Double bed room House : సొంతింటికి సమాధి!

ABN , First Publish Date - 2023-03-04T04:45:59+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో.. కాంగ్రెస్‌, టీడీపీ హయాముల్లో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు! డబ్బా ఇళ్లో.. అగ్గిపెట్టెలాంటి ఇళ్లో.. ఏవైనా కానీ ..

Double bed room House : సొంతింటికి సమాధి!

నిరుపేదకు కనుచూపు మేరలో కనిపించని పక్కా ఇల్లు

గత ఎనిమిదిన్నరేళ్లలో ఇచ్చిన డబుల్‌ ఇళ్లు 23 వేలు మాత్రమే

మరో లక్షన్నరకుపైగా పూర్తయినా పంపిణీకి ఇప్పటికీ దూరమే

దరఖాస్తుదారుల వెల్లువతో డబుల్‌ ఇళ్ల పంపిణీలో తీవ్ర జాప్యం

ఆ పథకం స్థానంలోకి సొంత జాగాకు రూ.3 లక్షల సాయం

ఏడాది గడిచినా ఇప్పటికీ అడుగు ముందుకు పడని వైనం

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనకు ఐదేళ్లుగా తెలంగాణ దూరం

కొల్లూరు ‘డబుల్‌’ ఇళ్లు ఇచ్చేదెన్నడు?

రెండేళ్ల క్రితమే పూర్తి.. పంపిణీపై స్పష్టత ఇవ్వని సర్కారు

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో.. కాంగ్రెస్‌, టీడీపీ హయాముల్లో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు! డబ్బా ఇళ్లో.. అగ్గిపెట్టెలాంటి ఇళ్లో.. ఏవైనా కానీ అప్పటి పరిస్థితులను బట్టి ఏడాదికి లక్షో.. లక్షన్నరో కట్టేవారు. దానితో నిరుపేదల సొంతింటి కల సాకారమయ్యేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రభుత్వాలు కట్టిన ఇళ్లను డబ్బా ఇళ్లు అంటూ తూలనాడారు. తాము అధికారంలోకి వస్తే సకల సౌకర్యాలతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ ఆశల పల్లకి ఎక్కించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వాటిలో కొన్నిటిని పంచారు. కొన్నిటి నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వలేదు. మరికొన్నిటి నిర్మాణం అసలు చేపట్టలేదు. గత బడ్జెట్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు నిధులు కేటాయించినా ఖర్చు చేయలేదు. ఈసారి బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ముందుకు కదలకపోవడంతో ప్రభుత్వం సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ఇస్తామనే కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. గత బడ్జెట్లో దానికి నిధులు కేటాయించింది. కానీ, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈసారి బడ్జెట్లోదానికి భారీగా నిధులు కేటాయించింది. కానీ, ఇప్పటి వరకూ కనీసం మార్గదర్శకాలు ఖరారు కాలేదు. లబ్ధిదారుల ఎంపిక దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన. నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. గతంలో ఈ పథకం కింద రాష్ట్రానికి నిధులు వచ్చేవి. కానీ, ఐదేళ్ల నుంచి నిలిచిపోయాయి. ఇందు కు కారణం.. లబ్ధిదారులను ముందుగా గుర్తించి జాబితాను తమకు పంపాలన్నది కేంద్రం నిబంధన. అందుకు రాష్ట్రం ససేమిరా అంటోంది. దాంతో, ఐదేళ్లుగా ఒక్కరికి కూడా కేంద్ర సాయం అందలేదు.

వెరసి.. తెలంగాణలో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పడకేసింది. వారి సొంతింటి కల సమాధి అవుతోంది. గత ఎనిమిదిన్నరేళ్లలో ప్రభుత్వం నిరుపేదలకు కేవలం 23 వేల డబుల్‌ ఇళ్లనే అందించింది. ఇటీవల ఏకంగా గృహ నిర్మాణ శాఖనే ఎత్తేసింది. రాష్ట్రంలో ఇళ్లను నిర్మించడం లేదని, ఆ శాఖకు పని లేదని పేర్కొంటూ ఆర్‌అండ్‌బీలో విలీనం చేసింది. దాంతో, ప్రభుత్వం అసలు పక్కా ఇళ్లను నిర్మిస్తుందా? తమ సొంతింటి కల సాకారం అవుతుందా? అనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది.

