Share News

‘కాళేశ్వరం’ కేసీఆర్‌కు ఏటీఎం

ABN , First Publish Date - 2023-11-27T03:36:43+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఆ ప్రాజెక్టు సీఎంకు ఏటీఎంల మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.

‘కాళేశ్వరం’ కేసీఆర్‌కు ఏటీఎం

ప్రాజెక్టులో భారీగా అవినీతి

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

కాంగ్రెస్‌ అంటే కమీషన్‌,కరప్షన్‌ పార్టీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

హైదరాబాద్‌ సిటీ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఆ ప్రాజెక్టు సీఎంకు ఏటీఎంల మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ, కూకట్‌పల్లిలో సకల జనుల విజయ సంకల్ప సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నడుపుతున్న బీఆర్‌ఎ్‌సను ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ అంటే భ్రష్టాచార్‌ రాష్ట్ర సమితి అని, కాంగ్రెస్‌ అంటే కమీషన్‌, కరప్షన్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు తెలంగాణను దోచుకుంటున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ముందుకెళ్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానన్న సీఎం మాట తప్పారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌ రెడ్డిని, కూకట్‌పల్లిలో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఏపీలో జనసేన గెలుపునకు కూకట్‌పల్లిలో బీజం పడాలి: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జనసేన గెలుపునకు కూకట్‌పల్లి నుంచే బీజం పడాలన్నారు. జాతీయ పార్టీతో కలిసి పనిచేస్తేనే జనసేన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. పార్టీలు మారే నాయకులను నమ్మొద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు. తెలంగాణలో బీసీని సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమని, అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మెజార్టీ సీట్లు గెలిపిస్తే బీసీ సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. సభలో టీడీపీ జెండాలు కనిపించడం పట్ల పవన్‌కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-27T03:36:44+05:30 IST