CM KCR : అన్నిచోట్లా కేసీఆరే!
ABN , First Publish Date - 2023-10-27T03:03:04+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులంతా కేసీఆర్‌లేనని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

119 నియోజకవర్గాల్లో బరిలో ఉన్నది నేనే
ఒకడు కొడంగల్ రమ్మంటడు.. ఇంకొకడు గాంధీ బొమ్మ దగ్గరకు రమ్మంటడు
నేడు సవాళ్లు విసురుతున్న నేతలు నేను ఉద్యమం చేస్తున్న సమయంలో ఎక్కడున్నరు?
ధరణి లేకపోతే భూముల్ని కాపాడలేం.. పైసాపైసా కూడబెట్టి పథకాలు నడిపిస్తున్నం
రైతుబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్.. అహంకారపు రాజగోపాల్‌ను ఓడించాలి
కర్ణాటకలో 5 గంటలకు మించి కరెంటురాదు.. ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్
3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన.. మునుగోడు సభకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల డుమ్మా
అచ్చంపేట/వనపర్తి/నల్లగొండ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులంతా కేసీఆర్‌లేనని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘‘ఒకడు కొడంగల్ రమ్మంటడు.. ఒకడు గాంధీ బొమ్మ దగ్గరికి రమ్మంటడు.. నీ దమ్ము.. నా దమ్ము ఏందో చూసుకుందామంటరు.. 119 నియోజకవర్గాల్లో ఉన్నది కేసీఆర్‌లే.. వనపర్తి కేసీఆర్ నిరంజన్‌రెడ్డి’’ అని వ్యాఖ్యానించారు. 24 సంవత్సరాల క్రితం పిడికెడు మందితో ఉద్యమం మొదలు పెట్టి పక్షుల్లా తిరుగుతుంటే ప్రస్తుతం అవాకులు, చెవాకులు పేలుతున్న నాయకులు ఆ నాడు ఎవరి బూట్లు మోస్తున్నరో జనం గమనించాలన్నారు. గురువారం ఆయన నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రం, నల్లగొండ జిల్లా మునుగోడుల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గత పదేళ్లలో తాము చేసిన పనులపై, సభల్లో తాను చెప్పే మాటలపై గ్రామాల్లో, బస్తీల్లో చర్చ జరపాలని సూచించారు. చావునోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చుకున్నామని, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని.. వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిగా చేసుకున్నామని అన్నారు. కల్వకుర్తి పూర్తి చేసుకున్నామని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల మోటార్‌ను ఆన్ చేసుకున్నామని చెప్పారు. భవిష్యత్‌లో శ్రీశైలం నుంచి ఉదండాపూర్ వరకు మోటార్లు పంపింగ్ జరిగితే ఒక నది ప్రవాహం కంటే ఎక్కువ నీరు పారుతుందని అన్నారు. ఇప్పుడు పాలమూరు జిల్లా గంజి కేంద్రం పెడితే గుంజి కొడతం అనే స్థాయికి ఎదిగిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల్లో మంత్రులైన వారు పాలమూరు జిల్లాకు ఒక్క వైద్య కళాశాల తేలేక పోయారని, ఇప్పుడు ఐదు వచ్చాయని చెప్పారు. దళితబంధు, మైనారిటీ బంధు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పిల్లల్ని వజ్రాల్లా తీర్చిదిద్దామన్నారు. అబద్ధపు హామీ ఇవ్వడం లేదని, వృద్ధాప్య పెన్షన్‌ను ఐదేళ్లలో ఐదు వేలకు తీసుకెళ్తామని చెప్పారు. తన ప్రభుత్వం కడుపు నోరు కట్టుకొని పైసా పైసా కూడి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
