Share News

Inquiry into leakages : లీకేజీలపై విచారణ

ABN , Publish Date - Dec 15 , 2023 | 04:03 AM

టీఎ్‌సపీఎస్సీ పేపర్ల లీకేజీల వ్యవహారాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Inquiry into leakages : లీకేజీలపై విచారణ

సిటింగ్‌ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్‌ వేస్తాం

కొత్త టీఎస్‌పీఎస్సీతో ఉద్యోగ నియామకాలు

కొత్త కాన్వాయ్‌ కొనను.. సొంత కారే వాడుతున్నా

నిజాయితీపరులైన అధికారులకే కీలక పోస్టింగ్‌లు

మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేతపత్రాలు

ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీసీలో అతిథి భవనం

ఒక్క ప్రజాభవన్‌ ఆవరణలోనే అనేక భవనాలు

డిఫ్యూటీ సీఎం నివాసం, ప్రజావాణితోపాటు

సీఎం క్యాంప్‌ ఆఫీసు, గెస్ట్‌హౌస్‌కు ఉపయోగిస్తాం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసమూ ఒక భవనం

పార్లమెంటు తరహాలో అసెంబ్లీలో సెంట్రల్‌ హాలు

మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుకునేలా ఏర్పాట్లు

రాయదుర్గం మెట్రో ప్లాన్‌ అనుకూలమైనది కాదు

అధిష్ఠానంతో మాట్లాడాక మంత్రివర్గ విస్తరణ

మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సపీఎస్సీ పేపర్ల లీకేజీల వ్యవహారాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరపాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అన్నారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు. ఇప్పటికే టీఎ్‌సపీఎస్సీ అవకతవకలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్ల లీకేజీపై హైకోర్టులో కేసు నడుస్తోంది. గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామని, పలువురిని అరెస్టు కూడా చేశామని పేర్కొంది. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్లీ ప్రభుత్వ వైఖరిని చెప్పేందుకు అవకాశం ఉంది. ఇలా అఫిడవిట్‌ వేసే సందర్భంగా...హైకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం ఆయన శాసనసభలోని తన చాంబర్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీఎ్‌సపీఎస్సీ విషయంలో ఇప్పుడున్న కమిటీతో నియామకాల ప్రక్రియనుముందుకు తీసుకెళ్తే ఉద్యోగార్థులకు నమ్మకం ఉండదని, అందుకే కమిషన్‌ చైర్మన్‌, సభ్యులతో సహా కొత్త వారిని నియమించి.. ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణ చేపడతామన్నారు. మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయిస్తామని తెలిపారు.

సొంత కారు.. పాత కాన్వాయే

ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన సొంత కారులోనే వెళ్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రి వాడిన కాన్వాయ్‌నే ఇప్పుడు తాను కూడా ఉపయోగిస్తున్నానన్నారు. కొత్త కాన్వాయ్‌ను కొనుగోలు చేస్తామని అధికారులు అడిగినా వద్దని చెప్పానన్నారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కారునే ఉపయోగించాలని భద్రతాధికారులు చెప్పడంతో.. తన సొంత కారుకే బుల్లెట్‌ ఫ్రూఫ్‌ స్టిక్కరింగ్‌ చేయాల్సిందిగా చెప్పినట్లు తెలిపారు. కొత్త బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కాన్వాయ్‌ కొనాలంటే మళ్లీ రూ.50 కోట్లు ఖర్చవుతుందని, తాము ఒక్క పైసా కూడా వృథా చేయబోమని అన్నారు. అసలు గతం నుంచి ఉన్న కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను కూడా తగ్గించాలని నిర్ణయించానన్నారు. ఇటీవల సీఎం అయ్యాక ఢిల్లీ వెళ్తే.. అక్కడ తెలంగాణ భవన్‌ నుంచి భోజనం వచ్చిందని ఇంట్లోని వంటమనిషి చెప్పడంతో.. అతణ్ని పని మానేయాల్సి వస్తుందని హెచ్చరించానన్నారు. తాను తన సొంత భోజనమే తింటానని, అతడే వంట చేయాలని, ప్రొటోకాల్‌ వద్దని అన్నారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో అతిథి విడిది భవనం

