలాంటి తప్పిదాలతో కేటీఆర్‌ అఫిడవిట్‌ కూడా రెండ్రోజుల్లో చూపిస్తా.

ఆర్కే: రాష్ట్రంలో గెలుస్తామన్న నమ్మకం మీ హైకమాండ్‌లోని ముఖ్య నాయకులకు వచ్చిందా?

రేవంత్‌:వచ్చింది కాబట్టే అగ్రనేతలంతా ఇక్కడ దృష్టిపెట్టారు. తెలంగాణపై ఫోక్‌స్డగా ఉన్నారు. ఈసారి ఇక్కడ కాంగ్రెస్‌ రాకుంటే ఇక్కడి ప్రజలను దేవుడు కూడా కాపాడలేనంత పరిస్థితులుంటాయి

ఆర్కే: ప్రజలకా.. కాంగ్రెస్‌ నాయకులకా!

రేవంత్‌: కాంగ్రెస్‌ నాయకులదేముంది? సగం మంది పీసీసీ నేతలు బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లి రాజ్యసభ సభ్యులయ్యారు. కేకే, డీఎస్‌ అయ్యారు. నాయకులకు ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రజలకు లేదు.

ఆర్కే: అసలు కేసీఆర్‌ నుంచి ఏమంత ఇబ్బంది ఉంది. అహంకారపూరిత వ్యవహారం తప్ప ఇక పెద్దదేముంది. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే అన్ని కష్టాలున్నాయా?

రేవంత్‌: పొరుగు రాష్ట్రానికి ఆదర్శ పురుషుడే ఈయన కదా! సలహాలిచ్చి, సూచనలిచ్చి పాడు చేశారని వాళ్లే చెప్పుకుంటున్నారు కదా! రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చా అని చెప్పుకుంటున్నారు. కేసీఆర్‌కు చాలా కక్షపూరిత ఆలోచన ఉంది. ఒకటి తెలుగుదేశం, రెండు చంద్రబాబు మీద. మూడోది ఎవరూ తనకు ఎదురుండొద్దు. రాచరిక పోకడ.

కేసీఆర్‌, కేటీఆర్‌ అఫిడవిట్లలో తప్పుడు లెక్కలు

ఆర్కే: ధరణిని రద్దు చేస్తామని మీరు చెప్పారు. అదే విషయాన్ని కేసీఆర్‌ కూడా ప్రచారం చేస్తున్నారు..

రేవంత్‌: ధరణిని రద్దు చేస్తామని చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఇంతకంటే మెరుగైన దానిని తీసుకొచ్చి అమలు చేస్తాం. గతంలో కాంగ్రెస్‌ పార్టీయే భూ భారతిని తీసుకొచ్చింది. రికార్డులు డిజిటలైజ్‌ చేయాలనేది మా ఆలోచన! కానీ, కేసీఆర్‌ ఆ రికార్డులను మాయం చేసి, విధ్వంసం చేసి లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్‌మెంట్‌ భూములు, పోడు పట్టాలన్నింటినీ గందరగోళం చేశారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల భూములకు కొత్త యజమానులు పుట్టుకొచ్చారు. పాస్‌ పుస్తకాలు జారీచేశారు. కేసీఆర్‌ ఈ ధరణి పథకంతో రూ.లక్షల కోట్లు సంపాదించారు. 10 వేల ఎకరాల భూమి గోల్‌మాల్‌ అయితే.. ఎకరం పది కోట్లు అనుకున్నా లక్ష కోట్లు అవుతుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు భూమి 6,500 ఎకరాలు ఉంటుంది.

