Share News

Bus fire : బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం

ABN , First Publish Date - 2023-12-05T04:15:11+05:30 IST

కదులుతున్న ట్రావెల్స్‌ బస్సులో ఎసీలోంచి నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Bus fire : బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం

ఏసీ నుంచి నిప్పురవ్వలు రావడంతో ఎగిసిన మంటలు

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన.. బస్సులో 38 మంది

డ్రైవర్‌ అప్రమత్తం.. ప్రయాణికులను హెచ్చరించి నిలిపివేత

కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న 37 మంది

నల్లగొండటౌన్‌, డిసెంబరు 4: కదులుతున్న ట్రావెల్స్‌ బస్సులో ఎసీలోంచి నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్‌ ఆ వాహనాన్ని ఆపి, ప్రయాణికులను హెచ్చరించడంతో బస్సులో ఉన్న 38మందిలో 37 మంది ఎలాగోఅలా వాహనంలోంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే.. బస్సులో గాఢ నిద్రలో ఉన్న ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకొని దుర్మరణం పాలయ్యాడు. తర్వాత బస్సును పరిశీలించగా.. మృతుడి ఎముకలు కనిపించాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. రూరల్‌ ఎస్పై బాస్సర్‌ రెడ్డి వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైంది శ్రీకృష్ణ ట్రావెల్స్‌ (చెన్నుపాటి)కి చెందిన స్లీపర్‌ బస్సు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని చీరాలకు బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో బస్సు నార్కట్‌పల్లి సమీపంలోని ఓ హోటల్‌ వద్ద కాసేపు ఆగి, బయలుదేరింది.

తెల్లవారుజామున 2:30కు నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌ సమీపంలోకి రాగానే ఏసీలోంచి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. గమనించిన డ్రైవర్‌ నక్క జోసఫ్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. మొత్తం 38 ప్రయాణికుల్లో 37మంది అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు కాలిపోయింది. ప్రమాద ఘటనపై ఘటనా స్థలం నుంచి 100కు సమాచారం రావటంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లతో అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను అటుగా వచ్చిన బస్సుల్లో ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ప్రమాదంలో అమెరికాకు వెళ్లాల్సిన ఓ యువతి పాస్‌పోర్టుతో పాటు ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు, నగదు, బంగారం పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. బస్సులో మంటలు ఆరిపోయిన తర్వాత లోపలికి వెళ్లి గమనించగా, ఓ వ్యక్తి ఎముకలు కనిపించాయి. ఆ తర్వాతే మంటల్లో ఒకరు సజీవ దహనమైనట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ఎముకలను డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.

Updated Date - 2023-12-05T04:15:31+05:30 IST