Share News

‘పేట’లో హాట్‌ హాట్‌

ABN , First Publish Date - 2023-11-04T16:01:40+05:30 IST

అంబర్‌పేట నియోజకవర్గంలో రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది. రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

‘పేట’లో హాట్‌ హాట్‌

- అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీ

- నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న అభ్యర్థులు

- రెండోసారి విజయం కోసం కాలేరు యత్నాలు

- అసమ్మతి నేతలతో ఇబ్బందులు

- కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తానంటున్న రోహిన్‌రెడ్డి

- అసంతృప్తులను కలుపుకుని పోయేలా చర్యలు

- బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌

- పెండింగ్‌ పనులతో జనం అవస్థలు

బర్కత్‌పుర, నవంబర్‌4 (ఆంఽఽధ్రజ్యోతి): అంబర్‌పేట నియోజకవర్గంలో రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది. రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ రెండోసారి గెలుపునకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయనకు సీనియర్‌ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు సహకరించకపోవడం కొంత ఇబ్బందికరంగా మారుతోంది. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధియే తనను గట్టెక్కిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అన్ని డివిజన్లను చుట్టి వస్తున్నారు.

రోహిన్‌ రాకతో గులాబీలో కాక

ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి ఎంపికతో అంబర్‌పేట నియోజకవర్గ కాంగ్రె్‌సలో జోష్‌ నెలకొన్నది. సీనియర్‌ నేత వీహెచ్‌ ఆశీర్వాదంతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. టికెట్‌ దక్కని వారిని కలుపుకొనిపోతూ విజయం కోసం శ్రమిస్తున్నారు. సోమవారం గోల్నాకలో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశానికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొన్నది. ప్రభుత్వ ఏర్పడ్డాక తప్పకుండా అవకాశాలు క ల్పిస్తామని రేవంత్‌ అసంతృప్తులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం టికెట్‌ను పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ టీజేఎ్‌సకు కేటాయించింది. దీంతో మైనార్టీ ఓట్ల అండతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ స్వల్ప ఓట్లతో విజయం సాధించారు.

పోటీకి కిషన్‌రెడ్డి దూరం

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీజేపీ మాత్రం అభ్యర్థిని ఇటీవల ప్రకటించింది. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఈ సారి పోటీకి దూరంగా ఉన్నారు. తొలుత గౌతమ్‌రావు టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరిగినా చివరకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌కు టికెట్‌ దక్కింది.

హిమాయత్‌నగర్‌ నుంచి వేరుపడి..

పూర్వం హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం ఉండగా, 2009లో పునర్విభజన తర్వాత అంబర్‌పేట నియోజకవర్గం ఆవిర్భవించింది. నియోజకవర్గంలో 236 పోలింగ్‌ కేంద్రాలు, 2,70,728 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,37,325 మంది, మహి ళలు 1,33,332 మంది ఉన్నారు. అయిదు మున్సిపల్‌ డివిజన్లు ఉన్నాయి. నాల్గవసారి ఈ నియోజకవర్గం ఎన్నికలకు సిద్దమైంది. 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ కిషన్‌రెడ్డిపై 1,067 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో అంబర్‌పేట, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ డివిజన్లు ఉండగా.. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ముగ్గురున్నారు. నల్లకుంట, కాచిగూడ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అభివృద్ధి పనుల పెండింగ్‌తో అవస్థలు

1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.270 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అంబర్‌పేట ఫ్లైఓవర్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి రెండేళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు.

2. రూ.22 కోట్లతో చేపట్టిన మోహిన్‌ చెరువు నాలా విస్తరణ పనులు ఇంకా అసంపూర్తిగానే మిగిలాయి. పోలీసు లైన్‌ నుంచి ఈ నాలా విస్తరణ పనులు చేపట్టాల్సి ఉండగా నేటికీ ఆచరణకు నోచుకోలేదు.

3. అంబర్‌పేట అలీకేఫ్‌ నుంచి నాగోలు మెట్రోస్టేషన్‌ వరకు మూసీ వెంట రోడ్డు నిర్మాణ పనులకు రూ.54 కోట్లు కేటాయించారు. ఈ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు.

4. అలీకేఫ్‌ చౌరస్తా వద్ద మూసీపై మూసారాంబాగ్‌ బ్రిడ్జి, చాదర్‌ఘాట్‌ వద్ద కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి రూ.95 కోట్లు కేటాయించారు. మూసారాంబాగ్‌ వద్ద పనులకు శంకుస్థాపన జరిగినా, చాదర్‌ఘాట్‌ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

5. గోల్నాక- కృష్ణానగర్‌- అంబర్‌పేట గాంధీబొమ్మ వద్ద చేపల మార్కెట్‌ ఏర్పాటు ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు.

6. నారాయణగూడ వద్ద ఆధునిక మార్కెట్‌యార్డు నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడంతో చిరువ్యాపారులు అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2023-11-04T16:01:42+05:30 IST