దీనిని రూ.7 వేల కోట్లకు అమ్మిండు. ఇప్పుడు అక్కడ ఉన్న భూమికి విలువ చాలాపెరిగింది. ఇప్పుడు రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వస్తోంది. 2004-14 వరకు ఒక మాస్టర్‌ ప్లాన్‌తో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధే ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ పెరగడానికి కారణమైంది. ఔటర్‌ లోపల ఉండే నగరానికి ఒక ప్రణాళిక. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఉండే సబర్బన్‌ ప్రాంతానికి ఇంకో ప్రణాళిక నాకుంది. అక్కడి నుంచి గ్రామీణ తెలంగాణ వరకు ఇంకో ప్రణాళిక ఉంది. 2050 వరకు మాస్లర్‌ ప్లాన్‌ తయారుచేసి...అన్ని ప్రాంతాలకు సమ అభివృద్ధి జరిగేలా చేస్తాం. అసలు శామీర్‌పేటలో ఎకరా 5 కోట్లుంది. కోకాపేటలో 100 కోట్లు ఉంది. ఇక్కడుండే ఐటీ కంపెనీలన్నింటినీ అక్కడికి తరలిస్తే.. రింగ్‌ రోడ్డుపై నుంచి ఎయిర్‌ పోర్టుకు సమ దూరమే అవుతుంది. ప్రభుత్వం ఈ విధానం అమలు చేయాలి.

ఆర్కే: కేసీఆర్‌ భూముల అమ్మకాలపై విచారణ జరిపించవచ్చు కదా?

రేవంత్‌: 100 శాతం. రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి మూడు కలెక్టరేట్ల పరిధిలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని లావాదేవీలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తాం. పాత, కొత్త రికార్డులు చూసి ఎవరి నుంచి ఎవరికి భూమి బదిలీ అయిందో విచారణ జరిపిస్తాం. కేసీఆర్‌ ఎన్నికల అఫిడవిట్‌ తీయండి. ఎంత ప్రభుత్వ భూమి ఉంది. ఎన్ని ఎకరాలు చూపించిండు? టోటల్‌ ఎంత వేసిండో చూడండి. భూమి మొత్తం కలిపితే 76 ఎకరాలు అయింది. సీలింగ్‌ నిబంధనలకు లోబడి ఉండాలనే కారణంతో... 53 ఎకరాల 20 గుంటలు అని టోటల్‌ వేశారు. కేసీఆర్‌ అఫిడవిట్‌లో కేటీఆర్‌, కొడుకు హిమాన్షు పేరుమీద ఉన్న ఆస్తులను చూపించలేదు. సీలింగ్‌ యాక్టులో వెట్‌ ల్యాండ్‌ అయితే 24 ఎకరాలు... డ్రై లాండ్‌ అయితే 54 ఎకరాలే ఉండాలనే నిబంధన ఉంది. ముఖ్యమంత్రికి దానిని అమలు చేయడం లేదు. ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ విలువ గజాల్లోకి మారుతుంది. చట్టంలో లొసుగులను కేసీఆర్‌ తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. ధరణితో వెంకటాపూర్‌లో ఉన్న ప్రభుత్వ భూములను కూడా కింద మీద చేసి మొత్తం ఆక్రమించుకున్నారు. ముఖ్యమంత్రే ధరణి పేరుతో దందా చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్నడు. ధరణిని అడ్డం పెట్టుకొని శంషాబాద్‌లో ఆయనకు అత్యంత సన్నిహితుడైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి... నాగారంలో 22(ఏ) కింద నిషేదిత జాబితాలో ఉన్న 750 ఎకరాలను బదిలీ చేసుకున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల భూముల ధరణి వివరాలు ఎవరూ చూడకుండా పెట్టేశారు.

ఆర్కే: గ్రామీణ ప్రాంతాల్లో మీకు అనుకూల వాతావరణం ఉన్నదనేది మీకు ప్రగాఢమైన నమ్మకం. కానీ, మీరు అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో ఇదే అభివృద్ధి కొనసాగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రేవంత్‌: మీ ఆలోచన తప్పు. కర్ణాటకలో సిద్దరామయ్య, రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీ్‌సగఢ్‌లో భగేల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. పెట్టుబడిదారులు, వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఏమైనా సమస్య వచ్చిందా? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు మఖ్యమంత్రులు మారారు. కానీ కేసీఆర్‌ కుటుంబంలో నలుగురు ఉన్నారు. తండ్రి, కొడుకు, కూతురుతోపాటు సంతోష్‌ రావుకు కప్పం కట్టాల్సిందే! కాంగ్రె్‌సలో అలాంటి సమస్యలు ఉండవు.

బాబు అరెస్టుపై వ్యక్తిగతంగా బాధ పడుతున్నా

ఆర్కే: చంద్రబాబు జైలుకెళ్లడం ద్వారా మీకు మేలు చేశాడా..?

