REVANTHREDDY: ఓట్ల కోసమే హనుమ జపం

ABN , First Publish Date - 2023-03-07T02:02:10+05:30 IST

‘‘త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. దొరల గడీల్లో బందీగా ఉంది. ఆ గడీలను బద్దలు కొట్టి తల్లి తెలంగాణ ను విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

REVANTHREDDY: ఓట్ల కోసమే   హనుమ జపం

కాంగ్రెస్‌ గెలిచాక కొండగట్టు అభివృద్ధి

రైతు సంక్షేమానికి చర్యలు: రేవంత్‌

జగిత్యాల/గంగాధర, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ‘‘త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. దొరల గడీల్లో బందీగా ఉంది. ఆ గడీలను బద్దలు కొట్టి తల్లి తెలంగాణ ను విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో సోమవారం ఆయన పర్యటించారు. తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొడిమ్యాల మండలం పోతారం జలాశయాన్ని పరిశీలించారు. సాయంత్రం చొప్పదండి నియోజకవర్గంలోని మధురానగర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కరీంనగర్‌ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్‌ ఇక్కడి ప్రజల నిరసనతో పాలమూరుకు వలస పోయిండని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు, నియామకాలు, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఫలితంగా తొమిదేళ్లలో రెండు లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. బండి సంజయ్‌ ఎంపీగా ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు.

కరీంనగర్‌లో సభ పెట్టుకుందామంటే.. పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇక్కడ సభ జరగనివ్వకుంటే.. సీఎం కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. చొప్పదండి గడ్డ నుంచి రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలను అడుగుతున్నానని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని కోరారు. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత... ఓట్ల కోసమే రామ జపం, హనుమ జపం చేస్తున్నారని, భక్తి ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేవుడినీ మోసం చేసే పార్టీ బీఆర్‌ఎస్‌ అని ధ్వజమెత్తారు. కొండగట్టులో 125 అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని పెట్టిస్తానని హామీ ఇచ్చిన కవిత.. ఆ సంగతే మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అద్భుత రీతిలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని భరోసాఇచ్చారు. కాగా, ఇస్లాంపూర్‌కు చెందిన బీడీ కార్మికురాలు బీపాషా రేవంత్‌రెడ్డి ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇస్తానని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

9న కరీంనగర్‌లో బహిరంగ సభ

హైదరాబాద్‌: రేవంత్‌ పాదయాత్రలో భాగంగా ఈ నెల 9న కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. సభకు ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేష్‌ భఘేల్‌ హాజరవుతారని చెప్పారు.

రేవంత్‌రెడ్డి రాత్రి బస వద్ద భద్రత పెంచండి: హైకోర్టు

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పాదయాత్ర సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బస చేసే ప్రాంతాల్లో భద్రత పెంచాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. అయితే రేవంత్‌ వ్యక్తిగత భద్రత అంశంపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. పిటిషనర్‌ ఎంపీ కాబట్టి ఇప్పటికే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారని తెలిపింది. పాదయాత్ర ముగిసే వరకు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని తెలిపింది. బీఆర్‌ఎస్‌ నాయకులు తనపై దాడులకు తెగబడుతున్నారని, తనకు కల్పిస్తున్న రక్షణను మరింత పెంచాలని కోరుతూ రేవంత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రూపేందర్‌ వాదనలు వినిపిస్తూ మొత్తం 69మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. పిటిషనర్‌ ఎంపీ అయినందున 2+2 గన్‌మెన్‌ ఉన్నారని చెప్పారు.

Updated Date - 2023-03-07T02:02:10+05:30 IST