Tummala Nageswara Rao : ఖమ్మంలో గులాబీ బేజారు
ABN , First Publish Date - 2023-09-02T02:29:19+05:30 IST
దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ పయనం.. జిల్లావ్యాప్తంగా అనుచర, అభిమాన గణం.. మూడు వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన నేపథ్యం.. ఏ పార్టీకైనా ఆ యనే బలం..
తుమ్మల బీఆర్‌ఎస్‌ను వీడితే ఓటు బ్యాంకుకు భారీ గండి!
జిల్లాలో పార్టీని బలోపేతం చేసింది ఆయనే.. 2014లో బీఆర్‌ఎస్‌కు 1.55లక్షల ఓట్లే
తుమ్మల చేరాక 2018లో కారుకు 6.74 లక్షల ఓట్లు!.. టీడీపీ ఓట్లను మళ్లించిన మాజీ మంత్రి
ఆయన గుడ్‌బై చెబితే కారుకు పంక్చరే.. ఇప్పటికే పొంగులేటి దూరం కావడంతో బలమైన దెబ్బ
తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్‌లో చేరితే ఎన్నికల్లో జోష్!
ఖమ్మం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ పయనం.. జిల్లావ్యాప్తంగా అనుచర, అభిమాన గణం.. మూడు వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన నేపథ్యం.. ఏ పార్టీకైనా ఆ యనే బలం.. తనకంటూ ప్రత్యేక బల గం.. ఇదీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్థానం..!
అలాంటి నాయకుడు ఎన్నికల ముంగిట అధికార బీఆర్‌ఎ్‌సను వీడనున్నారు. కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీకి ఈ పరిణామం ఉమ్మడి ఖమ్మంలో పెద్ద ఎదురుదెబ్బ కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తుమ్మల బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేస్తే ఆ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లోనూ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వయంగా హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రె్‌సలోకి రావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానంటూ ఇప్పటికే స్పష్టం చేసిన మాజీ మంత్రి.. అనుచరులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని రేవంత్‌కు సమాధానమిచ్చారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని తెలుస్తోంది.
పది నియోజకవర్గాలపైనా పట్టు
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబు వద్ద, తెలంగాణ వచ్చాక కేసీఆర్ మంత్రివర్గంలోనూ పలు శాఖలకు తుమ్మల మంత్రిగా వ్యవహరించారు. సీనియర్ నేతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపున్న ఆయన మంత్రిగా అభివృద్ధికి కృషి చేశారన్న పేరుతెచ్చుకున్నారు. అంతేగాక.. మూడు వేర్వేరు నియోజకవర్గాలైన సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలపైనా పట్టుంది. కాగా, తుమ్మల బీఆర్‌ఎ్‌సను వీడి.. అందులోనూ ఖమ్మంలో చెక్కుచెదరని ఓటు బ్యాంకున్న కాంగ్రె్‌సలోకి వెళ్తే, రాబోయే ఎన్నికల్లో గులా బీ పార్టీకి కోలుకోలేనంత నష్టమనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటితో పాటు ఆయన వర్గం కాంగ్రె్‌సలోకి వెళ్లింది. జిల్లాలో పొంగులేటికి కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో అనుబంధం ఉంటే.. తుమ్మలకు టీడీపీతో కూడిన ఓటు బ్యాంకు బలం ఉందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
గులాబీ పార్టీని పటిష్ఠ పరిచింది ఆయనే..
తుమ్మల బీఆర్‌ఎ్‌సలో చేరకముందు ఖమ్మంలో ఆ పార్టీ నామమాత్రమే. గ్రామాల్లో అసలు పట్టు దొరకని పరిస్థితి. వాస్తవానికి 2014లో తుమ్మల టీడీపీ నుంచి పోటీ చేసి ఖమ్మంలో ఓడిపోయారు. కానీ, టీడీపీ బలం, బలగం అంతా ఆయన వైపే ఎక్కువగా ఉంది. ఇక నాటి ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎ్‌సకు వచ్చిన ఓట్లు కేవలం 1,55,850. ఇందులో కొత్తగూడెం నుంచి గెలిచిన జలగం వెంకట్రావుకే 50,688 ఓట్లు పడ్డాయి. టీడీపీకి మాత్రం మూడు రెట్లు అధికంగా 4,77,413 ఓట్లు వచ్చాయి. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆహ్వానించడంతో 2015లో అనుచర వర్గం, నాటి టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి తుమ్మల గులాబీ కండువా కప్పుకొన్నారు. అన్ని సామాజిక వర్గాల ముఖ్య నేతలను తనతో పాటు బీఆర్‌ఎ్‌సలోకి తీసుకెళ్లారు. టీడీపీ జెండాలు ఎగిరినచోటే ఊరూరా బీఆర్‌ఎస్ జెండాలు వచ్చాయి. 2016లో పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల 40 వేలపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
తుమ్మల చేరాక ఓట్లు నాలుగు రెట్లు
కొన్ని నియోజకవర్గాల్లో 2014లో బీఆర్‌ఎ్‌సకు 10 వేల నుంచి 20 వేలలోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, తుమ్మల చేరాక టీడీపీ ఓటు బ్యాంకు టీఆర్‌ఎ్‌సకు మళ్లింది. 2018 నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. టీడీపీని నిర్మించినట్లే గులాబీ పార్టీనీ పైకి తెచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణను గెలిపించుకున్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీ ఖమ్మం కార్పొరేషన్‌నూ చేజిక్కించుకుంది. 2018 ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎ్‌సకు 6,74,430 ఓట్లు రావడం తుమ్మల ప్రభావాన్ని చాటుతోంది. అంటే.. 2014లో టీడీపీకి వచ్చిన 4,77,413 ఓట్లు అమాంతం బీఆర్‌ఎ్‌సకు మళ్లినట్లు స్పష్టమవుతోంది.