పెరిగిన భూగర్భజలాల నీటి మట్టం
ABN , First Publish Date - 2023-06-08T01:26:01+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భజలాల నీటి మట్టం ఆరు మీటర్లు పెరిగిందని కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన నీటి పారుదల శాఖ నియోజకవర్గ విజయోత్సవంలో మాట్లాడారు. 2014కు ముందున్న సాగు, తాగు నీటి కష్టాలు సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డాక తీరాయన్నారు.
భువనగిరి టౌన్, జూన్ 7: కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భజలాల నీటి మట్టం ఆరు మీటర్లు పెరిగిందని కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన నీటి పారుదల శాఖ నియోజకవర్గ విజయోత్సవంలో మాట్లాడారు. 2014కు ముందున్న సాగు, తాగు నీటి కష్టాలు సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డాక తీరాయన్నారు. జిల్లాలోని చెరువులన్నీ సీజన్‌తో నిమిత్తం లేకుండా కళకళలాడు తున్నాయని, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో నీటి పారుదల శాఖది గణనీయ పాత్ర అన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బస్వాపూర్ ప్రాజెక్ట్ జిల్లాకు వరమన్నారు. గతంలో తాగునీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. వర్షాలు కురవకుంటే పంట పొలాలన్నీ ఎండిపోయేవని కానీ నేడు ఆ సమస్య తీరిందన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికి ఉద్యమ నేతగా కేసీఆర్ నిర్ధేశనం చూపారని అన్నారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్, మునిసిపల్, గ్రంఽథాలయ, మార్కెట్ చైర్మన్లు ఎనబోయిన ఆంజనేయులు, డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, ఎడ్ల రాజేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య, జడ్పీసీఈవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
జనం కోసం నిరీక్షణ
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం భువనగిరిలో నీటి పారుదల శాఖ విజయోత్సవం షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30గంటలకు ప్రారం భం కావాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 12.30గంటల వరకు కూడా కనీస సంఖ్యలో రైతులు, ప్రజలెవరూ రాకపోవడంతో సమావేశం హాల్ ఖాళీ సీట్లతో బోసిపోయింది. దీంతో ప్రజలను రప్పించేందుకు అధికారు లు తంటాలు పడ్డారు.
ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పండగ నిర్వహించాలి
భువనగిరి అర్బన్: చెరువుల పండగను ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పథి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో చాటింపు వేయాలని, ఉదయం 11గంటలకు జరిగే పూజ కార్యక్రమాలకు ప్రత్యేక అధికారులు పాల్గొనాలని సూచించారు. సాయంత్రం 4గంటలకు చెరువుల వద్దకు ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించాలని సూచించారు. చెరువుల వద్ద భద్రత ఏర్పాట్లు చేసి ఈతగాళ్లను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పాల్గొన్నారు.