Bhatti Vikramarka: కాంగ్రెస్‌ విజయానికి పాదయాత్ర తోడ్పడాలి

ABN , First Publish Date - 2023-03-13T03:40:52+05:30 IST

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిర్వహిస్తున్న పాదయాత్రలను విజయవంతం చేయాలని హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమం నియోజకవర్గ సమన్వయకర్తలకు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సూచించారు.

Bhatti Vikramarka: కాంగ్రెస్‌ విజయానికి పాదయాత్ర తోడ్పడాలి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిర్వహిస్తున్న పాదయాత్రలను విజయవంతం చేయాలని హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమం నియోజకవర్గ సమన్వయకర్తలకు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సూచించారు. ఈ పాదయాత్రలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు భట్టివిక్రమార్క నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయడానికి గాంధీ భవన్‌లో ఆదివారం సమన్వయకర్తల సమావేశం జరిగింది. భట్టితో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు నదీమ్‌ జావెద్‌, రోహిత్‌ చౌదరి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు 3 నెలల పాటు తాను తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయడంలో పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలని భట్టి కోరారు. నదీమ్‌ జావెద్‌ మాట్లాడుతూ భట్టివిక్రమార్క పాదయాత్ర వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్‌ యాత్ర అని తెలిపారు. కాగా, అదానీ షేర్ల కుంభకోణాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపుమేరకు సోమవారం తలపెట్టిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని ఈనెల 15కు వాయిదా వేసినట్లు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. కాగా, పూర్వ యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో జరిగింది. భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, కోదండరెడ్డి, నదీమ్‌ జావెద్‌, రోహిత్‌ చౌదరి తదితరులు పాల్గొని సందడి చేశారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ తోడుదొంగలు: పొన్నాల

బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ తోడుదొంగల పార్టీలని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. లిక్కర్‌ స్కాంలో 26ు వాటా ఉన్న పిళ్లైను అరెస్టు చేసి.. 66ు వాటా ఉన్న ఎమ్మెల్సీ కవితను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. లిక్కర్‌ స్కామ్‌ను రెండు పార్టీలూ ప్రచారం కోసం వాడుకుంటున్నాయన్నారు.

Updated Date - 2023-03-13T03:40:52+05:30 IST