భావోద్వేగమే ప్రచారాస్త్రం!
ABN , First Publish Date - 2023-10-31T03:38:43+05:30 IST
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. గడిచిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ‘సెంటిమెంట్’ ప్రచారాస్త్రంగా చేసుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.
మానసికంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలతో ప్రచారం
మేనిఫెస్టో హామీల కంటే వాటిపైనే దృష్టి
మేం రాకపోతే రాష్ట్రం ఆగమే.. పథకాలూ, అభివృద్ధి బంద్
బీఆర్‌ఎస్ నేతల ప్రచారం.. ఓడిస్తే ప్రజలకే నష్టమన్న కేసీఆర్
బీఆర్‌ఎస్ వస్తే నియంత పాలన.. దోపిడీకి అడ్డు ఉండదు
ప్రచారంలో పదేపదే చెబుతున్న కాంగ్రెస్ నేతలు
బీసీ సెంటిమెంట్‌తో భారతీయ జనతా పార్టీ అడుగులు
ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడిపైనా ప్రచారానికి రంగం సిద్ధం?
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. గడిచిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ‘సెంటిమెంట్’ ప్రచారాస్త్రంగా చేసుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈసారి కూడా సెంటిమెంట్‌నే నమ్ముకుంటే ‘పని’ అయ్యేలా లేదని గ్రహించిన బీఆర్‌ఎస్.. కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. మేనిఫెస్టోలోని హామీల కంటే ఇతర అంశాలపైనే దృష్టి పెడుతోంది. భావోద్వేగాలను ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. కాంగ్రెస్ కూడా ఇదే తరహాలో గట్టిగా బదులిస్తోంది. ‘‘మేం అధికారంలోకి రాకపోతే రాష్ట్రం నాశనమే. జనం కష్టాలు రెట్టింపవుతాయి. నియంతృత్వం పెరిగిపోతుంది. దోపిడీకి అడ్డూఅదుపూ ఉండదు’’ అంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్ని హెచ్చరిస్తూ ప్రచారం చేస్తున్నాయి. ‘‘ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ నేతలు పగ్గాలు చేపడితే.. మీరు ఆగం అవుతారు’’ అంటూ ఒకరకంగా ప్రజల్ని భయపెట్టి ఓట్లు రాబట్టుకునే ‘భావోద్వేగ బెదిరింపు’ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఓటర్లపై మానసికంగా ప్రభావం చూపే అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
బీఆర్‌ఎస్ గత రెండు ఎన్నికల్లోనూ సెంటిమెంట్‌ను ఆయుధంగా ప్రయోగించి, విజయఢంకా మోగించింది. 2014లో తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. ఇక 2018లో కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో ‘‘మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనం వస్తుందం’’టూ సీఎం కేసీఆర్ ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిలించారు. అది కూడా బాగానే పనిచేసింది. ఫలితంగా భారీ మెజారిటీతో బీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేసేలా కనిపించకపోవడంతో ప్రచారంలో సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల కంటే భావోద్వేగ అంశాలే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ ప్రసంగాలు ఆ కోవలోనే ఉంటున్నాయి. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఆగమైపోతామన్న భావనను ప్రజల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రె్‌సకు అధికారమిస్తే గోస పడతామన్న ఆందోళనను కలిగిస్తోంది. కరెంటు ఉండదని, రైతుబంధు, దళితబంధు లాంటివి బంద్ అవుతాయని, ధరణి రద్దవుతుందని పదేపదే ప్రస్తావిస్తున్నారు. సీఎం కేసీఆర్ సైతం బహిరంగ సభల్లో ఇలాంటి భావోద్వేగ ప్రసంగాలే ఎక్కువగా చేస్తున్నారు. అలాగే.. ‘‘మమ్మల్ని ఓడిస్తే మాకు నష్టమేం లేదు. రెస్ట్ తీసుకుంటాం. నష్టపోయేది ప్రజలే’’ అని చెబుతున్నారు. ఇక మంత్రి హరీశ్ అయితే ఒక అడుగు ముందుకేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలవకపోతే.. హైదరాబాద్ మరో అమరావతి అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ఓటర్లలో చర్చకు దారితీసిందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 2018 ఎన్నికల తర్వాత ఏపీ నుంచి సుమారు 5 లక్షల గ్యాస్ కనెక్షన్లు హైదరాబాద్‌కు బదిలీ అయ్యాయని పౌరసరఫరాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బీఆర్‌ఎస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బీఆర్‌ఎస్ వస్తే దోపిడీనే: కాంగ్రెస్
కాంగ్రెస్ కూడా తమ ఆరు గ్యారెంటీల కంటే బీఆర్‌ఎ్‌సకు కౌంటర్‌గా ఇతర అంశాలనే ప్రచారం చేస్తోంది. మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే అవినీతికి హద్దుండదని, రాష్ట్రం మొత్తాన్ని కేసీఆర్ కుటుంబమే దోచేస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వైఖరిని కూడా కాంగ్రెస్ తన ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండరని, తాను కలవాలనుకుంటే తప్ప.. ఇతరులకెవ్వరికీ ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వరన్న ప్రచారం ఇప్పటికే ఉంది. దీన్ని కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది అలాగే కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. తెలంగాణకు ఎక్కువ హాని జరుగుతుందని, ప్రజలపై అప్పుల భారం పడుతుందన్న భావనను ఓటర్లలో కలిగేలా ప్రచారం చేస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకపోవడం, పేపర్ లీకేజీల వంటి అంశాలను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
బీసీ సీఎంతో బీజేపీ..
బీజేపీ కూడా నిన్నమొన్నటి దాకా ప్రధాని మోదీ ఫొటో చూపి ఎన్నికల ప్రచారం చేసింది. ఇప్పుడది పెద్దగా వర్కవుట్ కాదన్న విషయాన్ని గ్రహించింది. తెలంగాణలో ఎక్కువగా ఉన్న బీసీ సామాజికవర్గాన్ని టార్గెట్‌గా చేసుకుంటోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం చేస్తామంటూ సరికొత్త పల్లవిని అందుకుంది. ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఎంపీకి కత్తిపోట్ల అంశంపైనా..
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి అంశం కూడా ఇప్పుడు భావోద్వేగ ప్రసంగాలకు వేదికవుతోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ అంశంపై భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘మాకు తిక్కరేగితే తడాఖా చూపిస్తాం’’ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ చేసిన ఈ దాడిని ఓటుతో తిప్పికొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు కూడా.. తమ పాలనలో రాష్ట్రంలో ఏనాడూ కరువు గానీ, కర్ఫ్యూగానీ లేవని చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఆగమవుతారని హెచ్చరిస్తున్నారు.