YS Jaganmohan Reddy : కడప వాసులకు విమానయానం మూన్నాళ్ల ముచ్చటేనా?

ABN , First Publish Date - 2023-09-02T03:01:53+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కారు నిర్వాకం వల్ల సీఎం సొంత జిల్లావాసులకు విమానయానం మూన్నాళ్ల ముచ్చటగానే మారనుందా? ప్రభుత్వం స్పందించకపోతే అవుననే సమాధానం వస్తుంది.

YS Jaganmohan Reddy : కడప వాసులకు విమానయానం మూన్నాళ్ల ముచ్చటేనా?

20 కోట్ల వీజీఎఫ్‌ చెల్లించకపోతే..రాకపోకలు నిలిపేస్తాం

ఇండిగో హెచ్చరిక

కలెక్టర్‌ చొరవతో ఈ నెల 15 వరకు గడువు

ఆన్‌లైన్‌లో 16 నుంచి అందుబాటులో లేని టికెట్లు

ముఖ్యమంత్రి సొంత జిల్లాకు పట్టిన దుస్థితి

ప్రభుత్వ తీరుపై విమర్శలు

(కడప-ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కారు నిర్వాకం వల్ల సీఎం సొంత జిల్లావాసులకు విమానయానం మూన్నాళ్ల ముచ్చటగానే మారనుందా? ప్రభుత్వం స్పందించకపోతే అవుననే సమాధానం వస్తుంది. ఇండిగో విమానయాన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం మేరకు చెల్లించాల్సిన వయాబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌) చెల్లించలేదు. దీంతో ఈ నెల 1 నుంచే విమాన సర్వీసులు నిలిపివేస్తామని ఇండిగో ప్రకటించింది. చివరికి కలెక్టరు విజయరామరాజు చొరవ తీసుకుని బకాయిల చెల్లింపునకు కాస్త గడువు కోరారు. దీంతో ఈ నెల 15 లోపు చెల్లించకపోతే విమాన సర్వీసులు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో కూడా టికెట్లు ఈ నెల 16 నుంచి అందుబాటులో లేకపోవడం గమనార్హం.

చంద్రబాబు హయాంలో విమానాల రాకపోకలు..

చిన్న పట్టణాల్లో విమాన సర్వీసులను తిప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే 2017లో కడప నుంచి ట్రూజెట్‌ సంస్థ విమాన రాకపోకలను ప్రారంభించింది. అప్పటి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కడప నుంచి విమానాలకు పచ్చజెండా ఊపారు. హైదరాబాద్‌, చెన్నై, విజయవాడలకు రాకపోకలు కొనసాగడంతో అనతికాలంలోనే రికార్డు స్థాయిలో కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికుల రాకపోకలు బాగా పెరిగాయి.

25 ముఖ్య నగరాలతో కనెక్టివిటీ..

కడప, ప్రొద్దుటూరువాసులకు ముంబై, చెన్నై, హైదరాబాద్‌, గుజరాత్‌, సూరత్‌ వంటి ప్రధాన పట్టణాలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయా నగరాలకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఉడాన్‌ పథకం ముగిసినప్పటికీ ట్రూజెట్‌ సంస్థ కడప-హైదరాబాద్‌ మధ్య సర్వీసులు నడిపేది. విమానాలు లేకపోవడంతో ఆ సంస్థ సర్వీసులు నిలిపివేసింది. కొవిడ్‌ ఇతర కార ణాలతో దాదాపు ఆరు మాసాలు కడప నుంచి విమాన సర్వీసులు లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ ఎయిర్‌పోర్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఇండిగో మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చిన్న పట్ట్టణాలకు విమానాలు నడిపితే వచ్చే నష్టాలను రాష్ట్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. ఏటా రూ.20కోట్ల వీజీఎ్‌ఫను రాష్ట్ర ప్రభుత్వం ఇండిగోకు చెల్లించాలి. ఆ ఒప్పందం మేరకు 2022 మార్చి 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభించింది. రోజూ కడప-హైదరాబాద్‌ మధ్య సర్వీసు ఉంటుంది. వారంలో నాలుగు రోజులు విజయవాడ, చెన్నై, మూడురోజులు బెంగళూరు, విశాఖలకు సర్వీసులు ఉంటాయి.

కడప నుంచి దేశంలోని 25 ముఖ్య నగరాలకు వెళ్లేందుకు కనెక్టివిటీ సౌకర్యం ఉంది. దీంతో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, వైజాగ్‌, కొచ్చిన్‌, గోవా, తిరువనంతపురం, మధురై, కోయంబత్తూరు, ముంబై, చండీగఢ్‌, కోల్‌కతా, వారాణసీ, మైసూరు, హుబ్లి, లఖ్‌నవూతో పాటు మరికొన్ని నగరాలకు కనెక్టివిటీ లభించింది. ప్రొద్దుటూరు పట్టణం వాణిజ్యపరంగా రెండో ముంబైగా పేరుగాంచింది. ఇక్కడి బంగారు వ్యాపారులు కడప విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణం చేస్తుంటారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, విదేశాల నుంచి వచ్చిన వారికి, కార్పొరేట్‌ సంస్థలకు కూడా ఈ విమానాశ్రయం కలిసి వచ్చింది. కడప-హైదరాబాద్‌ మధ్య ప్రతిరోజూ సగటున 130 నుంచి 140 మంది ప్రయాణం చేస్తారు. ఇక విజయవాడ, చెన్నై, విశాఖ, బెంగళూరు తదితరాలు కలుపుకొని రోజూ దాదాపు 350 మంది పైచిలుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే జిల్లా వాసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడంతో కడప నుంచి నేరుగా గల్ఫ్‌ దేశాలకు కూడా విమాన ప్రయాణం చేయవచ్చని జిల్లావాసులు సంబరపడ్డారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు చెల్లించకపోవడంతో ఇక్కడి నుంచి విమానాలే బంద్‌ కానుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2023-09-02T03:01:53+05:30 IST