తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డా బీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2023-04-07T02:48:43+05:30 IST

తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డా బీఆర్‌ఎస్‌

తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డా బీఆర్‌ఎస్‌

బండి సంజయ్‌పై అక్రమ కేసులు: కిషన్‌రెడ్డి

కక్షతోనే సంజయ్‌పై కేసు: రఘునందన్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యతిరేక శక్తులకు అడ్డా బీఆర్‌ఎస్‌ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ వద్దన్న మజ్లి్‌సతో బీఆర్‌ఎస్‌ అంటకాగుతోందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలూ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే.. తామే తెచ్చామన్నట్టుగా కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను గురువారం కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బండి సంజయ్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఎమ్మెల్యే ఈటలకు సాయంత్రం ఐదు గంటలకు నోటీసు ఇచ్చి ఆరు గంటలకు హాజరుకావాలంటారా?అని మండిపడ్డారు. ‘మేమేమైనా మీ జీతగాళ్లమనుకుంటున్నారా? మీ కుటుంబానికి బానిసలనుకుంటున్నారా?’’ అని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయకుంటా అడ్డుకుంటాం అని చెప్పారు. రాజకీయ కక్షతోనే బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. తన వైఖరిని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ ద్వారా చెప్పించిందని పేర్కొన్నారు. బుధవారం తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని రఘునందన్‌ స్పష్టం చేశారు.

పిచ్చోడి చేతిలో రాయిలా.. కేసీఆర్‌ చేతిలో అధికారం: అరుణ

పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం కేసీఆర్‌ చేతిలో అధికారం ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కక్ష సాధింపులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి సంజయ్‌పై మోపిన అక్రమ కేసులే నిదర్శనమని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ సందర్భంగా ఏం జరిగిందో కవిత.. ఒక్క మాటైనా బయట చెప్పారా? అని ప్రశ్నించారు. ఏదో పతకాలు సాధించినట్లు వాడేసిన ఫోన్లను మీడియాకు చూపించారే తప్ప, వాటి గురించి ఏమైనా చెప్పారా? అని నిలదీశారు.

Updated Date - 2023-04-07T02:48:43+05:30 IST