డబుల్‌ ఇళ్లకు దరఖాస్తులు ట్రిపుల్‌

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల్లకు రాష్ట్రవ్యాప్తంగా 12,61,736 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే సుమారు 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు తీసుకోవడాన్ని నిలిపి వేశారు. కానీ, ఇంకా ఎంతోమంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న దాదాపు 13 లక్షల మందికి డబుల్‌ ఇళ్లు నిర్మించాలంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు అవసరం. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు మూడు లక్షల ఇళ్లనే మంజూరు చేసింది. గ్రామ స్థాయిలో 1,20,598, పట్టణ స్థాయిలో 1,70,459 కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 2,91,057 ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకూ కేవలం 1.18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. మరో 69 వేల ఇళ్లు 90 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. 60 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పటి వరకూ ప్రారంభించనే లేదు. ఇక, డబుల్‌ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.11 వేల కోట్లు మాత్రమే. అంతేనా.. ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు, వచ్చిన దరఖాస్తులకు ఏ మాత్రం పొంతన లేదు. ఉదాహరణకు, నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 14,786 ఇళ్లను మంజూరు చేయగా, 93,275 దరఖాస్తులు అందాయి. జగిత్యాలలో 8,778 ఇళ్లను మంజూరు చేస్తే.. 42,857 దరఖాస్తులు; మహబూబ్‌నగర్‌ జిల్లాలో 7,596 ఇళ్లకు గాను.. 48,400; సిద్దిపేటకు 15,773 ఇళ్లను కేటాయిస్తే 38,652; భూపాలపల్లికి 3,882 ఇళ్లకు 22,000; సూర్యాపేట జిల్లాలో 5,614 ఇళ్లకు గాను 15,204; మహబూబాబాద్‌లో 5,542 ఇళ్లకు 13,500; వికారాబాద్‌ జిల్లాలో 4,109 ఇళ్లకు 17,352; నిర్మల్‌లో 6,801 ఇళ్లకు 19,051; కరీంనగర్‌లో 6,586ఇళ్లకు గాను 21,959 దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో, నిర్మించిన ఇళ్లు కూడా పంపిణీకి నోచుకోవడం లేదు. దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండడం, నిర్మించిన ఇళ్లు తక్కువగా ఉండడంతో వాటి పంపిణీకి ప్రభుత్వం సాహసించడం లేదు. దాంతో, పలు జిల్లాల్లో పూర్తయి, పంపిణీ చేయకుండా ఉన్న ఇళ్ల్లను పేదలు ఆక్రమించుకుంటున్నారు. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలోని చింతకుంటలో నిర్మించిన ఇళ్ల్లపై అక్కడి పేదలు తమ పేర్లు రాసుకున్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.

‘సొంత జాగా’కు బాలారిష్టాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు డబుల్‌ ఇళ్లు పంపిణీ చేయలేమన్న భావనకు వచ్చిన ప్రభుత్వం సొంత జాగా పథకాన్ని తెరపైకి తెచ్చింది. సొంత జాగా ఉండి అందులో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షల సాయం అందిస్తామని 2022 మార్చిలో ప్రకటించింది. ఆ తర్వాత దానిని కాస్తా రూ.3లక్షలకు కుదించింది. అయినా, ఈ పథకం ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధులు కేటాయించినా.. ఏడాది కాలంలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున 119 నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు 2023-24 బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఎన్నికల సంవత్సరం కనక ఈ పథకం ముందుకు కదులుతుందా!? నిధుల కొరతతో ఎప్పట్లాగే జాప్యం జరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే!

సొంత జాగా లేని వారికి 90 గజాలు?

డబుల్‌ ఇళ్లు దక్కని వారికి సొంత జాగా ఉండి అందులో ఇంటి నిర్మాణం చేపడితే రూ.3 లక్షలు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో అసలు జాగా లేని వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సొంత జాగా లేని వారు ఎంతమంది ఉంటారనే అంశంపై ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. సొంత జాగా లేని వారి వివరాలు తేలిన తర్వాత వారికి బీపీఎల్‌ కోటాలో 90గజాల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే స్థలం కేటాయించిన వారికి రూ.3లక్షల ఆర్థిక సాయం ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాల సంఖ్య దాదాపు 31లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వీరు సైతం తమ గ్రామాల్లో ఉన్న సొంత స్థలంలో ప్రభుత్వం అందించే రూ.3లక్షల సాయాన్ని అందుకుని ఇంటిని నిర్మించుకోవాలన్న భావనలో ఉన్నారు.

ఆవాసంతో రాజకీయం

గత ప్రభుత్వాలు సొంతంగానూ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టేవి. కేంద్రం నుంచి వచ్చిన నిధులనూ దీనికి వాడుకునేవి. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి నెలకొంది. పీఎంఏవై కింద ఏటా లక్ష ఇళ్లకుపైగా నిధులు ఇస్తామని కేంద్రం చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోవడం లేదు. కేవలం రెండేళ్ల పాటు మాత్రమే పీఎంఏవై నిధులను డబుల్‌ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించుకుంది. 2016-17లో రూ.190.79కోట్లు, 2017-18లో రూ.1120.7 కోట్లతో మొత్తం రూ.1,311 కోట్లను కేంద్రం ఇచ్చింది. అయితే, ఈ పథకానికి సంబంధించి అప్పట్లోనే వివాదం నెలకొంది. తొలుత లబ్ధిదారుల జాబితాను రూపొందించి దానిని తమకు పంపాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. ఐదేళ్లుగా పీఎం ఆవాస్‌ యోజన లబ్ధిదారులను రాష్ట్ర సర్కారు పంపడం లేదు. దాంతో, ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో పీఎం ఆవాస్‌ యోజన తరఫున పెద్దఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నా తెలంగాణలో మాత్రం ఆ పథకం అమలు జరగడం లేదు. ఈ పథకం కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదంలో చిక్కుకుందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

Updated Date - 2023-03-04T04:55:03+05:30 IST