Telangana: తొలగిన అడ్డంకులు తెలంగాణలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2023-02-18T16:10:43+05:30 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు (Secunderabad Cantonment Board) ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలకు రక్షణశాఖ...

Telangana: తొలగిన అడ్డంకులు తెలంగాణలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు (Secunderabad Cantonment Board) ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలకు రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్మిత్తల్ (Rakesh Mittal) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహిస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌లో మొత్తం 8 వార్డులున్నాయి. సికింద్రాబాద్తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్స్‌లో పోలింగ్ నిర్వహిస్తారు. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పాలక మండలికి 2015లో ఎన్నికలు జరిగాయి. 8 వార్డులకు గాను ఎన్నికైన 8 మంది సభ్యులు తమలో ఒకరిని బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

2015 ఫిబ్రవరిలో పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మిలిటరీకి చెందిన ఆంధ్రా, తెలంగాణ (Andhra Telangana) సబ్‌ ఏరియా కమాండర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. అయితే, రక్షణ శాఖ ఎన్నికలు జరుపలేదు. అదే పాలక మండలిని ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మరో ఆరు నెలల పాటు పాలక మండలి పదవీకాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా 2021 ఫిబ్రవరి వరకు పాత పాలక మండలే కొనసాగింది.

Untitled-1.jpg

నిరీక్షణ

కంటోన్మెంట్‌కు ఎన్నికల జరుపకుండా రక్షణ శాఖ అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ దాదాపు 9 నెలల పాటు మౌనం వహించింది. 2021 నవంబర్‌ (November)లో ఇతర కంటోన్మెంట్లతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు కూడా సివిల్‌ నామినేటెడ్‌ సభ్యుడిని నియమించారు. 2022 ఫిబ్రవరిలో మరోసారి నామినేటెడ్‌ సభ్యుడి పదవీకాలాన్ని పొడిగించారు. కంటోన్మెంట్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. తిరిగి 2022 ఆగస్టులో మరోసారి నామినేటెడ్‌ సభ్యుడి పదవీ కాలాన్ని పొడిగించారు.

నూతన చట్టం అమలులోకి వస్తేగానీ పాలక మండలికి ఎన్నికలు నిర్వహించరని స్పష్టం కావడంతో కంటోన్మెంట్‌ రాజకీయ వర్గాలు పార్లమెంట్‌లో పెండింగులో ఉన్న బిల్లు కోసం నిరీక్షిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలకు సిద్ధమవుతోంది. కంటోన్మెంట్‌ చట్టం ప్రకారం ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలకు అతీతంగా, పార్టీల చిహ్నాలు లేకుండా బోర్డు పాలక మండలి ఎన్నికలు నిర్వహించారు. ఆయా రాజకీయ పార్టీల మద్ధతున్న నాయకులే బోర్డు ఎన్నికల్లో బరిలోకి నిలిచినప్పటికీ గుర్తింపు పొందిన ఎన్నికల చిహ్నాలు కేటాయించడం లేదు.

Updated Date - 2023-02-18T16:10:45+05:30 IST