Dalit Bandhu: దళిత బంద్‌ !

ABN , First Publish Date - 2023-01-21T02:11:36+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో తెరపైకి వచ్చిన దళిత బంధు పథకానికి ఈ ఏడాది (2022-23) బడ్జెట్లో ప్రభుత్వం ఘనంగా రూ.17,700 కోట్లు కేటాయించింది.

Dalit Bandhu: దళిత బంద్‌ !

బడ్జెట్లో ఘనంగా రూ.17,700 కోట్ల కేటాయింపు

పది నెలల్లో పైసా కూడా ఖర్చు చేయని సర్కారు

ఈ నిధులతో ఒక్కరికి కూడా పథకం అమలు కాని వైనం

పైగా లబ్ధిదారుల సంఖ్యలో కోతలంటూ సంకేతాలు

ఖరారు కాని మార్గదర్శకాలు.. ఆన్‌లైన్‌పై అస్పష్టత

ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న పేదలు, దరఖాస్తుదారులు

దళిత బంధు అమలుకు రాష్ట్రంలోనే అనేక ఇబ్బందులు

దేశంలో ఏటా 25 లక్షల మందికి ఇస్తామని కేసీఆర్‌ ప్రకటన

దళిత బంధు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం! భారతదేశంలోనే విప్లవం తీసుకొచ్చే మహత్తర పథకమంటూ సర్కారు గొప్పగా చెబుతోంది! కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఒక్క లబ్ధిదారును కూడా ఎంపిక చేయలేదు!

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో తెరపైకి వచ్చిన దళిత బంధు పథకానికి ఈ ఏడాది (2022-23) బడ్జెట్లో ప్రభుత్వం ఘనంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2.82 లక్షల మందికి ఈ ఏడాది పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఏడాది కావస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై పది నెలలు పూర్తయింది. కానీ, ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఒక్కరంటే ఒక్కరికి కూడా దళిత బంధు పథకాన్ని అమలు చేయలేదు. అంతేనా, నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున ఈ ఏడాదే దళిత బంధు పథకాన్ని మంజూరు చేస్తామని బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ సంఖ్యను నియోజక వర్గానికి 500కు కుదించింది. తాజాగా మళ్లీ ఆ సంఖ్యను 200కు తగ్గించినట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల సంఖ్యలో కోత కోసినా పథకం మాత్రం ముందుకు సాగలేదు. పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని సర్కారు ప్రకటించింది. ఇప్పటి వరకూ వాటి ఊసే లేదు. వాటి కోసం ఎస్సీ శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. పథకాన్ని ఇకనుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో అమలు చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ అంశంలోనూ ఇప్పటి వరకూ అడుగు ముందుకు పడలేదు. దాంతో, పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ తమకు పథకాన్ని వర్తింపజేయాలని వినతి పత్రాలు ఇస్తున్నారు.

అనివార్యంగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. స్థానికంగా రాజకీయ ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ప్రస్తుతం దరఖాస్తులను తీసుకుంటున్నామని, అంతిమంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులకు పథకం అందుతుందని చెబుతున్నారు. అంతేనా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పథకం అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తారా? ఎమ్మెల్యేలకా? అనే సందిగ్ధమూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే, దళిత బంధు పథకంపై తాజాగా సీఎం కేసీఆర్‌ ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘దళిత జాతి బిడ్డలు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి. ఎన్నేళ్లు అనుభవించాలి. అందుకే పుట్టింది తెలంగాణలో దళితబంధు పథకం. భారత దళిత జాతికి నేను పిలుపు ఇస్తున్నా. తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఏడాదికి 25 లక్షల కుటుంబాల చొప్పున దేశమంతా అమలు చేయాలి. మీరు చేయకపోతే మేం చేసి చూపిస్తాం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోనే పథకం అమలుకు ఎన్నో ఇబ్బందులు పడుతుండగా దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చినట్టైంది. రాష్ట్రంలోనే పథకం అమలుపై దరఖాస్తుదారుల నుంచి ఒత్తిడి ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకం అమలుపై ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటని పార్టీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. పథకానికి కేటాయించిన నిధులు, ఖర్చుపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటని మంత్రుల్లోనూ చర్చ సాగుతోంది.

ఆరంభ శూరత్వమే..

ఉప ఎన్నిక నేపథ్యంలో 2021 జూలైలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. ఆ నియోజకవర్గంలో అప్పట్లో సంతృప్త స్థాయిలో అందరికీ అమలు చేశారు. అదే ఏడాది ఆగస్టులో సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలోనూ 75 మందికి అందించారు. ఆ తర్వాత, రాష్ట్రం నాలుగు దిశల్లో అమలు పేరిట ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ నియోజక వర్గాలైన మధిరలోని చింతకానికి రూ.100 కోట్లు, తుంగతుర్తిలోని తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు, అచ్చంపేటలోని చారగొండ మండలానికి రూ.50 కోట్లు, జుక్కల్‌లోని నిజాంసాగర్‌ మండలానికి రూ.50 కోట్ల చొప్పున ఆయా జిల్లాల కలెక్టర్ల అకౌంటుకు బదిలీ చేసింది. దీంతో ఆయా మండలాల్లో మొత్తం 4,808 మందికి పథకం అందింది. అనంతరం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల పరిధిలో 100 కుటుంబాల చొప్పున 11,800 మందికి సాయం అందించాలని సర్కారు నిర్ణయించింది. వీటిలో ఇప్పటి వరకు కొంతమందికే అందినట్టు తెలుస్తోంది. మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి అంటే మార్చి 31, 2022 నాటికి 40 వేల మందికి పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 38 వేల మందికి అందించారు. ఇంత వరకూ ప్రభుత్వ లక్ష్యం దాదాపుగా నెరవేరినట్టే. ఆ తర్వాత పథకం పడకేసింది. అంతకు ముందే మంజూరు చేసిన నిధులతో ఈ ఆర్థిక సంవత్సరంలో కొంతమందికి పథకాన్ని అమలు చేసినా.. ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులతో మాత్రం ఒక్కరికి కూడా దళిత బంధును వర్తింపజేయలేదు.

ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా.?

పైలట్‌ ప్రాజెక్టు కింద అమలైన దళితబంధు పథకాన్ని రెండో విడత నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసి అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. మొదటి విడతలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు. కానీ, దీనిపైనా స్పష్టతకు రాలేకపోతున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉంది. అయితే, రెండో విడతను మాత్రం ఆన్‌లైన్‌ ద్వారా అమలు చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ కోసం వెబ్‌ పోర్టల్‌తోపాటు యాప్‌ను రూపొందించి ఇప్పటికే అందించిన యూనిట్లతో ట్రయల్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-01-21T03:33:33+05:30 IST