ఈదురు గాలులు.. వడగళ్ల వాన

ABN , First Publish Date - 2023-05-30T00:26:36+05:30 IST

మండలంలో సోమవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో గంట పాటు వడగళ్ల వాన కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశుల కింద నుంచి వరద నిలిచి ధాన్యం తడిచింది. వెంకటాపూర్‌ గ్రామంలో గుంటి గణేశ్‌(20) అనే యువకుడు పిడుగు పాటుకు గురై మృతి చెందాడు.

ఈదురు గాలులు.. వడగళ్ల వాన

ఐకేపీ కేంద్రాల్లో తడిచిన ధాన్యం

వెంకటాపూర్‌లో పిడుగు పాటుకు యువకుడు మృతి

మరో వైపు ఠారెత్తిస్తున్న ఎండలు

పేట జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి

తుర్కపల్లి, మే 29: మండలంలో సోమవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో గంట పాటు వడగళ్ల వాన కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశుల కింద నుంచి వరద నిలిచి ధాన్యం తడిచింది. వెంకటాపూర్‌ గ్రామంలో గుంటి గణేశ్‌(20) అనే యువకుడు పిడుగు పాటుకు గురై మృతి చెందాడు. గంధమల్ల, ఇబ్రహీంపూర్‌ గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులతో తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. గంధమల్ల, కోనాపూర్‌ గ్రామాల్లో రైతులు వ్యవసాయ బావుల వద్ద నాలుగు (11కేవీ) ఎల్‌టీ లైన్‌ విద్యుత్‌ స్తంభాలు కూలిపోయినట్లు ట్రాన్స్‌కో ఏఈ భిక్షపతి తెలిపారు. సంగ్యాతండ, వెంకటాపూర్‌, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్‌, కోనాపూర్‌, గంధమల్లలో ఈదురు గాలులతో కూడిన వడగళ్లు కురిశాయి.

వడదెబ్బతో ఇద్దరి మృతి

ఓ వైపు వడగళ్లు కురుస్తుండగా మరోవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఇన్‌వర్టర్‌ బ్యాటరీ పనులు చేసే దద్దనాల చెరువు కాలనీకి చెందిన పఠాన్‌ ముస్తాక్‌ఖాన్‌(74) వడ దెబ్బతో మృతిచెందాడు. అదేవిధంగా దీక్షిత్‌నగర్‌ కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికురాలు పల్లపు మరియమ్మ(60) వడదెబ్బతో సోమవారం మృతిచెందింది.

పిడుగు పాటుకు యువకుడు మృతి

తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌ గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగు పాటు కు గుంటి గణేశ్‌(20) అనే యువకుడు మృతి చెందాడు. లావణ్య, నాగరాజు దంపతుల ఏకైక కుమారుడు గణేశ్‌ ఉదయం గొర్రెలను మేపేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రం భారీ వర్షం కురుస్తుండటంతో తోక చెరువు సమీపంలో ఓ చెట్టు కిందికి గణేశ్‌ వెళ్లాడు. ఆ ప్రాంతానికి సమీపంలో పిడుగు పడటంతో అతడు మృతి చెందాడు.

Updated Date - 2023-05-30T00:26:36+05:30 IST