Insurance Money: బీమా సొమ్ముకు పన్నాగం

ABN , First Publish Date - 2023-01-18T03:26:53+05:30 IST

ఆయనో ప్రభుత్వోద్యోగి! ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లో నష్టపోయి అప్పులపాలయ్యాడు! ఆ అప్పు తీర్చేందుకు భారీ పథకమే వేశాడు!

Insurance Money: బీమా సొమ్ముకు   పన్నాగం

మెదక్‌ జిల్లాలో కారు సహా వ్యక్తి

సజీవ దహనం కేసులో మలుపు

సచివాలయ ఉద్యోగి ధర్మాకు ఆన్‌లైన్‌

బెట్టింగ్‌ వ్యసనం.. భారీగా అప్పులు

రూ.7 కోట్ల బీమాతో తీర్చొచ్చని ప్లాన్‌

కారు పక్కన పెట్రోల్‌ డబ్బాతో డౌట్‌

విచారణలో వాస్తవాలు వెలుగులోకి

పుణెలో నిందితుడి అరెస్ట్‌

సజీవ దహనమైన వ్యక్తి డ్రైవరేనా?

మెదక్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆయనో ప్రభుత్వోద్యోగి! ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లో నష్టపోయి అప్పులపాలయ్యాడు! ఆ అప్పు తీర్చేందుకు భారీ పథకమే వేశాడు! కారులో తాను సజీవదహనమైనట్లుగా సీన్‌ సృష్టిస్తే.. రూ.7 కోట్ల మేర బీమా సొమ్ము వస్తుందని.. ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చేయొచ్చునని భావించాడు! కారులో ఓ వ్యక్తిని దహనం చేసి.. మహారాష్ట్రలోని పుణెకు చెక్కేశాడు!! నిందితుడు మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం వెంకటాపూర్‌ పరిధిలోని భీమ్లా తండాకు చెందిన పాత్‌లోత్‌ ధర్మ. ఆయన సచివాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. బీమా సొమ్ము కాజేసేందుకే ధర్మ, ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వెంకటాపూర్‌ గ్రామ శివారులో ఈనెల 9న పూర్తిగా దగ్ధమైన స్థితిలో ఓ కారు కనిపంచింది.

అందులో ఓ వ్యక్తి సజీవదహనమై ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ కారు... భీమ్లా తండా వాసి, హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో నివాసం ఉంటూ సెక్రటేరియట్‌లో ఉద్యోగం చేస్తున్న ధర్మది ఆయన భార్య నీల నిర్ధారించడం.. వాహనంలో ధర్మ దస్తులు, కూడా ఉండటంతో మృతదేహం ధర్మదిగానే పోలీసులు భావించారు. నీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కారు పక్కన ఓ పెట్రోల్‌ డబ్బా కనిపించడంతో ఘటన ప్రమాదవశాత్తు జరగలేదనే నిర్ధారణకు వచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ధర్మ భార్య నీల సెల్‌ఫోన్‌తో పాటు బంధువుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని కాల్‌ లిస్ట్‌ పరిశీలించారు.

డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకొని అప్పు తీర్చెయ్‌

అప్పటికే ధర్మ మేనల్లుడి కదలికలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. కారు దగ్ధమైన వెంకటాపూర్‌ శివారులో ధర్మ మేనల్లుడు తరచూ కనిపించడాన్ని అనుమానించారు. ఈ క్రమంలో ధర్మ నుంచి భార్య నీల సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌ రావడం పోలీసుల దర్యాప్తును సులువు చేసేసింది. అధికారుల నుంచి తన డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలని.. బీమా డబ్బు రూ.7 కోట్లు వచ్చాక తాను చేసిన అప్పులన్నీ తీర్చాలని భార్యకు ధర్మ మెసేజ్‌ పెట్టాడు. ఆ ఫోన్‌ తమ దగ్గరే ఉండటంతో మెసేజ్‌ చదివిన పోలీసులు, ధర్మ బతికే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఫోన్‌ కాల్‌ ఆధారంగా ధర్మ, పుణెలో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందం పుణెకు వెళ్లి ధర్మను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. బీమా సొమ్ము కోసమే డ్రైవర్‌ను చంపి తాను చనిపోయినట్లుగా ధర్మ నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ధర్మ కారును నడిపిన వ్యక్తి ఎవరు? ఎక్కడి వాడు? అసలు.. కారులో సజీవ దహనమైన వ్యక్తి కారు డ్రైవరేనా? అన్నది తేలాల్సి ఉంది. పూర్తి వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడిస్తామని మెదక్‌ ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని పేర్కొన్నారు.

Updated Date - 2023-01-18T03:26:54+05:30 IST