దుబాయ్ జైలు నుంచి విముక్తి!
ABN , First Publish Date - 2023-09-21T03:52:18+05:30 IST
ఓ హత్య కేసులో 17 ఏళ్లుగా దుబాయ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురిలో ఒకరికి విముక్తి లభించింది. జిల్లాలోని కోనరావుపేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్‌ను ఫరాజ్
17 ఏళ్ల తర్వాత కోనరావుపేట వాసి విడుదలకు అక్కడి కోర్టు అంగీకారం
మరో నలుగురి విడుదలపై సందిగ్ధం
వారి విడుదలకు మంత్రి కేటీఆర్ సుదీర్ఘ కృషి
సిరిసిల్ల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఓ హత్య కేసులో 17 ఏళ్లుగా దుబాయ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురిలో ఒకరికి విముక్తి లభించింది. జిల్లాలోని కోనరావుపేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్‌ను ఫరాజ్ ద్వారా (మానవతా దృక్పథంతో) విడుదల చేసేందుకు బుధవారం అక్కడి కోర్టు అంగీకరించింది. శిక్ష అనుభవిస్తున్న మరో నలుగురిలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్‌కు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేష్, గొల్లెపు నాంపల్లి, శివరాత్రి హన్మంతు ఉన్నారు. వీరి విడుదలపై ఇంకా సందిగ్ధం వీడలేదు. నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు హత్యకేసులో రవి, మల్లేష్, నాంపల్లి, లక్ష్మణ్, హన్మంతు 17 ఏళ్లుగా దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి విడుదల కోసం మంత్రి కేటీఆర్ స్వయంగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లి, ఐదుగురికి క్షమాభిక్ష కోసం రూ.15 లక్షలను షరియా చట్టం ప్రకారం చెల్లించారు. అయితే, నేరం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దుబాయ్ ప్రభుత్వం నిందితులకు క్షమాభిక్షను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇటీవల విదేశీ పర్యటనలో భాగంగా, దుబాయ్ కూడా వెళ్లిన కేటీఆర్ అధికారులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో న్యాయవాది అభ్యర్థన మేరకు అనారోగ్యం, వృద్ధాప్యం తదితర కారణాల రీత్యా కల్పించే ఫరాజ్ కింద లక్ష్మణ్ విడుదలకు న్యాయస్థానం ఆమోదం తెలిపింది. మిగతా నలుగురి విడుదలకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.