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీసీ)లో ఒకవైపు ఖాళీగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అక్కడ ఖాళీగా ఉన్న ఒకటిన్నర ఎకరాల స్థలంలో అతిథి భవనం లాంటిది నిర్మిస్తామన్నారు. మంత్రివర్గంలోని సభ్యులకు, ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు వారి కుటుంబసభ్యులతో కలిసి లంచ్‌, డిన్నర్‌ లాంటివి ఇచ్చేందుకు, అదే సమయంలో ఎవరైనా ముఖ్యమైన సందర్శకులు వచ్చినప్పుడు వారిని కలిసేందుకు ఆ అతిథి భవనాన్ని ఉపయోగిస్తామని చెప్పారు. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో ఒక ఆట మైదానాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అయితే వీటిలోకి వెళ్లేందుకు ఒక ప్రత్యేక గేటును పెడతామన్నారు. మరోవైపు ప్రగతి భవన్‌కు ఇప్పటికే పేరు మార్చి మహాత్మా పూలే పేరు పెట్టామని, అక్కడ ఒక మందిరంలో ప్రజావాణి నిర్వహిస్తున్నామని, గత సీఎం కేసీఆర్‌ ఉన్న భవనాన్ని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించామని వివరించారు. ఇంకా అక్కడ ఇంకో భవనం, మరో రెండు పాత భవనాలు కూడా ఉన్నాయన్నారు. ఒక భవనాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయంగా ఉపయోగిస్తామని, రెండు పాత భవనాల్లో ఒకదానిలో గతంలో సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రులు ఉండేవారని..

దానిని ఇప్పుడు ఒక మంత్రికి కేటాయించడమో, ఎవరైనా అతిథులు వస్తే ఉండేందుకు గెస్ట్‌హౌ్‌సగా ఉపయోగించడమో చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న మరో భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న శాసనసభ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని, పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో కౌన్సిల్‌ సమావేశాలు, ప్రస్తుతం అసెంబ్లీ భవనంలోనే శాసనసభను నిర్వహిస్తామని తెలిపారు. కొత్తగా ఎలాంటి భవనాలూ నిర్మించబోమని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ ప్రాంగణాన్ని పార్లమెంటు తరహాలో తీర్చిదిద్దుతామని, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకునేందుకు వీలుగా సెంట్రల్‌ హాల్‌ను ఏర్పాటుచేస్తామని అన్నారు. సెంట్రల్‌హాల్‌లోకి పరిమిత సంఖ్యలో మీడియాకు అనుమతి ఉంటుందన్నారు.

ఆ మార్గంలో మెట్రోతో నిధుల వృథా..

మెట్రో రైలు విస్తరణకు రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు మార్గం సరైనదికాదని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు. అందుకే ఎయిర్‌పోర్టు మెట్రోలైన్‌ రూట్‌ను మార్చబోతున్నామని, పాతబస్తీ ప్రాంతం మీదుగా ఎయిర్‌పోర్టుకు తక్కువ దూరంలో చేరుకోవచ్చని అన్నారు. పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి 25 కిలోమీటర్లేనని, అదే రాయదుర్గం నుంచి అయితే 50కిలోమీటర్లు అవుతుందని తెలిపారు. దూరం పెరగడం వల్ల నిధులు వృథా అవుతాయని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ మెట్రో ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఇక గత ప్రభుత్వం వ్యవసాయానికి కరెంటు 12, 13 గంటలకు మించి ఇవ్వలేదని చెప్పారు. ఈ అంశంపై అందరితో చర్చించి సమయం వచ్చినపుడు శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జవహర్‌లాల్‌ నెహ్రు జర్నలిస్టు సొసైటీకి భూమి అప్పగించాలని కోరగా.. ఈ అంశంపై తనకు ఐడియా ఉందని, మంత్రులతో కూడా మాట్లాడి విషయం చెబుతానన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 54 కార్పొరేషన్ల చైౖర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చామని, మరో ఇద్దరు చైర్మన్‌లు మిగిలిపోయారని, వారినీ తొలగిస్తూ ఉత్తర్వులిస్తామని అన్నారు.

