రామయ్యకు ‘ద్వాదశ’ వైభవం

ABN , First Publish Date - 2023-03-04T00:55:32+05:30 IST

భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నూతన సువర్ణ ద్వాదశ దివ్యవాహనాలకు ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా విశ్వక్సేనపూజ, పుణ్యహావచనం, రుత్విక్‌వరణం, రక్షాబంధనం, అనంతరం పుష్పాలంకరణ, జలాధివాసం, క్షీరాధివాసం, హోమం, శయనాధివాసం, ప్రాణప్రతిష్ఠ, మహపూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.

రామయ్యకు ‘ద్వాదశ’ వైభవం
తిరువీధి సేవలో స్వామివారు

ఘనంగా 12 నూతన సువర్ణ వాహనాల ప్రతిష్ఠోత్సవం

శోభాయమానంగా స్వామివారికి తిరువిధి సేవ

భద్రాచలం, మార్చి 3: భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నూతన సువర్ణ ద్వాదశ దివ్యవాహనాలకు ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా విశ్వక్సేనపూజ, పుణ్యహావచనం, రుత్విక్‌వరణం, రక్షాబంధనం, అనంతరం పుష్పాలంకరణ, జలాధివాసం, క్షీరాధివాసం, హోమం, శయనాధివాసం, ప్రాణప్రతిష్ఠ, మహపూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. మూడు శతాబ్దాల క్రితం భక్తరామదాసు స్వామి వారి తిరువీధి సేవలకు గాను 12రకాల వాహనాలను తయారు చేయించారు. అవి జీర్ణోద్ధరణకు చేరడంతో భద్రాద్రి దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది చేసిన విన్నపం మేరకు.. అమెరికాలోని ప్రవాసభారతీయ వాసవీ సంఘం సానుకూలంగా స్పందించింది. సుమారు రూ.75 లక్షలతో తమిళనాడులోని కుంభకోణంలో హనుమత, సార్వభౌమ, గరుఢ, హంస, గజ, ఆదిశేషు, సింహ, సూర్యప్రభ, చంద్రప్రభ, కల్పవృక్ష, అశ్వ, సింహాసనం వాహనాలను తయారు చేయించారు. ఇటీవల వాటిని భద్రాచలం దేవస్థానానికి అందించగా.. శుక్రవారం సంప్రదాయ బద్ధంగా వాహన ప్రతిష్ఠ నిర్వహించారు. సాయంత్రం 12 నూతన వాహనాలతో సీతారామచంద్ర స్వామి తిరువీధి సేవను శోభాయమనంగా జరగ్గా.. శనివారం సార్వభౌమ వాహన సేవ నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు, ఉత్సవ ఆహ్వాన కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, కోటి రామస్వరూప్‌ రాఘవాచార్య, అదర్వ వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, డా. ఎస్‌ఎల్‌ కాంతారావు, చారుగుళ్ల శ్రీనివాస్‌, ఎస్‌ఎనవీ రామారావు, గట్టు వెంకటాచార్య, బండారు కృష్ణయ్య, ధనుంజయ్‌ పాల్గొన్నారు.

7న డోలోత్సవం, వసంతోత్సవం,

కల్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం

ఈనెల 22వతేదీ నుంచి ఏప్రిల్‌ 5 వరకు భద్రగిరిలో జరగనున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 30న స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో హోలీ పౌర్ణమి సందర్భంగా 7వతేదీన డోలోత్సవం, వసంతోత్సవానికి అంకురార్పణ చేయనున్నారు. హోలీ రోజైన మంగళవారం రామయ్యకు డోలోత్సవం, వసంతోత్సవం, స్వామివారికి సహస్రధారతో ప్రత్యేక స్నపనం నిర్వహించనున్నారు. ఇక అదేరోజు కల్యాణ తలంబ్రాల తయారీకి కూడా దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. నవమి కల్యాణం కోసం మొత్తం 180క్వింటాళ్ల కల్యాణ తలంబ్రాలను సిద్ధం చేయనుండగా తొలి రోజున 10క్వింటాళ్లు తయారు చేయనున్నారు.

Updated Date - 2023-03-04T00:55:32+05:30 IST