Share News

tenant farmers : కౌలు రైతుల గుర్తింపు ఎలా?

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:55 AM

రైతు భరోసా పథకాన్ని భూ యజమానులతోపాటు కౌలు రైతులకు కూడా అమలు చేస్తామన్నారు.

tenant farmers : కౌలు రైతుల గుర్తింపు ఎలా?

21 లక్షల మంది కౌలుదారులున్నట్లు అంచనా

ఇందులో అసలు భూమి లేనోళ్లు 14 లక్షల మంది

కొంత భూమి ఉండి.. కౌలుచేసే రైతులు 7 లక్షలు

వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా..!

ప్రజాపాలన దరఖాస్తులో ప్రత్యేక కాలమ్‌

స్వయంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం

ఆ తర్వాత గ్రామసభల్లో కౌలురైతుల గుర్తింపు

2024 వానాకాలం నుంచి రైతుభరోసా అమలు!

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా పథకాన్ని భూ యజమానులతోపాటు కౌలు రైతులకు కూడా అమలు చేస్తామన్నారు. ప్రజాపాలన గ్రామసభల్లో కౌలు రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. కానీ, కౌలు రైతులను ఎలా ఎంపిక చేస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం ప్రభుత్వం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తే.. పట్టాదారులు అంగీకరిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే రాష్ట్రంలో అమలు చేసే ఏ సంక్షేమ పథకానికైనా లబ్ధిదారులను గ్రామసభల్లోనే ఎంపిక చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను కూడా గ్రామసభల్లోనే చేపట్టే అవకాశం ఉంది. రైతుబంధుకు సీలింగ్‌ పెట్టాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో.. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. అయితే రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చించే క్రమంలో కౌలు రైతుల అంశాన్ని కూడా చర్చించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించి, మళ్లీ నాలుగు నెలల తర్వాత నిర్వహించే గ్రామసభల్లో లబ్ధిదారులను ఖరారు చేసే అవకాశాలున్నాయి.

కౌలు రైతులకు ప్రత్యేక కాలమ్‌

ప్రస్తుతం అభయహస్తం దరఖాస్తు పత్రంలోనూ కౌలు రైతులకు ప్రత్యేక కాలమ్‌ కేటాయించారు. ఎవరికి వారు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న రైతుల్లో 30 శాతం మంది కౌలు రైతులు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తం 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా.. సుమారు 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. వీరిలో 14 లక్షల మంది కౌలు రైతులు సెంటు భూమి కూడా లేనివారని, మరో 7 లక్షల మందికి సొంత భూమి కొంత ఉన్నా.. మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారని అధ్యయనాల్లో తేలింది. కానీ, వీరికి సంబంధించి రెవెన్యూశాఖ వద్దగానీ, వ్యవసాయశాఖ వద్దగానీ అధికారిక లెక్కలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ లెక్కలు తేల్చే దిశగా ప్రక్రియ మొదలుపెట్టింది. రాష్ట్రంలో మొత్తం కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఈ మొత్తం విస్తీర్ణానికి రైతు బంధు పంపిణీ చేస్తోంది. దీనిని ఎకరానికి రూ.15 వేలకు పెంచితే ఏడాదికి రూ.22,500 కోట్ల నిధులు అవసరమవుతాయి. కాగా, ఈ కోటిన్నర ఎకరాల్లో.. కోటి ఎకరాలు స్వయంగా పట్టాదారులే సాగుచేస్తుండగా, సుమారు 45 లక్షల ఎకరాలు కౌలు రైతులు సాగుచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తే.. పట్టాదారులు అంగీకరిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించే పథకాన్ని దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో లబ్ధిదారులను ఎలా ఎంపిక చేశారనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసే అవకాశాలున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో కౌలురైతులకు కార్డులు..

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు 2004-2014 మధ్యకాలంలో కౌలు రైతులకు ‘ఎల్‌ఈసీ’(లోన్‌ ఎలిజిబిలిటీ కార్డులు)లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ కార్డులు బ్యాంకులో పంట రుణాలు తీసుకోవటానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కూడా కౌలు రైతులను ఎంపికచేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో జరుగుతున్న కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట ప్రకారం, ఇరువర్గాల మధ్య అవగాహనతోనే కొనసాగుతున్నాయి. స్టాంపు కాగితంపైనో, తెల్లకాగితంపైనో ఒప్పందం రాసుకునే పరిస్థితులు లేవు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం భూ ఆధీకృత చట్టం-2011ను తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం కౌలు రైతులకు భూమిపై ఎలాంటి హక్కు ఏర్పడదు. కానీ, పంట రుణాలు, పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కౌలుదారులకు సంక్రమిస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ చట్టాన్ని తెలుగు రాష్ట్రాలు అన్వయించుకున్నాయి. కానీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయలేదు.

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హామీ..

కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ మేరకే ప్రజాపాలన గ్రామసభల్లో స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో.. కౌలు రైతులు స్వయంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ విధానాన్ని రైతుసంఘాలు, అధ్యయన వేదికలు స్వాగతిస్తున్నాయి. మండల తహశీల్దారుకు ఈ బాధ్యత అప్పగించి, గ్రామసభ ఆమోదంతో కౌలు రైతులకు గుర్తింపుకార్డులు జారీచేసే అధికారం ఇవ్వాలని సూచిస్తున్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, కశ్మీర్‌లో కౌలు చట్టాలు అమలు జరిగాయి. పంజాబ్‌లో కూడా కొంతమేరకు అమలు జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో కౌలు చట్టాలు చేసినా.. వాటిని అమలు చేయటంలేదు. ఈ పరిస్థితిని గమనించి 2016 మార్చి 31 న ’నీతి ఆయోగ్‌‘(ప్రణాళిక సంఘం) నిపుణుల కమిటీ వేసి ‘‘భూ కౌలు చట్టం’’ రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆమోదం కోసం పంపించింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆమోదించాయి. కాగా, భూ కౌలుచట్టం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చేసిన 2011 చట్టానికి దగ్గరగానే ఉంది. కానీ, తెలుగు రాష్ట్రాలు ఈ చట్టాలను అమలు చేయలేదు. ఇదిలా ఉండగా తొలుత పూర్తిస్థాయి కౌలుదారులు (ఏమాత్రం భూమిలేనివారు), తర్వాత పాక్షిక కౌలుదారులు(సొంత భూమితోపాటు కౌలుచేసే రైతుల)ను పరిగణనలోకి తీసుకొని రైతు భరోసా అమలు చేయాలనే అభిప్రాయాలు కూడా రైతుసంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 30 , 2023 | 02:55 AM