నిజాయితీ ఉన్న వారికే కీలక పోస్టింగ్‌లు..

సీఎంవోలో అధికారులకు పోస్టింగ్‌లు, కమిషనర్లుగా ఐపీఎ్‌సల నియామకం విషయంలో వారి ఇంటెగ్రిటీ, నిజాయితీలనే చూశామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వారెవరూ తనను కలిసి పోస్టింగ్‌లు ఇవ్వాలని అడగలేదని, అన్నీ పరిశీలించాక తామే నిర్ణయించామని తెలిపారు. అధికారుల బదిలీలు ఉంటాయని, కానీ వారి వెంటపడేది లేదని చెప్పారు. మీడియా ఆధారాలతో కూడిన వార్తలను ప్రసారం చేస్తే తమకు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. ధరణి విషయంలో తొలుత అధికారులు చెప్పేదంతా పూర్తిగా విన్నామని, తర్వాత ఆ విధానంలో ఉన్న 33 మాడ్యూల్స్‌పైనా ప్రశ్నలు వేశామని తెలిపారు. వాటిలో కొన్నింటికి సమాధానాలు వచ్చాయని, కొన్నింటికి రాలేదని అన్నారు. అందుకే వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించామని, మరోసారి దీనిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

అధిష్ఠానంతో మాట్లాడాకే విస్తరణపై నిర్ణయం..

మంత్రులందరికీ మంచి శాఖలే వచ్చాయన్న సంతృప్తి ఉందని సీఎం రేవంత్‌ తెలిపారు. అందరికీ కీలకమైన శాఖలే దక్కాయన్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందని అడగ్గా...అధిష్ఠానంతో మాట్లాడాకే ఆ విషయం చెప్పగలనన్నారు.

టీహబ్‌, టీవర్క్స్‌లను ఇంతకన్నా గొప్పగా నిర్వహిస్తాం..

టీహబ్‌, టీ వర్క్స్‌లను ఇప్పుడున్న దానికంటే బ్రహ్మాండంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడున్న వారి కంటే సమలను నియమిస్తామన్నారు. టీహబ్‌ను గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కార్యకలాపాలు, నిరుద్యోగులతో ఇంటర్య్వూ కోసం ఉపయోగించారుగా అన్న ప్రశ్నకు...ఆ విషయంలోకి వెళ్తే రాజకీయం అవుతుందని, పగ సాధించేందుకు మాట్లాడుతున్నామని అనుకుంటారని, పగ, ప్రతీకారాలు తమకు లేవన్నారు. వ్యవస్థలను మరింత మెరుగ్గా నడిపించే వ్యూహాలు, పద్దతులు మాత్రం తమ దగ్గర ఉన్నాయన్నారు.

పదేళ్ల తరువాత.. మళ్లీ ఇపుడే..

వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడున్న విలేకరులతో మాట్లాడడం సర్వసాధారణం. అంతేకాదు ఉదయం, సాయంత్రం సమావేశాల్లో ఏ రకమైన అంశాలపై చర్చించనున్నారనే విషయాలను వారు జర్నలిస్టులతో పంచుకునేవారు. ఉమ్మడి ఏపీలో ఈ విధానం అమలులో ఉండేది. ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైయస్సార్‌, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు జర్నలిస్టులతో మాట్లాడడంతో పాటు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించేవారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తరువాత నుంచి గత పదేళ్లలో రాష్ట్ర అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సందర్భాలు లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. సీఎం చాంబర్‌ వైపు వెళ్లేందుకు కూడా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండేది. దీంతో సీఎం సైతం విలేకరులతో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇష్టాగోష్ఠి సంప్రదాయానికి స్వస్తి పలికినట్టైంది. కానీ తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ ఈ సంప్రదాయాన్ని తెరమీదకు తెచ్చింది. సీఎం రేవంత్‌ అసెంబ్లీలోని తన చాంబర్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడడమే కాకుండా, ఆయనను కలిసేందుకు వచ్చిన పలువురు ముఖ్యులు, సందర్శకులను కూడా కలుస్తున్నారు.

Updated Date - Dec 15 , 2023 | 04:03 AM