Share News

Investigation of the police? : ఆ పోలీసులపై విచారణ?

ABN , First Publish Date - 2023-12-11T03:06:48+05:30 IST

తెలంగాణలో కొందరు పోలీసులు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో అంటకాగినట్లు గుర్తించిన కాంగ్రెస్‌ సర్కారు.. అలాంటి వారిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

Investigation of the police? : ఆ పోలీసులపై విచారణ?

బీఆర్‌ఎస్‌తో అంటకాగిన వారిపై నజర్‌..

గులాబీ ఎమ్మెల్యేల సిఫారసులతో బదిలీలు

విచారణకు ఆదేశించిన కాంగ్రెస్‌ సర్కారు!..

పోలీస్‌ శాఖలో త్వరలో భారీగా బదిలీలు

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొందరు పోలీసులు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో అంటకాగినట్లు గుర్తించిన కాంగ్రెస్‌ సర్కారు.. అలాంటి వారిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో ఓ సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని, అదేవిధంగా అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులతో భారీగా బదిలీలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా.. గులాబీ ఎమ్మెల్యేలు తమకు అనుకూల అధికారులను నియోజకవర్గ పరిధిలో బదిలీలు చేయించుకున్నారు. మరికొందరైతే ఓ మెట్టు పైకెక్కి.. తమవారికి పోస్టింగ్‌ రాకుంటే.. ఆ స్థానంలో వచ్చిన వారిని బెదిరించి మరీ, బాధ్యతలు తీసుకోకుండా చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ తరహా బదిలీలు ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ స్థాయుల్లో భారీగా ఉన్నట్లు కాంగ్రెస్‌ సర్కారు గుర్తించింది. ఇక జిల్లాల్లో అయితే ఎస్సై స్థాయి నుంచి అదనపు ఎస్పీ దాకా ఇలాంటి బదిలీలున్నట్లు భావిస్తోంది. ఎన్నికల సమయంలోనూ.. కొందరు అధికారులు బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇతర పార్టీల నేతల ప్రచారపర్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేతలు అప్పట్లో నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశారు.

అందుకు సంబంధించిన ఓ చిట్టాను కూడా ఫిర్యాదుతో జత చేశారు. కొందరు అధికారులపై భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) బదిలీ వేటు వేసింది. ఇప్పుడు మిగతా అధికారుల తీరుపై ఉన్నతస్థాయిలో విచారణకు రేవంత్‌ సర్కారు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విచారణ పూర్తవ్వగానే.. డీజీపీ కార్యాలయం మొదలు.. కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్సీలు, డీఎస్పీ/ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల బదిలీలు భారీగా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రోజున అప్పటి డీజీపీ అంజనీకుమార్‌, మరో ఇద్దరు అధికారులు కోడ్‌ను ఉల్లంఘించి, రేవంత్‌రెడ్డిని కలిసి అభినందించడాన్ని సీరియ్‌సగా తీసుకున్న ఈసీఐ.. డీజీపీని బదిలీ చేసింది. ఏసీబీ చీఫ్‌గా ఉన్న రవిగుప్తాను డీజీపీగా నియమించింది. అదేవిధంగా.. ఎన్నికలకు ముందు హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రం(టీఎ్‌సపీఏ) డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్యను నియమించింది. ఏసీబీ, టీఎ్‌సపీఏ పోస్టులు ఇంకా భర్తీ కావాల్సి ఉంది. ఇవి కాకుండా.. పోలీసు శాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్కారు గుర్తించింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు జరగనుండడంతో.. అన్ని అంశాలను పరిశీలించి.. పోలీసు శాఖలో బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.

Updated Date - 2023-12-11T03:11:21+05:30 IST