TS Assembly: అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు.. రచ్చ రచ్చ
ABN , Publish Date - Dec 20 , 2023 | 04:51 PM
తెలంగాణ అసెంబ్లీలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియంలోకి ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. అయితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ‘‘హరీష్ రావుకు గంట సమయం ఇచ్చినా ఇంకా తృప్తిగా లేదు. అబద్ధాలు చెప్పడంలో హరీష్ రావుకు మేనమామ కేసీఆర్ పోలికలు వచ్చాయి. నాకు మంత్రి పదవి రాదని హరీష్ రావు అన్నారు. అది మా అధిష్టానం చూసుకుంటుంది. హరీష్ రావు... నువ్వు ఎంత కష్టపడ్డా నిన్ను సీఎం చేయరు. నీకు అక్కడ న్యాయం జరగదు. నిన్ను తండ్రీకొడుకులు వాడుకోవాల్సినంత వాడుకుంటారు’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన అసెంబ్లీలో దుమారాన్ని రేపాయి. విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ పోడియంలోకి ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. కాగా.. ‘‘ నువ్వు ఎంత అరిచినా నీకు మంత్రి మంత్రి పదవి ఇవ్వరు’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మంగళవారం అసెంబ్లీలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కౌంటర్‌గా రాజగోపాల్ రెడ్డి బుధవారం అసెంబ్లీలోనే ఇచ్చారు.
కాగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను బెదిరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వైఖరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త ఎమ్మెల్యేలను వెల్‌లోకి పంపించడం మంచి పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఆయన పేరు ఎందుకు తీశారని ప్రశ్నించారు.
తనకు సమయం ఇవ్వాలని శాసనసభ వ్యవహారాల మంత్రి చెబితే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమయం ఇవ్వొద్దని స్పీకర్‌ని నియంత్రిస్తున్నారని, ఇదెక్కడి పద్ధతి అని బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘ రాజగోపాల్ రెడ్డి పేరు నేను తీయలేదు. ఆయనే నా పేరు తీసి నా మీద కామెంట్లు చేశారు. మీ పార్టీ లాగా రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి దక్కించుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు’’ అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
హరీశ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: శ్రీధర్ బాబు
మాజీ మంత్రి హరీష్ రావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హరీష్ రావు కొత్త సభ్యులకు ఆదర్శంగా ఉండాలని, స్పీకర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే హరీష్ రావుని బహిష్కరించాల్సి ఉంటుందని శ్రీధర్ బాబు మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇస్తూ.. ఆ కామెంట్స్ తాను చేసినవి కావని, రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని కోమటిరెడ్డి బ్రదర్సే చెప్పారని బదులిచ్చారు. ‘‘ రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటా’’ అని హరీశ్ రావు అన్నారు. సభా నాయకుడి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కలగజేసుకున్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హరీష్ రావుని కోరారు.