RS Praveen Kumar: ఉద్యోగులపై కేసీఆర్ నిరంకుశ వైఖరి
ABN , First Publish Date - 2023-05-11T03:42:31+05:30 IST
తెలంగాణ వస్తే సమ్మెలు ఉండవని ఒకప్పుడు వ్యాఖ్యానించిన కేసీఆర్, నేడు ఉద్యోగులపై నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
జేపీఎ్‌సలను సర్కారు ఉగ్రవాదుల్లా చూస్తోంది
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వస్తే సమ్మెలు ఉండవని ఒకప్పుడు వ్యాఖ్యానించిన కేసీఆర్, నేడు ఉద్యోగులపై నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. న్యాయంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయితీ కార్యదర్శుల (జేపీఎ్‌స)లను రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదుల్లా చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఈమేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘2018లో మూడేళ్ల తర్వాత క్రమబద్ధీకరిస్తామని నోటిఫికేషన్‌లో హామీ ఇవ్వడం వలనే 9600 మంది ఉద్యోగంలో చేరారు. న్యాయసమ్మతమైన తమ డిమాండ్ల సాధనకోసం వారు చేపట్టిన సమ్మెకు బీఎస్పీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తాయి. జేపీఎ్‌సలకు సర్పంచులు, ప్రజా సంఘాలు తోడుగా నిలవాలి’’ అని ప్రవీణ్ పిలుపునిచ్చారు. ఇక.. సమత హత్యాచారం కేసులో నేరస్థుల ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చడం బాధాకరమని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత కూడా నిందితులకు ఉరిశిక్ష పడిందని గుర్తుచేశారు.
సమత కేసులో ఆరేళ్ల తర్వాత విచారణలో ఇది అరుదైన కేసు కాదంటూ కోర్టు పేర్కొనడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ‘‘బాధితురాలు సామాన్య బేడ బుడగ జంగాల పేద కులానికి చెందడం వలనే ఇలా జరిగింది. ఎస్సీ కులానికి చెందిన మహిళలను ఇలా ఘోరంగా చంపినవారికి కచ్చితంగా ఉరిశిక్ష వేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం నిందితులవైపా లేక బాధితులవైపా చెప్పాలి. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలి’’ అని ప్రవీణ్ డిమాండ్ చేశారు. కాగా.. విజయ, మదర్ డెయిరీలను నాశనం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థను తీసుకొచ్చారని ప్రవీణ్ విమర్శించారు. ‘‘పాడిరైతుల పొట్ట కొట్టి, వారి ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెడుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు నటిస్తోంది కానీ అమిత్ షా ఆదేశాల మేరకే అమూల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. కవితను ఈడీ నుంచి కాపాడుకోవడానికి, తన సొంత ప్రయోజనాల కోసం కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు.