Bhatti Vikramarka: లిక్కర్‌స్కామ్‌తో రాష్ట్రానికి తలవంపులు
ABN , First Publish Date - 2023-03-20T01:42:28+05:30 IST
ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
బీఆర్‌ఎస్ పాలన మరిచిపోయింది
మేం గెలిచాక ‘ధరణి’ని మార్చేస్తాం
పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి
ఉట్నూర్, మార్చి 19: ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. లిక్కర్ స్కామ్‌తో తెలంగాణకు తలవంపులు తెచ్చిన ఘనత బీఆర్‌ఎస్ నాయకులదేనని.. కేజ్రీవాల్ నుంచి కవిత వరకు అందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలన మరచిపోయిందని, సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టిందని మండిపడ్డారు. హత్‌సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా ఆదివారం భట్టి పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎందా చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి పోర్టల్ కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్‌కు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు ఉద్యమాల ఫలితంగా గ్రామాల్లో భూములు అమ్ముకుని పారిపోయిన భూస్వాములు ధరణి ఏర్పాటుతో తిరిగొచ్చి ఆ భూములను అమ్ముకుంటున్నారని.. ఫలితంగా పేదలు నష్టపోతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను మార్చేస్తామని చెప్పారు.
పేపర్ల లీకేజీకి బాధ్యులైన టీఎ్‌సపీఎస్సీ చైర్మన్, సభ్యులు, సెక్రెటరీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎ్‌సపీఎస్సీ సభ్యులను నియమించిన వారు కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. రూ.42 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టి ట్యాంకులు నిర్మించి ప్రజలకు నీళ్లు ఇవ్వని ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని, మిషన్ భగీరథ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇటు ఉట్నూర్ ఎక్స్ రోడ్డులో పీపుల్స్‌మార్చ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద, బలహీన వర్గాల వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని అన్నారు.