Secunderabad: మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2023-07-09T07:41:43+05:30 IST

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు.

Secunderabad: మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించానన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, 2014 నుంచి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తోందన్నారు. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు. ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి తలసాని వెల్లడించారు.

బోనాలు సమర్పిస్తున్న మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ జాతరకు 1500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తుతోపాటు సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెల్లవారు జాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంక్షలు విధించామని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు మంత్రి తలసాని సూచించారు.

Updated Date - 2023-07-09T07:41:43+05:30 IST