CM KCR : నేనూ ముసలోణ్ని అవుతున్నా..!
ABN , First Publish Date - 2023-03-02T03:23:52+05:30 IST
‘‘స్పీకర్ పోచారం వయసైపోయిందని అంటున్నారు. కానీ, ఆయన బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం యువకుడిలా పనిచేస్తున్నారు. నేనూ ముసలోణ్ని అవుతున్నా.. 69 ఏళ్లు వచ్చినయ్. నేనున్నన్ని రోజులు పోచారం ఉండాల్సిందే. ఆయన బాన్సువాడ ప్రజలకు సేవ చేయాల్సిందే’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ ..

69 ఏళ్లు వచ్చినయ్.. నేనున్నన్ని
రోజులు పోచారం ఉండాల్సిందే
ఆయన యువకుడిలా పనిచేస్తున్నారు
నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు
కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ సభలో కేసీఆర్
టీటీడీ ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు
సతీసమేతంగా బ్రహ్మోత్సవాలకు హాజరు
సీఎం చేతుల మీదుగా శ్రీవారికి స్వర్ణ కిరీటం
కామారెడ్డి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ‘‘స్పీకర్ పోచారం వయసైపోయిందని అంటున్నారు. కానీ, ఆయన బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం యువకుడిలా పనిచేస్తున్నారు. నేనూ ముసలోణ్ని అవుతున్నా.. 69 ఏళ్లు వచ్చినయ్. నేనున్నన్ని రోజులు పోచారం ఉండాల్సిందే. ఆయన బాన్సువాడ ప్రజలకు సేవ చేయాల్సిందే’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని టీటీడీ ఆలయ బ్రహ్మోత్సవాలు, వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశామని చెప్పారు. రెండు సీజన్లలో రైతులు పంటలు పండించుకునేలా సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువ చేసే పంటలను రైతులు పండించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ రైతులు సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు, రైతుల కష్టాలను చూసే తాను ఉద్యమానికి పురుడు పోశానని, రాష్ట్రాన్ని సాధించుకొని.. కాళేశ్వరం లాంటి మహోన్నతమైన సాగునీటి ప్రాజెక్టును నిర్మించుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. 100 ఏళ్ల చరిత్ర గల నిజాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడానికి సీమాంధ్ర పాలకుల కుట్రే కారణమని మండిపడ్డారు. నిజాంసాగర్‌పైన మంజీర నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్ట్ నీటిని సీమాంధ్ర పాలకులు హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం మళ్లించారని విమర్శించారు. ఫలితంగా నిజాంసాగర్ ఆయకట్టు రైతులు ఒక్క సీజన్‌లో కూడా పంటలు పండించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది తట్టుకోలేకే సింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించారని గుర్తుచేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నీటిని విడుదల చేయాలంటూ గతంలో స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద దీక్షకు పూనుకోగా.. దానికి తాను సైతం హాజరయ్యానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్‌ల ద్వారా గోదావరి నీళ్లతో నిజాంసాగర్‌ను నింపుతున్నామన్నారు. నిజాంసాగర్ ఎన్నటికీ ఎండిపోదని.. లక్షల ఎకరాలకు తాగునీరు అందించనుందని కేసీఆర్ వెల్లడించారు.
నేనున్నన్ని రోజులు పోచారం ఉండాల్సిందే
తాను ఉన్నన్ని రోజులు పోచారం ఉంటారని, వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోచారం యువకుడిలాగా పని చేస్తున్నారని కేసీఆర్ కొనియాడారు. స్పీకర్‌గా పనిచేస్తున్న ఆయన.. నియోజకవర్గంలో అందరికీ అండగా ఉంటున్నారన్నారు. పోటీ పడి గ్రామగ్రామాన తిరుగుతూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రికి అఖిల భారత గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. తాను 30 ఏళ్ల నుంచి పోచారాన్ని ఎమ్మెల్యేగా చూస్తున్నానన్నారు. ఇద్దరం కలిసి టీడీపీలో ఎమ్మెల్యేలుగా పనిచేశామని చెప్పారు. నియోజకవర్గంలో నీరులేని ప్రాంతాలను గుర్తించి చందూరు, సిద్దాపూర్ ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు అందించే విధంగా కృషి చేశారని తెలిపారు. నియోజకవర్గంలో పనులు చేసేందుకు సీఎం ప్రత్యేక ఫండ్ కింద రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తిమ్మాపూర్‌లోని టీటీడీ ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో ఆలయంలో అవసరమైన పనులు చేపట్టాలని కోరారు.
కల్యాణ మహోత్సవంలో సీఎం దంపతులు
తిమ్మాపూర్ ఆలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, వేద పండితులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దాతల సహకారంతో శ్రీవారికి రెండు కిలోల బంగారంతో చేయించిన కిరీటాన్ని సీఎం చేతుల మీదుగా సమర్పించారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి, అమ్మవార్లకు తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. కల్యాణ ఘట్టం పూర్తయిన తర్వాత కేసీఆర్ దంపతులను స్పీకర్ పోచారం పట్టు వస్త్రాలతో సన్మానించారు. సీఎం కేసీఆర్ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా స్థలం విశాలంగా లేకపోవడంతో పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతించారు. దేవాలయంలోకి తక్కువ మందినే అనుమతించారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల అరెస్టులు
సీఎం పర్యటన సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజుతో పాటు బీర్కూర్, మద్నూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని.. సమీపంలోని పోలీసు స్టేషన్లకు తరలించారు. బిచ్కుంద, బాన్సువాడలో అంగన్‌వాడీ టీచర్లు, సీఐటీయూ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.