Share News

Janga Raghava Reddy: ప్రత్యేక రాష్ట్రం ఒక్క కుటుంబానికే పరిమితం..

ABN , First Publish Date - 2023-10-13T13:19:05+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఎవడి పాలయ్యిందిరో.. దొరల పాలయ్యిందిరో అన్నట్టుంది ఇక్కడి ప్రజల పరిస్థితి అని డీసీసీబీ మాజీ చైర్మెన్‌ జంగా రాఘవరెడ్డి(Janga Raghava Reddy)

Janga Raghava Reddy: ప్రత్యేక రాష్ట్రం ఒక్క కుటుంబానికే పరిమితం..

- రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ డ్రామాలు

- డీసీసీబీ మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి

హనుమకొండ: తెలంగాణ రాష్ట్రం ఎవడి పాలయ్యిందిరో.. దొరల పాలయ్యిందిరో అన్నట్టుంది ఇక్కడి ప్రజల పరిస్థితి అని డీసీసీబీ మాజీ చైర్మెన్‌ జంగా రాఘవరెడ్డి(Janga Raghava Reddy) మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇస్తే.. నేడు కేసీఆర్‌ కుటుంబం తామే తెచ్చామని చంకలు గుద్దుకుంటోందని దుయ్యబడ్డారు. గ్రేటర్‌ వరంగల్‌ 5వ డివిజన్‌ కేయూ రోడ్డులోని శారద గార్డెన్స్‌లో గురువారం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన (6) గ్యారెంటీ పథకాలపై మహిళల కు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ మళిదశ ఉద్యమంలో 1400 మంది ఉద్యమకారులు అమరులైతే తెలంగాణ ఎవడిపాలైంది అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఒక్క పక్కా ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వరంగల్‌ పశ్చిమలో ఇప్పటివరకు ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చారో బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. వరదలు వస్తే ప్రజలను కాపాడలేని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్‌.. పేదల ఓట్లను చేజిక్కించుకునేం దుకు ప్రతీ కాలనీ పర్యటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే సబ్సిడీ పథకాలు మొదలయ్యాయని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ పశ్చిమలో తనను గెలిపిస్తే సొంత ఖర్చులు రూ.50కోట్లతో అన్ని సౌకర్యాలతో కూడిన ఆస్పత్రి నిర్మించి ప్రజలకు ఉచితంగా సేవలందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు కొడిపాక గణేశ్‌కుమార్‌, డివిజన్‌ మహిళా అధ్యక్షురాలు గండ్ల శ్రవంతి, కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌, విజయశ్రీ రజాలి, నాయకులు కట్ల శ్రీనివాస్‌, అర్షం అశోక్‌, కత్తుల కవిత, రంగనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-13T13:19:05+05:30 IST