Bandi Sanjay : రూ.వందల కోట్ల ప్రజాధనంతో సొంత డప్పు కొట్టుకుంటారా?

ABN , First Publish Date - 2023-05-18T04:13:50+05:30 IST

తెలంగాణలో సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. రూ.వందల కోట్ల ప్రజాధనంతో కేసీఆర్‌ సొంత డప్పు కొట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. రూ.వందల కోట్ల ప్రకటనలు ఇస్తున్నారని

Bandi Sanjay : రూ.వందల కోట్ల ప్రజాధనంతో సొంత డప్పు కొట్టుకుంటారా?
క్రికెట్‌ ఆడుతున్న బండి సంజయ్‌

బీజేపీ వార్తలు రాయొద్దని ప్యాకేజీలు ఇస్తారా?

5 నెలల్లో ఈ సర్కారును ప్రజలే నిషేధిస్తారు

ముఖ్యమంత్రికి దమ్ముంటే.. శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి: బండి సంజయ్‌

హైదరాబాద్‌ సిటీ, మే 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. రూ.వందల కోట్ల ప్రజాధనంతో కేసీఆర్‌ సొంత డప్పు కొట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. రూ.వందల కోట్ల ప్రకటనలు ఇస్తున్నారని ప్రభుత్వానికి మీడియా బాకా ఊదితే సామాన్య ప్రజలను ఏమైపోతారని ప్రశ్నించారు. బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇచ్చే దుస్థితికి కేసీఆర్‌ చేరుకున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దళితబంధు పేరుతో కమీషన్లు వసూలు చేస్తున్నారని కేసీఆరే చెప్పారు.. మళ్లీ దళితబంధు గొప్పదని పత్రికల నిండా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో ‘‘ఖేలో భారత్‌.. జీతో భాగ్యనగర్‌’’ పేరిట నిర్వహించిన క్రీడా పోటీలను తిలకించడానికి వచ్చిన సంజయ్‌.. మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ సర్కారుపై ధ్వజమెత్తారు.

‘తాగుడు ఊగుడు’ పథకంతో..

ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించే మీడియాను కేసీఆర్‌ ప్రభుత్వం నిషేధిస్తోందని సంజయ్‌ అన్నారు. మరో 5 నెలలు ఆగితే... తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ సర్కారును నిషేధించబోతున్నారని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. తన పాలనలో చేసిన అభివృద్ధిపై శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఖేలో ఇండియా పేరుతో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ‘‘ఖేలో ఇండియా.. జీతో భాగ్యనగర్‌’’ నినాదంతో బీజేపీ పనిచేస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం ‘‘తాగుడు.. ఊగుడు’’ పథకంతో ‘‘పీలో తెలంగాణ.. పిలావో తెలంగాణ‘‘ నినాదంతో గల్లీగల్లీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. బంపర్‌ ఆఫర్‌ పేరుతో మందు రేట్లు తగ్గించి తాగుడును మరింత ప్రోత్సహిస్తున్నారన్నారు. మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి వస్తే స్విగ్గీ, జొమాటో మాదిరిగా ఇంటింటికీ మద్యాన్ని పంపిణీ చేస్తారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లు కట్టిస్తాం.. ఉచితంగా వైద్యం అందిస్తాం.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తాం.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తామని హామీలు గుప్పించారు. ‘‘అవసరం లేకపోయినా ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కేసీఆర్‌ కొత్తది కట్టుకున్నడు. ప్రగతిభవన్‌ కట్టుకున్నడు. హైకోర్టు తిడితే ఏపీకి పారిపోయినోడిని పట్టుకొచ్చి సల హాదారు కొలువిచ్చిండు’’ అని దుయ్యబట్టారు. యువత బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కర్ణాటక ఫలితాలు తెలంగాణకు సంబంధంలేదు

కర్ణాటక ఎన్నికల ఫలితాలకు తెలంగాణకు ఏం సంబంధమని సంజయ్‌ ప్రశ్నించారు. ‘‘ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడి ప్రజలు తీర్పు ఇస్తారు.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌, మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఈటల రాజేందర్‌ మా జాతీయ నాయకత్వాన్ని కలిస్తే తప్పేముుంది? కేసీఆర్‌.. సొంత పార్టీ నాయకులను కూడా కలవరు. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని హైకమాండ్‌కు అప్పీల్‌ చేశాం’’ అని అన్నారు.

Updated Date - 2023-05-18T04:13:50+05:30 IST