రేవంత్‌: ఆయనతో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఆయన జైలుకెళ్లడం రైటా రాంగా అని నేను చెప్పను. ఇన్నేళ్లు అనుబంధం ఉన్న వ్యక్తి జైలుకెళ్లడం పర్సనల్‌గా బాధించింది. దీనిని నేను లాభం కోణంలో చూడలేదు. కానీ, అక్కడ టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన ఇక్కడ బీజేపీతో బరిలోకి దిగడంతో ఒక ప్రమాదం ఉంది. ఇక్కడ జనసేనకు ఓట్లు రాకపోతే ఆ ప్రభావం అక్కడ పడుతుంది. కేసీఆర్‌ ఓటమికి చంద్రబాబు అరెస్టు కారణం అవుతుందో లేదో తెలియదు గానీ.. కేటీఆర్‌ బలుపు మాటలు మాట్లాడిండు. వాళ్లు పన్నులు కట్టట్లేదా. అసలు సెటిలర్స్‌ అనే పదం ఏంది.. ఒక్క ఏపీ వాళ్లనే ఎందుకు అంటున్నరు. రాజస్థాన్‌, గుజరాత్‌ వాళ్లు లేరా. వాళ్లను అననిది వీళ్లనే ఎందుకు సెటిలర్స్‌ అంటరు. ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడ మమేకమై పన్నులు కడుతుంటే సెటిలర్స్‌ ఎందుకంటరు.? ఇక్కడ ధర్నా చేయడం తప్పెలా అవుతుంది. కేసీఆర్‌ వైజాగ్‌లో పోయి ర్యాలీ తీసిందు. కేసీఆర్‌ మొన్న యాగం చేస్తే అయ్యగారు విశాఖ నుంచి వచ్చారు. ప్రగతి భవన్‌ ఓపెనింగ్‌కి అయ్యగారు ఈస్ట్‌గోదావరి నుంచి వచ్చారు. యాదగిరి గుట్ట ఆర్కిటెక్ట్‌ ఎక్కడి నుంచి వచ్చాడు.?

ఆర్కే: అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ పగలగొడతారా..?

రేవంత్‌: ఛీ..ఛీ.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వేస్ట్‌ చేయద్దు. వ్యక్తిగతం కంటే కూడా పర్ప్‌సఫుల్‌గా వాడాలి. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా వాడుతాం. దాన్ని కంప్లీట్‌గా మార్చేస్తాం. దీనిపై వ్యక్తిగతంగా నాకు ఒక విజన్‌ ఉంది. 52 శాతంగా ఉన్న యువతను నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచంతో పోటీపడేలా చేస్తాం. ప్రభుత్వం నుంచి యువతకు అవకాశాలు కల్పిస్తాం. అలాగే నర్సులకు భారీ డిమాండ్‌ ఉంది. ఇక్కడి నుంచి ఫిలిప్పిన్స్‌ పంపిస్తున్నం. ఇక్కడ కేరళ వాళ్లు వస్తున్నరు. ప్రతి నియోజకవర్గంలో నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పిస్తాం.

ఆర్కే: మొత్తానికి చాలా ఆలోచనలే ఉన్నయ్‌. ఫిక్సయిపోయావ్‌..

రేవంత్‌: నేను వంద శాతం ఫిక్సయిపోయినా. ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది. ప్రభుత్వంలోకి వస్తాం. పదేళ్లు అధికారంలో ఉంటాం. డిసెంబరు-9న ఉదయం పదిన్నర గంటలకు ప్రమాణ స్వీకారానికి మీరు రావాలి. సాయంత్రం ఒక అరగంట ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ చేయాలి.

ఆర్కే: ప్రమాణ స్వీకారం అయినాక చేస్తా.

రేవంత్‌: తప్పకుండా రావాలి. మేము ప్రమాణ స్వీకారం చేశాక.. తెలంగాణ విజన్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనలు, మా విజన్‌ డాక్యుమెంట్‌ ప్రజలకు వివరించాలని నాకుంది. ఇప్పుడు చెబితే ఏదో అతిశయోక్తి అంటారు. అప్పుడు సమగ్రంగా వివరిస్తా. నాకు పదేళ్లు కావాలి. అద్భుతాలు సృష్టిస్తా. ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా.

Updated Date - 2023-11-17T11:45:11+05:30 IST