రైతుల దర్వాజలు తీసుకుపోవుడే తప్ప రైతుకు సాయం చేసినోడు లేడని, రైతుబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో 20 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు గంటలకు మించి ఇవ్వకపోవడంతో అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారన్నారు. రైతు భూమిపై అందరి పెత్తనం తొలగించి, రైతు బొటనవేలుతో తప్ప ఎవరూ రికార్డులను మార్చలేని విధంగా ధరణి తెచ్చామని, దాన్ని రద్దు చేస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని కేసీఆర్ ప్రస్తావించారు. పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ప్రమాదమని హెచ్చరించారు. కోర్టు కేసులు, తలకాయలు పగులగొట్టుకునుడు, హత్యలు, ఆత్మహత్యలు ఉండేవన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానాలు చేసి పంపిస్తే మోదీ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం చలించడం లేదని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని రైతుబంధును పుట్టించిందే తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో 60 లక్షల టన్నుల ధాన్యం పండితే తెలంగాణ వచ్చిన తర్వాత 3 కోట్ల టన్నులకు పెంచామని చెప్పారు. ఽభగీరథుడు అని తనకు బిరుదు ఇచ్చినందుకు అచ్చంపేట నియోజకవర్గంలో లక్షా 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. 1969లో కాంగ్రెస్ 400 మంది తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిందని, తనను పదేళ్లు ఏడిపించారని, చావునోట్లో తలకాయ పెట్టి 32 పార్టీల మద్దతుతో తెలంగాణను సాధించానని ప్రస్తావించారు. గెలుపించుకుంటారో అగం చేసుకుంటారో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. వ్యక్తిగతంగా ఓడగొడితే తమకు ఒరిగేదేమీ లేదని, ప్రజలే నష్టపోతారన్నారు.
సముద్ర మట్టానికి 682 మీటర్ల ఎత్తులో ఉన్న అమ్రాబాద్, పదర మండలాలకు నీరు ఎలా పారుతుందని అధికారులు అడిగితే 1000 మీటర్లు ఎత్తులో ఉన్న రైతులకు కూడా సాగునీరు అదించాలని స్పష్టం చేశానన్నారు. తన దమ్ము దేశమంతా చూసిందని, కాంగ్రెస్ లెక్క కాదని చెప్పారు. రోజుకో పార్టీ మారి ధన మదం, అహంకారంతో వస్తున్న రాజగోపాల్‌రెడ్డికి సరైన రీతిలో సమాధానం చెప్పాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏనాడు ఉద్యమంలో కలిసిరాని వారు, ఎక్కడా కనబడని వారు కరెంటు సమస్యను, ఎండిన పంటలను, ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోని వారు తనను సవాల్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడు రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతమని, సిద్ధాంతం లేని డబ్బు, మదం, అహంకారంతో ప్రజలను కొనుగోలు చేయాలనుకుంటున్న నేతలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం పూర్తి చేశానన్నారు. ఓటు తల రాతను మారుస్తుందని, ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. రేషన్ కార్డుదారుందరికీఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం సరఫరా చేస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడని వారికి ఓటు వేయవద్దని సూచించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా శివన్నగూడెం వరకు నీటిని తీసుకువచ్చే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని క్లియరెన్స్‌లు వచ్చాయని కోర్టుల్లో కేసులు కూడా కొట్టేశారని, డిండి నుంచి శివన్నగూడెంకు సాగునీరు తీసుకువచ్చి మునుగోడు నియోజకవర్గంలోని 2 లక్షల ఎకరాలకు ఏడాదిన్నరలోనే సాగు నీరు అందిస్తామన్నారు. మునుగోడులో 9 నిమిషాల్లోనే సీఎం ప్రసంగం ముగించారు. చీకటి పడడంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైఖరిని విభేదిస్తూ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో సీఎం సభకు గైర్హాజరయ్యారు.
నేడు ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మొదట ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెర్వు వద్ద 12 గంటలకు సభకు హాజరుకాబోతున్నారు. తర్వాత 2 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో, చివరగా హనుమకొండ జిల్లా భట్టుపల్లిలో జరిగే సభల్లో పాల్గొంటారు. అన్ని ఏర్పాట్లు చేశారు.