మనస్తాపంతో ఇద్దరి బలవన్మరణం
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:12 AM
కడుపునొప్పి తట్టుకోలేక యువతి ఉరివేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.
మాడ్గులపల్లి, డిసెంబరు 29 : కడుపునొప్పి తట్టుకోలేక యువతి ఉరివేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చెర్వుపల్లి గ్రామానికి చెందిన కొండా వెంకన్న రెండో కుమార్తె కొండా రాజేశ్వరీ(18) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. గతేడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. అదే తరుణంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర కడుపునొప్పి రావడంతో తట్టుకోలేక ఉరివేసుకుంది. సాయంత్రం తల్లి ఇంటికి వచ్చే సరికి మృతి చెందింది. ఘటనపై తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
కుటుంబ సమస్యలతో...
కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి క్రిమిసంహారక మందు తాగి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో జరిగింది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామానికి చెందిన సాధినేని గోవిందరావు(32)కు గత ఏడాది మిర్యాలగూడలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీవిద్యతో వివాహమైంది. అప్పటి నుంచి గోవిందరావు అత్తగారింటి వద్ద ఉంటూ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. తరుచు భార్య, అత్తమామలు, బావమరిదితో గొడవలు జరుగుతుండేవి. గురువారం పెద్దదేవులపల్లి గ్రామశివారులోని పొలంలో పనిచేస్తుండగా భార్య శ్రీవిద్య, మామ యలమంద, అత్త లలిత, బావమరిది వీరకృష్ణలు గొడవపడి కర్రలతో దాడి చేసి దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురై అక్కడే ఉన్న క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు వెంటనే అతడిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోవిందరావు సోదరుడు సాధినేని సైదారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా గోవిందరావు భార్య, అత్త, మామ, బావమరిదిలు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు.