Telangana Elections: నా మాట విని ఓటు వేయనందుకు థాంక్స్.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-11-30T16:19:39+05:30 IST
KA Paul: ఎన్నికలు వచ్చినప్పుడు ‘ఓటు హక్కును వినియోగించుకోవాలని, భవిష్యత్తుని మెరుగ్గా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న నాయకుడికి మాత్రమే ఓటు వేయాలని’ ప్రతిఒక్కరూ పిలుపునిస్తారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని..
Telangana Elections 2023: ఎన్నికలు వచ్చినప్పుడు ‘ఓటు హక్కును వినియోగించుకోవాలని, భవిష్యత్తుని మెరుగ్గా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న నాయకుడికి మాత్రమే ఓటు వేయాలని’ ప్రతిఒక్కరూ పిలుపునిస్తారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని, తప్పకుండా ఓటు వేయాలని కోరుతారు. కానీ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాత్రం అందుకు భిన్నంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటు హక్కుని వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలన్నీ ఖాళీగా ఉన్నాయని, ఓటు వేయడానికి ఎవ్వరూ రాలేదని కుండబద్దలు కొట్టారు. ఓటు వేయొద్దని, ఇంట్లోనే ఉండాలని తానిచ్చిన పిలుపు మేరకు ఏ ఒక్కరూ ఓటు వేయలేదని, అందుకు తాను థాంక్స్ చెప్తున్నానని బాంబ్ పేల్చారు.
కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజాశాంతి పార్టీకి అనుమతి ఇవ్వలేదు. గత సంవత్సరం మునుగోడు ఉపఎన్నికల్లోనూ ఇదే జరిగింది. యాక్టివ్‌గా ఉన్న పార్టీని ఉద్దేశపూర్వకంగానే ఇనాక్టివ్ చేశారు. అందుకే.. ఓటు వేయొద్దని నేను అనేకసార్లు పిలుపునిచ్చాను. నూటికి 79 శాతం ప్రజలు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటుంటే.. యాక్టివ్ లేదని మన అభ్యర్థులకు పోటీ చేసే అనుమతి ఇవ్వలేదు. ఫైనల్‌గా మేము పోరాడితే.. ఐదు మందికి మాత్రమే ‘రింగు’ గుర్తు ఇచ్చారు. ఈరోజు మన కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఎవ్వరూ ఓట్లు వేయొద్దు, ఇంట్లోనే ఉండండి. ఒకవేళ ఓటు వేస్తే, నాలాగే ‘నోటా’కు ఓటు వేయండి. ఈరోజు ఓట్లు వేయడానికి ఎవరూ రాలేదు. నా మాట విని ఓట్లు వేయనందుకు అందరికీ థాంక్స్ చెప్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా.. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ముఖ్యంగా.. హైదరాబాద్‌లో అత్యల్ప పోలింగ్ నమోదు అవుతోంది. ప్రతిఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా సెలవు ప్రకటిస్తే.. నగరవాసులు మాత్రం ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంట్లోనే కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. అదేదో విశ్రాంతి కోసం సెలవు ఇచ్చినట్లు.. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో.. నగరంలోని రోడ్లు, పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.