KCR: సీఎం ప్రచార పద్దు!

ABN , First Publish Date - 2023-02-08T03:22:57+05:30 IST

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు జిల్లాలకు వెళ్లినప్పుడు వరాల జల్లులు కురిపించారు. పంచాయతీలకు ఇన్ని లక్షలు.. మునిసిపాలిటీలకు ఇన్ని కోట్లు అంటూ హామీలు గుప్పించారు.

KCR: సీఎం ప్రచార పద్దు!

హామీలు, వరాల సాకారానికి రూ.10 వేల కోట్లు

గత బడ్జెట్లో 2000 కోట్లే.. ఇప్పుడు ఐదు రెట్లు ఎక్కువ

ఎన్నికల ఏడాదిలో ఎక్కడికక్కడ సీఎం వరాలకు చాన్స్‌

ఆయన విచక్షణాధికారాల కింద ఈ నిధులు ఖర్చు

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రచారానికి మరో వెయ్యి కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు జిల్లాలకు వెళ్లినప్పుడు వరాల జల్లులు కురిపించారు. పంచాయతీలకు ఇన్ని లక్షలు.. మునిసిపాలిటీలకు ఇన్ని కోట్లు అంటూ హామీలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఈ హామీల తుపాను కొనసాగనుందా!? అడిగిన వారికి లేదనకుండా వివిధ వర్గాలపై వరాల జల్లులు కురిపించనున్నారా!? తద్వారా, ఓటు బ్యాంకును పెంచుకోనున్నారా!? ఎన్నికల ఏడాది కారణంగా ఇకనుంచి ప్రచారానికి పెద్దపీట వేయనున్నారా!? పార్టీని బీఆర్‌ఎ్‌సగా మార్చిన నేపథ్యంలో, స్థానిక పత్రికలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పత్రికలకూ ‘ప్రభుత్వ ప్రచార’ ప్రకటనలను జారీ చేయనున్నారా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యమంత్రి తన విచక్షణాధికారాల మేరకు ప్రకటించే ‘ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎ్‌ఫ)’కు భారీగా నిధులు కేటాయించడం, పత్రికలు, చానెళ్లకు ప్రకటనల కోసం ఐ అండ్‌ పీఆర్‌ విభాగానికి రూ.1000 కోట్లను కేటాయించడాన్ని ఇందుకు ఉదాహరిస్తున్నారు. ఎస్డీఎఫ్‌కు 2022-23 బడ్జెట్లో కేవలం రూ.2000 కోట్లను మాత్రమే కేటాయించారు.

కానీ, ఈసారి ఐదు రెట్లు పెంచేసి ఏకంగా రూ.10,348 కోట్లను కేటాయించింది. సీఎం ఏ నియోజకవర్గానికి, ఏ జిల్లాకు, ఏ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఆదేశిస్తే, జిల్లా కలెక్టర్‌ వాటికి కేటాయించాల్సిందే. ఉదయం బహిరంగ సభలో ప్రకటిస్తే.. సాయంత్రానికే జీవో విడుదలవుతుంది. నిజానికి గతంలో ఇలాంటి పద్దు ఉండేది కాదు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌), డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద నిధులను కేటాయించేవారు. 2017లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి కోసం ఎస్‌డీఎ్‌ఫను ఏర్పాటు చేసింది. దీని కింద బడ్జెట్లలో నిధులు కేటాయిస్తున్నారు. ఈసారి భారీ మొత్తంలో నిధుల కేటాయింపు వెనక మతలబు ఉందని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే ఎన్నికల నేపథ్యంలో సీఎం ఎక్కడికి వెళితే అక్కడ వరాల జల్లులు కురిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎస్డీఎఫ్‌ కింద నిధుల కేటాయింపునకు ఎటువంటి నిబంధనలూ లేవు. దేనికైనా నిధులను కేటాయించడానికి సీఎంకు విచక్షణాధికారాలుంటాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు నియోజకవర్గాల్లోని ఏవైనా భవనాలు, రోడ్ల నిర్మాణానికి కూడా కేటాయించవచ్చు. అందుకే, దీని కింద చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఉంటారు. ఇటీవల కలెక్టర్‌ భవనాల ప్రారంభోత్సవాల కోసం జిల్లాలకు వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్‌కు ఎస్‌డీఎఫ్‌ కింద విజ్ఞప్తులు చాలా వచ్చాయి. ఒక్కోసారి జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో అప్పటికప్పుడు సీఎం నిధులను ప్రకటించేస్తారు. ఇలాంటివాటిని దృష్టిలో పెట్టుకుని ఎస్‌డీఎ్‌ఫకు భారీగా నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక, ‘నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ)’ కింద రూ.800 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో కూడా ఇంతే మొత్తాన్ని కేటాయించినా.. పెద్దగా విడుదల చేయలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసారి విడుదల చేయవచ్చన్న చర్చ జరుగుతోంది.

వామ్మో.. పబ్లిసిటీ ఫండ్‌

సాధారణంగా సమాచార, పౌర సంబంధాల శాఖకు జీతభత్యాలతోపాటు కొద్దిగా నిధులను మాత్రమే కేటాయించేవారు. గత ఏడాది కూడా కేవలం రూ.148 కోట్లే కేటాయించారు. కానీ, ఈసారి ఈ శాఖకు ప్రభుత్వం ఎప్పుడూ లేని ప్రాధాన్యమిచ్చింది. ఏకంగా రూ.1000 కోట్లను కేటాయించింది. ఇందుకు కారణం.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాల ప్రచారమే. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎ్‌సగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ పథకాలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలను గుప్పిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఏ రాష్ట్రానికి వెళితే.. ఆ రాష్ట్రంలోని స్థానిక పత్రికలు, చానెళ్లకు రూ.కోట్లాది ప్రకటనలను గుప్పిస్తున్నారని విమర్శిస్తున్నాయి. గతంలో ఝార్ఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు అక్కడ పెద్ద మొత్తంలో ప్రకటనలు జారీ చేశారని, పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. 2014 నుంచి 2018 వరకు ప్రకటనల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.300 కోట్లను వెచ్చించిందని ఆర్టీఐ కింద పొందిన సమాచారం మేరకు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) బయటపెట్టింది. ఎన్నికల ఏడాదిలో ఇప్పుడు కేవలం ప్రచారం కోసమే వెయ్యి కోట్లను కేటాయించడం గమనార్హం.

Updated Date - 2023-02-08T03:46:30+05:30 IST