ఐదు పడకలతో ‘కీమో’ వార్డు

ABN , First Publish Date - 2023-05-20T00:24:25+05:30 IST

రోజుకి రెండు వేల మంది రోగులు, 200 నుంచి 300 వరకు ఇనపేషంట్లు ఉండే ఖమ్మం జిల్లా ఆస్పత్రి వైద్యసేవల్లో మంచి గుర్తింపు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.కోట్ల విలువైన అత్యాధునిక యంత్ర సామగ్రిని ప్రభుత్వం సమకూరుస్తుండగా.. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది శక్తి వంచన లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

ఐదు పడకలతో ‘కీమో’ వార్డు
సిద్ధమవుతున్న కీమోథెరఫీ వార్డు

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్‌ బాధితులకు వైద్యం

త్వరలో ప్రారంభానికి సన్నాహాలు

ఖమ్మం కలెక్టరేట్‌, మే 19 : రోజుకి రెండు వేల మంది రోగులు, 200 నుంచి 300 వరకు ఇనపేషంట్లు ఉండే ఖమ్మం జిల్లా ఆస్పత్రి వైద్యసేవల్లో మంచి గుర్తింపు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.కోట్ల విలువైన అత్యాధునిక యంత్ర సామగ్రిని ప్రభుత్వం సమకూరుస్తుండగా.. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది శక్తి వంచన లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందుకు మెడికల్‌ కళాశాల ఏర్పాటు కూడా తోడ్పాటునిచ్చింది. ఇప్పటికే జిల్లా ఆస్పత్రిలో ప్యాలియేటివ్‌ కేర్‌ పేరుతో క్యాన్సర్‌ రోగులకు చికిత్సలు నిర్వహిస్తుండగా జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్‌ బాధితుల కోసం డేకేర్‌ సెంటర్‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఐదు పడకలతో కీమోథెరపీ వార్డును త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉందన్న విషయంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో జిల్లా ఆస్పత్రిలో కీమోథెరఫీ వార్డును ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ క్యాన్సర్‌కు ఉచిత నిర్ధారణ పరీక్షలతో పాటు వైద్యం అందించనున్నారు. ఇప్పటికే ప్యాలియేటివ్‌ కేర్‌ వార్డులో వైద్యసేవలను అందిస్తుండగా.. ఇకపై హైదరాబాద్‌ లాంటి నగరాలకు వెళాల్సిన అవసరం లేకుండా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్టులతో పాటు కీమోథెరపీని ఇక్కడే నిర్వహించనున్నారు. క్యాన్సర్‌ బాధితులకు తొలుత ఎంఎనజే క్యాన్సర్‌ ఆస్పత్రిలో కీమోతెరపీ ఇచ్చిన తర్వాత ఆరోగికి రెండు, మూడు డోసులకు అవసరమైన మందులు, థెరపీని అక్కడి వైద్యుల సలహాలమేరకు ఖమ్మం జిల్లా ఆస్పత్రిలోనే అందించనున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ డేకేర్‌ సెంటర్‌ను నిర్వహిస్తారు. దీనికోసం ఒక మెడికల్‌ ఆఫీసర్‌, ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఇప్పటికే శిక్షణ పొందారు. అత్యంత ఖరీదైన మందులు కూడా ఈ సెంటర్‌కు వచ్చాయి. సేవలు త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎనసీడీ పరీక్షల ఆధారంగా 1354 మంది వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా.. ఈ ఏడాది మార్చి 8వ తేదీన జిల్లాలో ప్రారంభమైన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో మహిళలకు క్యాన్సర్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఐదు నియోజకవర్గాలతో పాటు కామేపల్లి మండలంలో పీహెచసీకి అనుసంధానంగా ఈ పరీక్షలను జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించే మామోగ్రామ్‌ పరీక్షలను మార్చి 8నుంచి గురువారం వరకు (18వ తేదీ ) ఏడు నియోజకవర్గాల పరిధిలో 583మందికి నిర్వహించారు. వీరిలో 117 మందిని హైదరాబాద్‌కు రిఫర్‌ చేయగా 11మందికి క్యాన్సర్‌ నిర్ధారణైంది. వీరిలో ఐదుగురికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌గా, ఇద్దరికి సర్పిక్స్‌ క్యాన్సర్‌గా గుర్తించగా.. మరో నలుగురు ప్రైవేటులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Updated Date - 2023-05-20T00:24:25+05:30 IST